Business

ధర్నా వాయిదా వేసిన విద్యుత్ ఉద్యోగులు-TNI నేటి వాణిజ్య వార్తలు

ధర్నా వాయిదా వేసిన విద్యుత్ ఉద్యోగులు-TNI నేటి వాణిజ్య వార్తలు

*  ధర్నా వాయిదా వేసిన విద్యుత్ ఉద్యోగులు

విద్యుత్ ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ చేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కార్యాచరణ ఇచ్చామని విద్యుత్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సుబ్బిరెడ్డి తెలిపారు. ఈ అంశంపై ఆగస్టు 17వ తేదీన విద్యుత్ సౌధ వద్ద తలపెట్టిన మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో దీన్ని తాత్కాలికందా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ధర్నాకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నామని వెల్లడించారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాక స్ట్రగుల్ కమిటీ ధర్నా నిర్వహిస్తుందని.. అనంతరం మహాధర్నా తేదీని ప్రకటిస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే విద్యుత్ ఉద్యోగులకు కూడా కనీసం 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ ఉద్యోగులకు ప్రకటించిన 8శాతం ఫిట్‌మెంట్‌ను స్ట్రగుల్ కమిటీ అంగీకరించడం లేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ విధానాన్ని తొలగించి విద్యుత్ యాజమాన్యాలే నేరుగా కార్మికులకు వేతనం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

వామ్మో..దీని ధర కేజీకి 2 లక్షలు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా కుంకుమ పువ్వు నిలుస్తోంది. కేజీ కుంకుమ పువ్వు ధర రూ.2లక్షలు పలుకుతోంది. ఈ పువ్వుల తోటలు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా జమ్మూకశ్మీర్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఆహారం, ఔషదాలు, సౌందర్య ఉత్పత్తుల తయారీలో వీటిని వినియోగిస్తుంటారు. కాగా 1KG కేసరాలు రావాలంటే రెండు లక్షల కుంకుమ పువ్వులు అవసరం అవుతాయి. ఈ కారణాల దృష్ట్యా వీటి రేటు అంతకంతకూ పెరిగిపోతోంది.

*  హైదరాబాద్‌లో రాబోతున్న ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీ

హైదరాబాద్‌లో రాబోతున్న ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారు కానున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌ నుంచి ఐఫోన్‌ తయారీదారు యాపిల్‌.. తమ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ ఎయిర్‌పాడ్స్‌ ఉత్పత్తిని ఇక్కడ ప్రారంభించనుందని సంబంధిత వర్గాలు పీటీఐకి తెలిపాయి. 3 నెలల క్రితం ఈ ఏడాది మే 15న హైదరాబాద్‌ సమీపంలోని కొంగర కలాన్‌ వద్ద తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ 500 మిలియన్‌ డాలర్లతో తెస్తున్న తయారీ కేంద్రానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరవగా, ఈ ప్లాంట్‌తో 25,000 ఉద్యోగావకాశాలు రానున్నాయి.భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయని ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌, సీఈవో యంగ్‌ లియు అన్నారు. సంస్థ రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్‌ ఇండియా వార్షిక టర్నోవర్‌ 10 బిలియన్‌ డాలర్లకు చేరువైందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో వ్యాపార విస్తరణకు సంబంధించి తమకున్న ప్రణాళికల్ని పూర్తిస్థాయిలో ఆచరణలో పెడితే వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆస్కారముంటుందన్నారు. ‘ఫాక్స్‌కాన్‌ వార్షిక రెవిన్యూ మొత్తంగా 200 బిలియన్‌ డాలర్లు. పెరుగుతున్న భారతీయ మార్కెట్‌ పరిమాణం దృష్ట్యా.. ఇక్కడ మా వ్యాపార విస్తరణకు దిగితే ఆరంభంలోనే బిలియన్‌ డాలర్లలో పెట్టుబడులకు వీలున్నది’ అన్నారు. అలాగే ప్రస్తుతం దేశీయంగా ఫాక్స్‌కాన్‌ దాదాపు 9 క్యాంపస్‌లను నిర్వహిస్తున్నదని, దేశవ్యాప్తంగా 30కిపైగా ఫ్యాక్టరీలున్నాయని, 20కిపైగా వసతి గృహాలున్నాయని, అందులో సంస్థలో పనిచేస్తున్న వేలాది ఉద్యోగులు ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. యాపిల్‌తోపాటు, నోకియా, సిస్కో, సోని, షియామీ తదితర ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థల ఉత్పత్తులను ఫాక్స్‌కాన్‌ తయారు చేస్తున్న విషయం తెలిసినదే.

