DailyDose

సిజేరియన్‌ చేసి కడుపులోనే కత్తెర మరిచిపోయిన డాక్టర్-TNI నేటి నేర వార్తలు

సిజేరియన్‌ చేసి కడుపులోనే కత్తెర మరిచిపోయిన డాక్టర్-TNI నేటి నేర వార్తలు

కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

 ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌లోని కోటా (Rajasthan’s Kota)లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్‌లోని గయకు చెందిన 18 ఏండ్ల వాల్మీకి జాంగిద్‌గా మృతుడ్ని గుర్తించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రవేశం కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్ష కోసం కోటాలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో అతడు చదువుతున్నాడు. దీని కోసం గత ఏడాది నుంచి మహానగర్‌ ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే ప్రిపరేషన్‌ ఒత్తిడి వల్ల మంగళవారం రాత్రి సూసైడ్‌ చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా, కోచింగ్‌ హబ్‌ అయిన రాజస్థాన్‌లోని కోటాలో ఒత్తిడి వల్ల విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతున్నది. ఈ నెలలో నలుగురు విద్యార్థులు సూసైడ్‌ చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 22 సంఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింటి. అలాగే విద్యార్థులకు సహాయం కోసం ఒక హెల్ప్‌లైన్‌ కూడా ఏర్పాటు చేసింది.

నకిలీ వేలిముద్రలతో బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీ

నకిలీ వేలిముద్రల ఆధారంగా ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతా నుంచి నగదును డ్రా చేస్తున్న ఐదుగురు అంతర్ జిల్లా సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిని వైఎస్‌ఆర్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ మీడియా ఎదుట హాజరు పరిచారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఐదుగురిపై దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. వారిపై 412 ఫిర్యాదులు రాగా.. 416 మంది బాధితులను గుర్తించారు. కడప చిన్నచౌక్‌కు చెందిన శంకరయ్య ఖాతా నుంచి రూ.5,500 నగదును అతడికి తెలియకుండా సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. తనకి ఓటీపీ రాలేదని.. ఎలాంటి లింక్‌లు కూడా క్లిక్‌ చేయలేదని శంకరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విచారించగా నకిలీ వేలిముద్రల ద్వారా నగదును డ్రా చేసినట్టు విచారణలో తేలింది. దీంతో నిందితుల వివరాలను పోలీసులు సేకరించి ఐదుగురు అంతర్ జిల్లా సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. ఇప్పటివరకు నిందితులు 12 ఖాతాల ద్వారా రూ.5.9 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు.

*  మూసీ ఒడ్డున డ్రైవర్‌ హత్య, మృతదేహం దహనం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సుమారు 10 రోజుల క్రితం ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచి హత్య చేసి మృతదేహాన్ని మూసీ ఒడ్డున దహనం చేసిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. దొంగిలించిన సొత్తును పంచుకోవడంపై వాగ్వాదం చెలరేగడంతో వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.బాధితుడిని ఎండీ ఇమ్రాన్ (23) గా గుర్తించారు. అతనికి క్రిమినల్ రికార్డ్ ఉంది. ఓ హత్య కేసు, రెండు ఆస్తి వివాదాలలో నిందితుడు. అతడిని హత్య చేసిన కేసులో ఆరుగురు నిందితుల్లో నలుగురికి నేర చరిత్ర కూడా ఉందని సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ కె శ్రీనివాస్ తెలిపారు.ఆగస్టు 5న ఉదయం ఇమ్రాన్‌ సరూర్‌నగర్‌లోని భగత్‌సింగ్‌ నగర్‌లో తన ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. ఇమ్రాన్ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తల్లి ముంతాజ్‌తో స్నేహితుడైన సత్తిని కలవడానికి వెళుతున్నానని చెప్పాడు. రాత్రి అతనికి ఫోన్ చేసినప్పుడు స్కూటర్ రిపేర్ వచ్చిందని.. అది చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడని చెప్పాడని రాచకొండ పోలీసు తెలిపారు.ఆగస్టు 6వ తేదీ కూడా ఇమ్రాన్ రాకపోవడం, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో.. తల్లి ముంతాజ్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 7 వరకు అతని కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆగస్టు 7న సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.పోలీసులు ఇమ్రాన్ కాల్ వివరాలను విశ్లేషించారు. అతని స్నేహితుల గురించి కూడా ఆరా తీశారు. సోమవారం హత్యకు పాల్పడిన సతీష్ అలియాస్ సత్తి, ఎస్ శేఖర్, బీ అరుణ్ కుమార్, ఆర్ శ్యామ్ సుందర్, కే రాహుల్‌లను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సోను సింగ్ అలియాస్ లక్ష్మణ్ సింగ్ పరారీలో ఉన్నాడు.

