DailyDose

  కేసీఆర్‌ మెదక్‌ పర్యటన వాయిదా-TNI నేటి తాజా వార్తలు

  కేసీఆర్‌ మెదక్‌ పర్యటన వాయిదా-TNI నేటి తాజా వార్తలు

కేసీఆర్‌ మెదక్‌ పర్యటన వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ టూర్ వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా టూర్ వాయిదా వేస్తున్నట్టుగా సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి 2023 ఆగస్టు 19 న కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అక్కడ బీఆర్ఎస్ ఆఫీస్ తో పాటు, జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా దానిని ఆగస్టు 23కు వాయిదా వేశారు. ఈ నెల 19 రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ టూర్ వాయిదా పడింది.

* ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత

ఖమ్మం నూతన కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్‌ ముట్టడిని పిలుపునిచ్చారు. ముట్టడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీంతో, ఖమ్మం కలెక్టరేట్‌ గేట్లను పోలీసులు మూసివేశారు. ఈ క్రమంలో​ రోడ్డుపై బైఠాయించి అఖిలపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.ఈ సందర్బంగా అఖిలపక్ష పార్టీల నేతలు నాగపూర్‌-అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేపే అలైన్‌మెంట్‌ మార్చాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేను బ్రౌన్‌ ఫీల్డ్‌ హైవేగా మార్చాలని డిమాండ్‌ చేశారు. హైవే విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ప్రైవేటు మార్కెట్‌ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక, కలెక్టరేట్‌ వద్ద సీపీఐ రాష్ట్ర కార్శదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతు పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. రైతును చిన్నచూపు చూస్తున్నారు. ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రభుత్వాలు ఉద్యోగుల కాళ్ల వద్దకు వస్తున్నాయి. రైతుకు ఆ పరిస్థితి లేదు. పోలీసులతో ఇబ్బంది పెడితే ఖమ్మంను స్తంభింప చేస్తాం. పోరాడితేనే మన భూములు మనకు మిగులుతాయి. వద్దన్న రోడ్లు వేస్తున్నారు.. కావాలన్న రోడ్లు వేయడం లేదు. బీఆర్‌ఎస్‌కు మేము చెబితే వినే పరిస్థితి లేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. రైతుల భూ పోరాటం తీవ్ర స్థాయికి చేరింది. రైతులు చూపిన త్యాగం, ధైర్యంతోనే పోరాటం విజయం సాధిస్తుంది. రైతుల పోరాటానికి సీపీఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది. రైతులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడం లేదు. ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. రైతు పోరాటం వీధి పోరాటం కాదు, చట్టబద్ధమైన పోరాటం. 90శాతం మంది రైతులు అంగీకరిస్తేనే ప్రభుత్వం రైతుల నుండి భూమిని తీసుకోవాలని చట్టంలో ఉంది. తక్కువ నష్టం అయ్యే భూమినే ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంది. మార్కెట్ విలువకు 3 రెట్లు ఎక్కువ కట్టించి రైతులకు ఇవ్వాలి. 2016లో భూసేకరణ చట్ట ప్రకారం రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జన్మదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కేజ్రీవాల్ ఈ రోజు 55వ పడిలో అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. ‘ఢిల్లీ సీఎం శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు దీర్ఘాయిష్షుతో, సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.కాగా, ఇటీవల ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సందర్భంగా బీజేపీపై ఆప్ తీవ్ర విమర్శలు చేసింది. ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యతిరేకించినప్పటికీ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