ఎస్‌బీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన స్పెషల్ ఎఫ్‌డీ పథకం ‘అమృత్ కలశ్ డిపాజిట్’ గడువును మరోసారి పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. రిటైల్ వినియోగదారులకు అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్న ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ గడువు ఆగష్టు 15తో ముగియగా, ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే సాధారణ ఖాతాదారులకు గరిష్ఠంగా 7.1 శాతం వడ్డీ ఇస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ అందిస్తోంది. 400 రోజుల కాలవ్యవధితో వచ్చే ఈ స్పెషల్ ఎఫ్‌డీ పథకం రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్లకు వర్తిస్తుంది. స్వల్ప కాలానికి పెట్టుబడి లక్ష్యం ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకంలో పెట్టిన మొత్తంపై రుణ సదుపాయం పొందే అవకాశం కూడా ఉంది. ఇక, అమృత్ కలశ్ స్పెషల్ ఎఫ్‌డీ కాకుండా మిగిలిన కాలవ్యవధులపై 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధులపై ఎస్‌బీఐ బ్యాంకు 3 శాతం నుంచి 7 శాతం మధ్య వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనంగా 3.5 శాతం నుంచి 7.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

ఐటీలో లేఆఫ్స్ సునామీ

2023లో టెక్ పరిశ్రమ ఉద్యోగుల తొలగింపులలో గణనీయమైన పెరుగుదలను చూసింది. దాదాపు 2లక్షల 26వేల మంది ఉద్యోగులను తొలగించాయి. గతేడాదితో పోలిస్తే ఉద్యోగుల తొలగింపులో దాదాపు 40 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఇది టెక్ రంగంలో తిరోగమన కాలాన్ని చూపిస్తుంది. 2022లో 2 లక్షల 2వేల మంది ఉద్యోగులను టెక్ కంపెనీలు తొలగించాయి. టెక్ పరిశ్రలో తొలగింపు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దీని ఫలితంగా అనేక కంపెనీలు మూతపడ్డాయి. 2023ని టెక్ పరిశ్రమలో చీకటి సంవత్సరంగా నిపుణులు పేర్కొంటున్నారు. 2022 జనవరి నుంచి డిసెంబరు వరకు టెక్ పరిశ్రమ తొలగింపులలో అన్యూహ్య పెరుగుదలను చూసింది. 1లక్షా 64వేల 744 మంది ఉద్యోగులు విడిచిపెట్టారు. ఈ సంఖ్య గతేడాది 15వేల కంటే దాదాపు పదకొండు రెట్లు ఎక్కువ.  దాదాపు 75,912 మంది వ్యక్తులు జనవరిలోనే ఉద్యోగాలు కోల్పోయారు. 2022లో నివేదించబడిన మొత్తం తొలగింపులలో దాదాపు సగం మంది ఉన్నారు.రిటైల్, క్రిప్టోకరెన్సీ,రవాణా వంటి చిన్న టెక్ కంపెనీలపై ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఎక్కువగా ఉంది. ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ కంపెనీలు టెక్ పరిశ్రమలో ఎన్నడూ లేనంతగా  తొలగింపులు ప్రకటించాయి. గత మూడేళ్లలో టెక్ కంపెనీలు దాదాపు 4లక్షల 5వేల మంది ఉద్యోగులతో తెగతెంపులు చేసుకున్నాయి. అప్పటినుంచి అదనంగా మరో 24 వేల మందికి పింక్ స్లిప్ లు ఇచ్చారు. తాజా నివేదిక ప్రకారం మొత్తం తొలగింపుల సంఖ్య 2లక్షల 26వేల117కి చేరుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, ద్రవ్యోల్బణం, రాబడి వృద్ధిలో క్షీణత, ట్రేడింగ్ వంటి అనేక అంశాలు ఉద్యోగాల కోత తీవ్రతరం కావడానికి ప్రధానం కారణం అయ్యాయని టెక్ కంపెనీలు అంటున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ పరిశ్రమ దిగ్గజాలు ఈ తొలగింపుల వేవ్‌లో ముందంజలో ఉన్నాయి.

