* నెహ్రూ మ్యూజియం పేరు మార్పుపై రాహుల్ విమర్శలు
కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీగా మార్చడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం స్పందించారు. నెహ్రూజీ తాను చేసిన పనులతో ప్రజల్లో గుర్తింపు పొందారని కేవలం ఆయన పేరుతోనే కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది.ప్రధాని మోదీ నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడం, నిరాకరించడమనే ఏకసూత్ర అజెండాతో ముందుకెళుతున్నారని మండిపడింది. నెహ్రూ వారసత్వంపై ప్రభుత్వ దాడి, అణిచివేత కొనసాగినా జవహర్‌లాల్ నెహ్రూ ఘన వారసత్వం ఉనికిలో ఉంటుందని, రాబోయే తరాలకు నెహ్రూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని స్పష్టం చేసింది.మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విషయంలో మోదీకి ఎన్నో భయాలు, అభద్రత వంటివి ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ( Jairam Ramesh) ట్వీట్ చేశారు. మ్యూజియం పేరు నుంచి ఎన్‌ను తొలగించిన ప్రధాని పీని చేర్చారని అన్నారు. స్వాతంత్రోత్సవంలో నెహ్రూ పాత్రను మోదీ తోసిపుచ్చలేరని, దేశ ప్రజాస్వామ్య, లౌకిక విలువల పటిష్టం కోసం, శాస్త్ర సాంకేతిక పురోగమనానికి నెహ్రూ అందించిన సేవలు విస్మరించలేరని పేర్కొన్నారు. మోదీ ఆయన భజనపరులు నెహ్రూ సేవలను తక్కువ చేసేందుకు చౌకబారు ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు.
* విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు వద్ద ఆందోళన
విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్’ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి.తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో గురువారం ఉదయం పెద్ద ఎత్తున కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు. బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు ప్రధాన ద్వారానికి 100 మీటర్ల దూరంలోని అదనపు గేటు వద్ద ఆందోళనకారులను అడ్డుకునేందుకు యత్నించారు. గేటుకు ఇరువైపులా భారీ ఇనుప కంచె ఏర్పాటు చేశారు.పెద్ద ఎత్తున తరలివచ్చిన పోర్టు కార్మికులు కంచెను దాటుకుని తమ కుటుంబాలతో కలిసి ముట్టడికి యత్నించారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు, పోలీసులకు గాయాలయ్యాయి. 10 మంది పోలీసులు గాయపడగా.. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తోపులాటలో గాజువాక సీఐ కాలిలో ముళ్ల కంచె దిగింది.
* కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని హరీష్ రావు ధీమా వ్యక్తం
మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం.. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసే నాయకులే కావాలి.. ఆడంబరాలకు పోయి హడావుడి చేసే నేతలకు గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు హరీష్ రావు సూచించారు. బాలింతల ఆరోగ్యం కోసమే న్యూట్రిషన్ కిట్ అందజేస్తున్నామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని అవార్డుల్లో తెలంగాణకే ఎక్కువ దక్కాయన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. ఇబ్రహీంపట్నం దవాఖానను వంద పడకలకు అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు ఉపయోగపడేలా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో 7.50 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారని చెప్పారు.
* నేడు విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన
జనసేన పార్టీ అధినే పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి విశాఖ దసపల్లా హోటల్‌లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు పవన్ కల్యాణ్. ఈ కార్యక్రమంలో.. ఉత్తరాంధ్ర ప్రజలతో మాట్లాడనున్నారు పవన్ కల్యాణ్. అయితే.. నిన్న పవన్ కల్యాణ్ విశాఖపట్నం నుండి భీమిలి మార్గంలో ఎర్ర మట్టి దిబ్బలను, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. అధికార వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్రలో సహజ వనరులను యథేచ్ఛగా దోచుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. ఆపకపోతే సహజ వనరులే ఉండవని అన్నారు.
* శ్రీసత్యసాయి జిల్లాలో రెండు చిరుతల మృతి కలకలం
శ్రీసత్యసాయి జిల్లాలో రెండు చిరుతల మృతి కలకలం రేపుతుంది. రెండు రోజుల వ్యవధిలో రెండు చిరుతల మృతిపై ఫారెస్ట్ అధికారులు ఆరా తీస్తున్నారు. చిరుతల మరణాలపై కారణాలను విశ్లేషించేందుకు అటవీశాఖా ఉన్నతాధికారులు రానున్నారు.మడకశిర మండలం మెలవాయి శివారులో చిరుత మృతి చెందింది. నిన్న కూడ ఓ చిరుత మృతదేహన్ని గుర్తించారు అటవీ సిబ్బంది.నిన్న మృతి చెందిన చిరుత వయస్సు ఏడాదిన్నర నుండి రెండేళ్ల వయస్సు ఉంటుందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. చిరుతపులి మృతి చెందిన విషయాన్ని స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.దీంతో సంఘటన స్థలాన్ని పెనుగొండ రేంజ్ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసులు పరిశీలించారు. ఇవాళ కూడ మరో చిరుత మృతి చెందడంపై అటవీశాఖాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిరుత మృతికి గల కారణాలపై ఫారెస్టు అధికారులు పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు.చనిపోయిన రెండు చిరుతలను డీఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డి ఇవాళ పరిశీలించారు.ఒక ఆడ, ఒక మగ చిరుత చనిపోయినట్టుగా డీఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. రెండు ఒకే సమయంలో చనిపోయి ఉండొచ్చని ఆయన అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే చిరుతల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు.
* అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ముమ్మర ప్రణాళిక రచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకమైన అడుగులు వేస్తోంది. ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. టికెట్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.ఆగస్టు18 నుంచి 25 వరకు డీడీ రుసుం చెల్లించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సూచించింది. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి టికెట్ ఇవ్వడం కుదరదని స్క్రీనింగ్ కమిటీ తేల్చి చెప్పింది. సెప్టెంబర్ మొదటి వారంలో మరోసారి ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈసారి బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో ఎక్కడ ఎలాంటి పైరవీలకు తావు లేదని స్పష్టం చేసింది.అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉంటుందని చెబుతూవచ్చారు. పీసీసీ చీఫ్ గా తన టికెట్ కూడా తన చేతిలో లేదని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. పూర్తిగా సర్వేల్లో ముందున్న వారికే టికెట్ ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు దానికి భిన్నంగా కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు గాంధీ భవన్ కు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు దారుడి నుంచి కొంత రుసుం కూడా వసూలు చేయాలని కండీషన్ పెట్టారు. జనరల్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు రూ.2 లక్షలు, రిజర్వ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు 1లక్ష రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంపై కొంతమంది నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
* పోర్టులు హార్బర్లపై జగన్ సమీక్ష
ముఖ్యమంత్రి జగన్ నేడు పోర్టులు, హార్బర్లపై సమీక్ష చేయనున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యాసంస్థలో మెరుగైన ప్రమాణాలను పాటించడంతో పాటు అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని , అందుకోసం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్సీని విస్తృతస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం జగన్.. విద్యాశాఖ ఆదేశించారు. ఆర్బీకేలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా డీసీఎంఎస్ పనులు, కార్యక్రమాల పై అధ్యయనం జరగాలని అధికారులకు తెలిపారు.
* 1 నుంచి ఖమ్మంలో అగ్నివీర్ నియామక ర్యాలీ
ఖమ్మంలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మంలో సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2023-24 నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూటింగ్ అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో మొదటి దశలో ఆన్‌లైన్ రాత పరీక్ష పూర్తయింది. తొలివిడత రిక్రూట్‌మెంట్ ర్యాలీని సూర్యాపేట జిల్లాలో 17 రోజుల పాటు నిర్వహించగా.. సుమారు 45 వేలమంది వరకు హాజరయ్యారు. ఆన్‌లైన్ పరీక్షలో 7,397 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వారికి ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శారీరక, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ కీట్స్ కే దాస్ బుధవారం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అవసరమైన భద్రత, రవాణా, తాగునీరు, సీసీ కెమెరాలు, ఇతర లాజిస్టిక్‌లపై చర్చలు జరిగాయి.మీడియాతో కల్నల్ మాట్లాడుతూ.. అభ్యర్థుల అడ్మిట్ కార్డులో హాజరు తేదీ, సమయాన్ని పొందుపరిచామని తెలిపారు. అవసరమైన పత్రాలు లేకపోతే అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్‌కు అనుమతించబడరని చెప్పారు. అభ్యర్థులు తమతో పాటు అవసరమైన అన్ని పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు.అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మధ్యవర్తులకు ఆస్కారం లేదని, మెరిట్, ఫిజికల్ స్టాండర్డ్స్ ప్రకారం రిక్రూట్‌మెంట్ ర్యాలీని పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు దళారుల మాటల్ని విశ్వసించవద్దని.. ఎవరైనా మధ్యవర్తులు సంప్రదిస్తేవెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ విష్ణు ఎస్ వారియర్ హెచ్చరించారు.
* ఇటలీని ముంచెత్తిన బురద ప్రవాహం
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ సహా ఇప్పటికే చాలా దేశాలు భారీ వర్షాలు, వరదలు, భూకంపాలు, సునామీలకు అతలాకుతలమవుతున్నాయి. తాజాగా ఇటలీ (Italy)ని బురద (Mud) ప్రవాహం ముంచెత్తింది. భారీ వర్షాల కారణంగా బార్డోనెచియా పట్టణం సమీపంలోని మెర్డోవిన్ నది కి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో వరద ముంచెత్తడంతో సమీపంలోని ప్రాంతాలు బురదమయమయ్యాయి. రోడ్లన్నీ బుదరతో నిండిపోయాయి. పట్టణంలో బురద ఒక్కసారిగా ముంచెత్తుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.భారీ వర్షం కారణంగా ఓ పర్వతంపై నుంచి వర్షపు నీరు పొంగి పొర్లడంతో కొండచరియలు విరిగిపడ్డాయని.. ఆ కారణంగానే ఆ ప్రాంతాన్ని బురద ప్రవాహం ముంచెత్తినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయినప్పటికీ, బార్డోనెచియా పట్టణం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ బురద వరద వల్ల సుమారు 120 మంది నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. అగ్నిమాపక, రెస్క్యూ అధికారులు బురదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.
* భక్తులకు చేతికర్రల పంపిణీపై ట్రోల్స్
తిరుమల అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రల పంపిణీ చేయాలన్న టీటీడీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ వ్యవహారంపై టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ట్రోల్స్‌ను ఖండించిన ఆయన.. అటవీ శాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.కర్రలు ఇచ్చి, బాధ్యతల నుంచి టీటీడీ తప్పుకుంటున్నదని ట్రోల్స్ చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని ఈవో ధర్మారెడ్డితో కలిసి భూమన పరిశీలించారు. బోనులో చిక్కిన మగ చిరుతకు ఐదేళ్ల వయసు ఉంటుందని చెప్పారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని తెలిపారు. మరిన్ని చిరుతలను బంధించేలా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.