రెస్టారెంట్‌లో చికెన్ కూరలో ఎలుక

 ఓ క‌స్ట‌మ‌ర్ చికెన్‌కు ఆర్డ‌రివ్వ‌గా అందులో చ‌నిపోయిన ఎలుక క‌నిపించిన ఘ‌ట‌న ముంబై బాంద్రాలోని ఓ ప్ర‌ముఖ రెస్టారెంట్‌లో వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి క‌స్ట‌మ‌ర్ ఫిర్యాదు ఆధారంగా రెస్టారెంట్ మేనేజ‌ర్‌, చెఫ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.బాంద్రా వెస్ట్‌లోని పాలిహిల్‌లో భోజ‌నం చేసేందుకు ఫ్రెండ్‌తో క‌లిసి అనురాగ్ సింగ్ వెళ్లాడు. వారు చికెన్‌, బ్రెడ్‌తో మ‌ట‌న్ తాలి ఆర్డ‌ర్ చేశారు. త‌మ‌కు స‌ప్లై చేసిన ఫుడ్‌ను తింటుండ‌గా మాంసం ముక్క రుచిలో తేడా అనిపించ‌డంతో అందులో చిన్న ఎలుక క‌నిపించింది.దీంతో రెస్టారెంట్ మేనేజ‌ర్‌ను వారు ప్ర‌శ్నించ‌గా స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేదు. మేనేజ‌ర్ తీరుపై ఆగ్ర‌హంతో వారు బాంద్రా పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా బాంద్రా పోలీసులు రెస్టారెంట్ మేనేజ‌ర్‌, చెఫ్ వివియ‌న్ అల్బ‌ర్ట్ శిక‌వ‌ర్‌, చికెన్ స‌ప్ల‌య‌ర్ల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

సిజేరియన్‌ చేసి, కడుపులోనే కత్తెర మరిచిపోయిన డాక్టర్

ఏలూరులో వైద్యుల నిర్వాకం ఓ మహిళ ప్రాణాల మీదికొచ్చింది. జిల్లా బోధనాసుపత్రిలో మహిళ పొట్టలో శస్త్ర చికిత్సకు ఉపయోగించే కత్తెర ఉంచి కుట్లు వేశారు. వివరాల్లోకి వెళితే.. పెదపాడు మండలం ఎస్.కొత్తపల్లి గ్రామానికి చెందిన జి.స్వప్న అనే మహిళ ప్రసవం కోసం ఏప్రిల్ 19న తేదీన ఏలూరు బోధనాసుపత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. డిశ్చార్జి అయిన అనంతరం స్వప్న ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత తరచూ ఆమెకు కడుపులో నొప్పి వచ్చేది. సాధారణంగా వచ్చే నొప్పే అనుకుని మందులు వాడేది.అయితే ఈనెల 8న స్వప్నకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో తిరిగి ఏలూరులోని బోధనాసుపత్రికి చేరుకుంది. అక్కడ వైద్యులు పరీక్షించి విజయవాడ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అక్కడ అసలు విషయం బయటపడింది. ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు ఎక్స్‌రే ద్వారా బయటపడింది. ఏలూరు బోధనాసుపత్రిలో సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసిన డాక్టర్లు.. ఆపరేషన్‌కు ఉపయోగించిన కత్తెరను కడుపులో ఉంచి కుట్లు వేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శశిధర్‌ను వివరణ కోరగా ఈ విషయం వాస్తవమేనని తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌ స్పందించి విచారణ కమిటీ వేశారు.

వరంగల్ జిల్లాలో హైవే పై ఘోర ప్రమాదం

వాళ్లంతా తేనెను సేకరించి విక్రయాలు జరుపుతుంటారు.. అదే వారికి జీవనాధారం.. ఎప్పటిలానే అటవీ ప్రాంతంలో తేనె సేకరించి అమ్ముకునేందుకు పట్టణానికి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చి.. అందరినీ కబళించింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై అతివేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జైంది.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు అంతా తేనె విక్రయాలు జరుపుకునే వారని పోలీసులు తెలిపారు. ఆటోలో తేనె తీసుకొని వరంగల్ కు వస్తుండగా అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టిందని.. అక్కడికక్కడే నలుగురు మృతిచెందినట్లు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.రాజస్థాన్ చెందిన లారీ డ్రైవర్ మద్యం, నిద్ర మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొంటున్నారు. నిద్రమత్తులో డ్రైవర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతోనే దినసరి కులీలు మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 క్యాన్సర్ వ్యాధి ఉందని ఓ ముసలాయనని ముగ్గులోకి దించిన ఒక మహిళ

