DailyDose

మళ్లీ డేంజర్‌ మార్క్‌ను దాటిన యమునా నది

మళ్లీ డేంజర్‌ మార్క్‌ను దాటిన యమునా నది

ఢిల్లీలో యమునా నది  నీటి ప్రవాహం మరోసారి డేంజర్‌ మార్క్‌ (Danger Mark)ను దాటింది. గత రెండు రోజులుగా ఢిల్లీకి ఎగువన ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నదికి వరద పోటెత్తుతోంది. దీంతో 204.50 మీటర్ల ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది.

కేంద్ర జల సంఘం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పాత రైల్వే బ్రిడ్జి (Old Railway Bridge) వద్ద యమునా నది నీటిమట్టం 204.50 మీటర్ల ప్రమాద స్థాయిని దాటింది. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు 205.39 మీటర్లకు పెరిగింది. నేడు నదిలో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొండ ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగితే ఢిల్లీలో యమునా నది నీటి మట్టం 206.00 మీటర్లకు చేరే అవకాశం ఉందన్నారు.యమునా నది నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరడంతో ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జులై నెలలో యమునా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించడంతో రాజధాని ప్రాంతం నీట మునిగిన విషయం తెలిసిందే. ఆ వరద నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఢిల్లీ ప్రజలు.. తాజాగా మరోసారి యమునా ప్రవాహం పెరగడంతో ఆందోళన చెందుతున్నారు.