బీఎన్‌ఎన్‌ఎల్ అమృత్‌ ఉత్సవ్‌ ఆఫర్‌

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ‘భారత్ ఫైబర్‌ అమృత ఉత్సవ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌తో బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు ఉచితంగా ఇంటర్నెట్‌ స్పీడ్‌ను 100 Mbpsకు పెంచుకొనే సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ హై స్పీడ్ ఇంటర్నెట్‌ను 10 రోజుల పాటు వినియోగించవచ్చని తెలిపింది.కాగా.. ఈ ఆఫర్‌ నెల రోజుల పాటు అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 15 వరకు ఈ ఆఫర్ లభిస్తుంది. అయితే ఈ లిమిటెడ్‌ టైమ్‌ ఆఫర్‌.. బీఎస్‌ఎన్‌ఎల్ ఎఫ్‌టీటీహెచ్‌ (FTTH) సర్కిల్‌లో ఉన్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినట్లు టెలికాం తెలిపింది. నెలవారీ రూ.449, రూ.499, రూ.599, రూ.666 రీఛార్జితో సేవలు వినియోగిస్తూ ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్న యూజర్లు మాత్రమే ఈ ఆఫర్‌ నుంచి లబ్ది పొందవచ్చు. ఈ ఆఫర్‌ను ఎలా పొందాలంటే.ముందుగా ‘My BSNL App’ను డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో రిజిస్టర్‌ అవ్వాలి.అందులో ఎఫ్‌టీటీహెచ్‌ (FTTH) అకౌంట్‌ నంబర్‌ యాడ్ చేయాలి.మీ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌కు ఇంటర్నెట్ స్పీడ్‌ పెంచుకొనేందుకు అర్హత ఉందో లేదో అక్కడ తెలుస్తుంది.  అకౌంట్‌ నంబర్‌ ఎంటర్ చేశాక, మీరు రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది దాని సాయంతో వెరిఫికేషన్ పూర్తవుతుంది.రిజిస్ట్రేషన్‌ పూర్తయిన 48 గంటల్లోనే మీ ఇంటర్నెట్ స్వీడ్ 100 Mbps వరకు పెరుగుతుంది.బూస్ట్‌ అయిన ఇంటర్నెట్‌ స్పీడ్‌ను 10 రోజుల పాటు ఆనందించవచ్చు.

దూసుకెళ్లిన ఇన్ఫోసిస్ షేర్లు

ఇన్ఫోసిస్ షేర్లపై మదుపర్లు ఆసక్తి చూపడంతో వాటి విలువ భారీగా పెరిగింది. సోమవారం క్లోజింగ్ 1393 కాగా.. ఇవాళ ఒక్కో షేరు విలువ 1419.5. మన దేశ సాఫ్ట్వేర్ దిగ్గజంతో యురోపియన్ టెలికాం కంపెనీ లిబర్టీ గ్లోబల్ 5సం.ల ఒప్పందం చేసుకోవడమే దీనికి కారణం. $1.6 బిలియన్ల విలువైన ఈ డీల్తో లిబర్టీకి AI, క్లౌడ్ సర్వీసులు అందించనుంది. 3.3 లక్షల ఉద్యోగులున్న ఇన్ఫీ 2022-23 ఆర్థిక సం.లో 1,46,767 Cr రెవెన్యూ పొందింది.

ఎయిర్‌టెల్ నుంచి బంపర్ ఆఫర్

 దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్‌టెల్ అనేక రీచార్జ్ ప్లాన్స్‌ రన్ చేస్తుంది. రీసెంట్‌గా తన కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్స్‌లో 84 డేస్ వ్యాలిడిలీ ప్యాక్‌లు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా రోజూ 2 జీబీ డేటా పొందనున్నారు కస్టమర్లు. రిలయన్స్ జియో 84 రోజుల వాలిడిటీ ప్లాన్‌ల కంటే కూడా Airtel ప్లాన్స్ తక్కువ ధర, ఎక్కువ ప్రయోజనం అందిస్తోంది. ఎయిర్ అందిస్తున్న సరికొత్త ప్లాన్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఎయిర్‌టెల్ రూ. 839 ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2GB హై స్పీడ్ డేటాను పొందుతారు. దాంతో పాటు, దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా రోజూ 100 SMS, అపరిమిత వాయిస్ కాలింగ్‌ అవకాశం ఉంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్లాన్‌పై కస్టమర్‌లు అపరిమిత 5G డేటా, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హాలోట్యూన్, వింక్ మ్యూజిక్, రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌లను కూడా పొందుతారు.వీటితో పాటు. మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ సదుపాయం కల్పించారు.అలాగే Airtel Xstream Play సబ్‌స్క్రిప్షన్‌ను 84 రోజుల పాటు పొందుతారు. Airtel Xstream Play సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులకు ఒకే లాగిన్‌తో ఎక్కువ కంటెంట్, 15 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ ఇస్తుంది. ఎయిర్‌టెల్ 5జీ కవరేజ్ ఏరియాలో ఉన్నవారు మాత్రమే ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటాను పొందుతారు. ఈ వినియోగదారులు కవరేట్ ఏరియాలో ఉంటే.. ముందుగా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ అకౌంట్‌కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