 ఇవి మంచితనానికి రోజులు కావని అంటుంటారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా ఒక ఉదంతం వెలుగు చూసింది. కొడుకుకి క్యాన్సర్ వ్యాధి ఉందని ఓ ముసలాయనని ముగ్గులోకి దించిన ఒక మహిళ.. ఆయన్ను హనీట్రాప్ ఉచ్చులో బిగించి, లక్షలకి లక్షలు కాజేసింది. అప్పటికీ దాహం తీరక మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో.. చివరికి ఆయన పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అలా ఆ మహిళ అడ్డంగా బుక్కైంది. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..యశ్వంతపురలో ఉంటున్న ఒక ముసలాయన (60) బాగా డబ్బున్నవాడు. ఈయనకు గతంలో ఒక మహిళతో పరిచయం ఉంది. ముసలాయన బాగా రిచ్ అనే విషయం తెలిసిన ఆ మహిళ, ఆయన వద్ద నుంచి డబ్బులు కొట్టేసేందుకు ఒక నాటకం ఆడింది. తొలుత తన అబ్బాయికి క్యాన్సర్ వ్యాధి ఉందని, చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరింది. దీంతో ఆయన కరిగిపోయి రూ.5 వేలు ఇచ్చాడు. ఇలా వేల రూపాయలతో వర్కౌట్ అవ్వదని భావించిన ఆ మహిళ.. మరో పెద్ద స్కెచ్ వేసింది. ఆయన్ను ముగ్గులోకి దింపి, శారీరకంగా దగ్గరైంది. ఒక హోటల్‌కి తీసుకెళ్లి.. ఆయనతో రాసలీలలు కొనసాగించింది. ఈ రాసలీలల్ని తన సోదరి చేత సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేయించింది.అంతే.. వారం రోజుల తర్వాత ఆ వీడియోలని ముసలాయనకి పంపించి, బెదిరింపులకు పాల్పడ్డం మొదలుపెట్టింది. తనకు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. ఆ వీడియోల్ని వైరల్ చేస్తానని హెచ్చరించింది. తన పరువు పోతుందన్న భయంతో.. ఆ ముసలాయన వారి బెదిరింపులకి లొంగాడు. ఇంకేముంది.. దశలవారీగా వాళ్లు ఆయన వద్ద నుంచి రూ.82 లక్షలు గుంజారు. అయినా వారి వేధింపులు ఆగలేదు. మరో రూ.40 ఇవ్వాలని ఒత్తిడి చేశారు. లేకపోతే అత్యాచారం కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. దాంతో.. ఆ ముసలాయన పోలీసుల్ని సంప్రదించాడు. తమపై కేసు పెట్టాడన్న విషయం తెలిసి.. ఆ మహిళలు పారిపోయారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

హైదరాబాద్ క్యూ నెట్‌ కేసులో కీలక పరిణమాణం

హైదరాబాద్‌ కేంద్రంగా క్యూ నెట్‌  విహాన్‌ డైరెక్టు సెల్లింగ్‌ పేరుతో మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ మోసాలకు పాల్పడుతున్న వ్యవహారంలో కీలక నిందితుడు ఉపేంద్రనాథ్‌ రెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరు నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉపేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నట్టుగా సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న హైదరాబాద్ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరిచి.. తర్వాత హైదరాబాద్‌కు తరలించి అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోని కాల్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో  ఈ సంస్థకు  చెందిన ఆరుగురు ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. దీంతో క్యూ నెట్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కొన్నేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం మల్టీమార్కెటింగ్‌పై నిషేధం విధించడంతో క్యూనెట్ కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే రాజేష్ కన్నా, ఉపేంద్రనాథ్ రెడ్డిలు మరికొందరితో కలిసి సంస్థ పేరుమార్చి విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ఘటన విచారణలో ఈ మల్టీలెవల్‌ మార్కెటింగ్ మోసం బయటపడింది. నిందితులు నిరుద్యోగ యువకులు, అమాయక ప్రజల నుంచి అధిక రాబడి వస్తుందని వాగ్దానం చేసి డబ్బు వసూలు చేసినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మహంకాళి పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ కేసులు సీసీఎస్  బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సీసీఎస్‌ పోలీసులు ఈ ఏడాది మే 30న క్యూనెట్‌ ప్రధాన నిర్వాహకుడు రాజేష్‌ ఖన్నాను అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడైన ఉపేంద్రనాథ్ గురించి అన్వేషణ కొనసాగిస్తున్న పోలీసులు.. తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. 