టీడీపీ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరుతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. అయితే రానున్న ఎన్నికల్లో ఏయే పార్టీలు కలిసి బరిలో నిలుస్తాయనే దానిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. వైసీపీ తాము సింగిల్‌గానే బరిలో నిలుస్తామని పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా?, లేదా ఎన్డీయే కూటమిలో చేరుతుందా?, లేదా జనసేన పార్టీని మాత్రమే  కలుపుకుని ముందుకు సాగుతుందా? అనే చర్చ గత కొంతకాలంగా సాగుతుంది. అయితే టీడీపీ తిరిగి ఎన్డీయే గూటికి చేరుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. ఈ పరిణామాలపై చంద్రబాబు స్పందించారు. దీనిపై సరైన సమయంలో మాట్లాడతానని చెప్పారు. మంగళవారం సాయంత్రం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజన్-2047 డాక్యుమెంట్‌ను విడుదల చేసిన అనంతరం చంద్రబాబు ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమిలో చేరే ప్రణాళిక గురించి ప్రశ్నించగా..  ఎన్డీయే ప్రభుత్వంలో చేరడంపై మాట్లాడే సమయం ఇది కాదని, సరైన సమయంలో దీనిపై మాట్లాడతానని చంద్రబాబు అన్నారు. ఇక, 2024లో జాతీయ రాజకీయాల్లో తన పాత్ర చాలా స్పష్టంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘నా ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్. ఇది నా పెద్ద ఎజెండా. రాష్ట్ర పునరాభివృద్దికి, పునర్నిర్మాణానికి నేను సిద్ధం చేస్తాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో కూర్చున్నారు.. సచివాలయంలో కూర్చున్నారు.. కేబినెట్‌ సమావేశాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు?.. ఇది తాత్కాలికమా? . గత పదేళ్లుగా అవి పనిచేస్తున్నాయి. అంతా సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయి రాజధానిని ప్లాన్ చేశాం. నేను తొమ్మిదేళ్లపాటు హైదరాబాద్ కోసం క్రమపద్ధతిలో అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థను ప్లాన్ చేశాను’’ అని చంద్రబాబు నాయుడు చెప్పారు.  ఇక, గతంలో ఎన్డీయే కూటమిలో టీడీపీ  కీలక  భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ, బీజేపీ  కలిసే పోటీ చేశాయి. అయితే ధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రంలో మోదీ సర్కార్ నిరాకరించడాన్ని నిరసిస్తూ ఎన్డీయే కూటమి నుంచి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ 2018లో  బయటకు వచ్చింది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత కోసం చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు చేశారు. అయితే అవి పెద్దగా ఫలించలేదు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో నిలిచిన టీడీపీ ఘోర పరాజయం ఎదురైంది. అయితే ఆ తర్వాత నుంచి తిరిగి ఎన్డీయే కూటమిలో చేరేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. 

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి రోడ్లు బ్లాక్

ఉత్తరభారతంలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి.ఢిల్లీలోని యమునది నీటిమట్టాలు ప్రమాద కర స్థాయికి హిమాచల్ ప్రదేశ్ లో డ్యాం పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు, గ్రామాలను వరదలు ముంచెత్తాయి. కాంగ్రాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాదాపు 100 మంది వరదల్లో చిక్కుకుని ఉన్నారు. వారిని రక్షించేందుకు హిమాచల్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. హిమాచల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రోడ్లు బ్లాక్ అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో శిథిలాల కిందనుంచి పౌరులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 60మందికి పైగా మృతిచెందాయి. హిమాచల్ ప్రదేశ్ లో వచ్చే రెండో రోజులు, ఉత్తరాఖండ్ లో మరో నాలుగు రోజులు పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.కాంగ్రాలో డ్యాం పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రా వెళ్తున్నట్లు హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు చెప్పారు. గత కొన్ని రోజులు కురుస్తున్న వర్షాలతో రాష్ట్రానికి దాదాపు 10వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సుఖ్వీందర్ సుఖు వెల్లడించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలను పునరుద్దరణకు దాదాపు సంవత్సర కాలం పడుతుందని అంచనా వేశారు. 

నేడు మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతి

నేడు(బుధవారం) దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి వర్థంతి. ఈ నేపథ్యంలో వాజ్‌పేయికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌ సహా కేంద్రమంత్రులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ స్మారక చిహ్నం వద్ద వాజ్‌పేయి కుటుంబ సభ్యులతో సహా వీరంతా నివాళులు అర్పించారు.

పాక్ స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఇమ్రాన్‌ఖాన్‌కు ఘోర అవమానం

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఆ దేశానికి వన్డే ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్‌ఖాన్‌కు దారుణ పరాభవం ఎదురైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ఇమ్రాన్‌ను విస్మరించడం విమర్శలకు కారణమైంది. పీసీబీ విడుదల చేసిన వీడియోలో పాకిస్థాన్ గ్రేటెస్ట్ ఆటగాళ్లను ప్రస్తావించిన బోర్డు.. 1992లో దేశానికి ప్రపంచకప్‌ను అందించిపెట్టిన ఇమ్రాన్‌ను గాలికి వదిలేసింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు పీసీబీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ‘షేమ్ ఆన్ పీసీబీ’ అని మండిపడుతున్నారు. పాక్ క్రికెట్ నుంచి ఇమ్రాన్‌ను తొలగించడం ఎవరికీ సాధ్యం కాదని కామెంట్లు చేస్తున్నారు. ఆయన ప్రతి క్రికెట్ లవర్ మదిలోనూ ఉంటాడని చెబుతున్నారు. పీసీబీ మాజీ చైర్మన్ ఖాలిద్ మహమూద్ కూడా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. వీడియోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు గళమెత్తాలని కోరారు.