* స్థిరంగా కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు

నిత్యవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించి కాస్త ఊరటనిచ్చినప్పటికీ.. LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.హైదరాబాద్:రూ. 1,155,వరంగల్:రూ. 1,174,విశాఖపట్నం:రూ. 1,112,విజయవాడ:రూ. 1,118,గుంటూరు:రూ. 1,114.

ఎక్స్‌లో మరో మార్పు

 ఎలాన్‌ మస్క్‌కు చెందిన మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌ (X) (ట్విటర్‌)లో మరో మార్పు చోటుచేసుకుంది. ఆదాయం పెంచుకునేందుకు బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునేలా యూజర్లను ప్రోత్సహిస్తున్న ఆ కంపెనీ.. ఇన్నాళ్లూ ఉచితంగా లభించిన ట్వీట్‌ డెక్‌ (TweetDeck) సర్వీసులను పెయిడ్‌ సర్వీసులుగా మార్చేసింది. ఇకపై బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వారికే ట్వీట్‌డెక్‌ సర్వీసులు లభిస్తాయి. అంతేకాదు ట్వీట్‌డెక్‌ పేరును కూడా ఇకపై ‘ఎక్స్‌ప్రో’గా (XPro) వ్యవహరించనున్నారు.ట్వీట్‌ డెక్‌ అనేది ఓ థర్డ్‌పార్టీ సర్వీసుగా ఉండేది. దీన్ని ట్విటర్‌ 2011లో కొనుగోలు చేసింది. ఒకేసారి వివిధ ట్విటర్‌ అకౌంట్లను చూడడంతో పాటు సింగిల్‌ పేజీలో వివిధ ట్విటర్‌ హ్యాండిళ్లను ఆర్గనైజ్‌ చేయడానికి ట్వీట్‌ డెక్‌ ఉపయోగపడుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఓ డ్యాష్‌బోర్డును పోలి ఉంటుంది. బ్లూ సర్వీసులు ఉన్న వారికే ఇకపై ట్వీట్‌ డెక్‌ సేవలు అందిస్తామని జులైలోనే ఎక్స్‌ వెల్లడించింది. అందులో బాగంగా తాజాగా మార్పులు చేసింది. బుధవారం (ఆగస్టు 16) నుంచి ట్వీట్‌ డెక్‌ను ఉపయోగించడానికి ప్రయత్నించే వారికి బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ (Blue subscribers) తీసుకోవాలని ఎక్స్‌ సూచిస్తోంది. ట్వీట్‌ డెక్‌ ఓపెన్‌ చేస్తుంటే బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ పేజీ ఓపెన్‌ అవుతోంది.బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలంటే నెలకు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏడాదికైతే రూ.6800 చెల్లించాలి. బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారు 25వేల అక్షరాల కలిగిన సుదీర్ఘ పోస్టులు చేయొచ్చు. అలాగే ఫుల్‌ హెచ్‌డీ వీడియోలను అప్‌లోడ్‌ చేయొచ్చు. సెర్చ్‌ చేసేటప్పుడు మీ పోస్టులను టాప్‌లో చూపిస్తారని ఎక్స్‌ పేర్కొంది. దీంతో పాటు ట్వీట్లను ఎడిట్ చేసుకునే సదుపాయం కూడా లభిస్తుందని తెలిపింది. వీలైనంత ఎక్కువ మందిని బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఎక్స్‌ వేస్తున్న ఎత్తుగడ ఇది అని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా తీసుకొచ్చిన రెవెన్యూ షేరింగ్‌ పాలసీ కూడా ఇందులో భాగమేనని చర్చించుకుంటున్నారు.