ప్రేమించిన యువతి మోసం చేసిందని  ఆత్మహత్య ఓ సాఫ్ట్‌వేర్‌

 క్షణికావేశంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రాణంగా ప్రేమించిన యువతి మోసం చేసిందని కన్నవారికి తీరని కడుపుకోత మిగిల్చాడు. అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలంలో దొరికిన సూసైట లెటర్‌ ఆధారంగా ప్రేమ విఫలమైన కారణంగా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషాద ఘటన విశాఖ సీతంపేట గణేశ్‌నగర్‌లో మంగళవారం (ఆగస్టు 15) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన పి రాంప్రసాద్‌ (30) అనే వ్యక్తి ఉద్యోగ రీత్యా సాఫ్ట్‌వేర్‌. విశాఖపట్నం సీతంపేట గణేశ్‌నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ శంకరమఠంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ మంగళవారం ఉదయం అతను ఉంటున్న అద్దె ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంప్రసాద్‌ స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. స్టేషన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలిలో మృతుడు రాసిన సూసైడ్‌ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని, అందువల్లనే ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు ఉందని ఎస్‌ఐ ధర్మేంద్ర మీడియాకు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*  నడిరోడ్డుపై ఓ వ్యక్తిని తలకి తుపాకి కాల్చి చంపిన దుండగులు

సమాజంలో హత్యలు అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తరువాత వీటికి సంబంధించిన దృశ్యాలు సైతం వైరల్ గా మారుతున్నాయి. మనిషి ప్రాణాలకు విలువ లేకుండా చిటెకెలు ప్రాణాలు తీస్తున్నారు. శిక్షలకు భయపడకుండా నేరాలకు పాల్పడుతున్నారు. పట్టపగలైనా, నడిరోడ్డుపై అయినా భయం లేకుండా హత్యలకు పాల్పడుుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసిన ఇటువంటి వారిలో మార్పు రావడం లేదు. తాజా ఇలాంటి వాటికి అద్దం పట్టే ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.రోజురోజుకు ఉత్తరప్రదేశ్ లో దిగజారుతున్న పరిస్థితులకు దీనిని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దుండగులు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని తలకి తుపాకి గురిపెట్టి కాల్చి చంపారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ సమయంలో 18 నెలల తన చిన్నారి కూడా అతని భుజంపై ఉంది. ఇది చూసిన చిన్నారి భయంతో వణికిపోయింది. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో జరిగిన ఈ భయంకరమైన హత్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో షోయబ్ అనే 28 ఏళ్ల వ్యక్తి తన 18 నెలల చిన్నారిని భుజాలపై ఎక్కించుకొని ఆనందంగా కబుర్లు చెబుతూ నడుస్తూ ఉంటాడు. తన కోసం మృత్యువు ఎదురుచూస్తుందని తెలియని అతను చుట్టుపక్కలు అంతగా గమనించకుండా చిన్నారితో ఆనందంగా మాటలు చెబుతూ ఉంటాడు. ఇంతలో అతని ఎదురుగా వస్తున్న వ్యక్తి సడెగా గన్ తీసి అతని తలపై కాలుస్తాడు. దీనితో ఆ వ్యక్తి ఒక్కసారిగా నేలపై విలవిలలాడుతూ పడిపోతాడు. అతని వెనుక బైక్ పై మరో ఇద్దరు వెయిట్ చేస్తూ ఉండగా షోయబ్ ను కాల్చిన వెంటనే నిందితుడు ఆ బైక్ ఎక్కి వెళ్లిపోతాడు. అనంతరం చుట్టుపక్కల వారు వచ్చి షోయబ్ ను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చూసిన వారి గుండెలను పిండేస్తోంది.షోయబ్ బతకాలని ఇది చూసిన వారు ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా ఇవన్నీ చూసిన ఆ చిన్నారి ఎంత భయపడి ఉంటుందో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ పనికి ఒడిగట్టిన వారిని వదలొద్దని పట్టుకొని వెంటనే శిక్ష విధించాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.