* మనీష్‌ను మిస్ అవుతున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ చేసిన కేజ్రీవాల్

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జన్మదినం (Birthday). ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ (Modi).. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ (Stalin) కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని స్టాలిన్ ఆకాంక్షించగా.. భగవంతుడు కేజ్రీవాల్‌కు ఆరోగ్యవంతమైన జీవితం ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రార్థించారు. అయితే పుట్టినరోజు నాడు త‌న స్నేహితుడు మనీశ్ సిసోడియాను తలుచుకొని అరవింద్‌ కేజ్రీవాల్‌ భావోద్వేగానికి గురయ్యారు. తాను మనీష్‌ను మిస్ అవుతున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపాడు.ఈ రోజు నా పుట్టిన రోజు. చాలా మంది తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా ధన్యవాదాలు! కానీ నా పుట్టిన రోజు నాడు నేను మనీష్ సిసోడియా (Manish Sisodia)ని మిస్ అవుతున్నాను. తప్పుడు కేసులో జైల్లో ఉన్నాడు. ఈ రోజు అందరూ ప్రతిజ్ఞ చేద్దాం భారతదేశంలో జన్మించిన ప్రతి బిడ్డకు ఉత్తమమైన నాణ్యమైన విద్యను అందించడానికి మా శక్తి మేరకు మేము ప్రతిదీ చేస్తాము. అది బలమైన భారత్‌కు పునాది వేస్తుంది. అది భారత్‌ను నంబర్ 1గా చేయాలనే మా కలను సాకారం చేయడంలో సహాయపడుతుంది. అది కూడా మనీష్‌ను సంతోషపరుస్తుంది అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్ రాసుకోచ్చారు.కాగా మద్యం పాలసీ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత, ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్‌ సిసోడియా అరెస్టయ్యిన విష‌యం తెలిసిందే. ఈ కేసు విచారణను సెప్టెంబరు 4కు వాయిదా వేసింది.

హైదరబాదీలకు కేటీఆర్ గుడ్ న్యూస్

పేద, మద్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్ట్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం. గతంతో ఇచ్చిన హామీ మేరకు భారీగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిన బిఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీని కూడా ప్రారంభించింది. ఇక ప్రస్తుతం ఎన్నికల సమయం కాబట్టి భారీగా డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో నిర్మించిన ఇళ్ల పంపిణీని మరింత వేగవంతం చేయాలని… ఆ దిశగా సత్వర చర్యలు చేపట్టాలని పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్ లో జరిగిన ఈ సమావేశంలో  హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 70 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని అధికారులు కేటీఆర్ కు తెలిపారు. అయితే అర్హులను గుర్తించే ప్రక్రియకూడా వేగంగా కొనసాగుతోందని… ఇళ్లకోసం అందిన దరఖాస్తులను పరిశీలన దాదాపు పూర్తి కావచ్చిందని అధికారులు తెలిపారు. నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్దంగా వున్న ఇళ్ల పంపిణీ విడతల వారిగా చేపట్టాలని… వారం రోజుల్లో మొదటి విడత పంపిణీ ప్రారంభం కానుందని కేటీఆర్ ప్రకటించారు. మొత్తం 70 వేల ఇళ్లను ఆరు దశల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి  ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసితో పాటు సంబంధిత అధికారులను ఆదేశించారు.ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లను అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అధికారులే క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తిస్తున్నారని… ఈ ప్రక్రియ కొనసాగుతుంటుందని అన్నారు. గూడులేని పేదవారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లను అందిస్తామని… ఎవరూ ఆందోళనకు గురికావద్దని  మంత్రి కేటీఆర్ సూచించారు. ఇక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరినీ వాటి కేటాయించనున్న ఇండ్ల వద్దనే అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని మంత్రులు కేటీఆర్ కు సూచించారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే విషయాన్ని కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు. ఇలా డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని వచ్చేవారం నుండి ప్రారంభించి ఎన్నికల నాటికి పూర్తిచేయనున్నారు. 

 ఎమ్మెల్సీ అనంత్‌బాబు కేసులో పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

అమరావతి: ఎమ్మెల్సీ అనంత్‌బాబు కేసులో ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. అనంత్‌బాబు కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టులో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు పిటిషన్‌ దాఖలు చేశారు. సీసీ ఫుటేజ్‌లో ఉన్నవారిని ఎందుకు కేసులో చేర్చలేదని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం అనంత్‌బాబును మాత్రమే చేర్చడం ఏంటని ప్రశ్నించింది. కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌ తెలిపారు. కేసును పోలీసులు నీరుగార్చేలా వ్యవహరించారని చెప్పారు. ఇప్పటికే కేసు వివరాలు సీల్డ్‌ కవర్‌లో ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది.