Business

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు-TNI నేటి వాణిజ్య వార్తలు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు-TNI నేటి వాణిజ్య వార్తలు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టపోయాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు, చైనా ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 388 పాయింట్లు కోల్పోయి 65,151కి పడిపోయింది. నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 19,365 వద్ద స్థిరపడింది. 

భారీగా బాకీ పడిన ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలు

ఆన్‌లైన్‌ గేమింగ్‌ కు సంబంధించి జీఎస్టీని మార్చడంతో ఆ సంస్థలు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆ సంస్థలు భారీగా బకాయి పడ్డాయి. ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలు చెల్లించాల్సిన  పన్ను బాకీలు దాదాపు 45,000 కోట్ల రూపాయలుగా  ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నెల 11న ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, క్యాసినోలలో బెట్టింగ్‌ల పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017 మరియు సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017కి సవరణలు కోరుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే.ఇదిలా వుండగా  2017 నుంచి పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ సెంట్రల్‌ బోర్డ్‌ (సీబీఐటీ) ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థల పన్నుల మదింపు చేసింది. దీని ద్వారా 28 శాతం జీఎస్టీ చెల్లించకుండా కొన్ని ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు తమ సేవలు నైపుణ్యం ఆధారిత కార్యకలాపాలకు సంబందించినవని వాదించగా నైపుణ్యం ఆధారిత గేమింగ్స్‌కు 18 శాతం జీఎస్టీని వసూలు చేశారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ విషయంలో పన్నును అవకాశం ఆధారితంగానా లేక నైపుణ్యం ఆధారితంగా వర్గీకరించాలా అన్నదానిపై చాలా కాలం చర్చ జరిగింది.పైన పేర్కొన్న విధంగా కొన్ని ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు తమ సేవలు నైపుణ్యం ఆధారిత కార్యకలాపాలకు సంబందించి వాదించి కేవలం 18 శాతం జీఎస్టీని మాత్రమే చెల్లించాయి. అయితే ఈ మధ్యే పార్లమెంట్ ఈ బిల్లును సవరించడంతో అవి కూడా మొత్తం 28 శాతం జీఎస్టీని చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన చూస్తే న్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలు దాదాపు రూ. 45,000 కోట్లు బకాయి పడినట్లు కేంద్రం తెలిపింది.

*  త్వరలో విడుదల చేయబోయే ఐఫోన్‌ 15 ఉత్పత్తి మన దేశంలోనే

యాపిల్‌ త్వరలో విడుదల చేయబోయే ఐఫోన్‌ 15 ఉత్పత్తి మన దేశంలోనూ మొదలైంది. యాపిల్‌కు కాంట్రాక్టు పద్ధతిలో ఐఫోన్లు తయారు చేసి, అందించే ఫాక్స్‌కాన్‌ తమిళనాడులోని తన ప్లాంటులో ఈ ప్రక్రియ ప్రారంభించింది. విడిభాగాల లభ్యత (ఎక్కువ శాతం దిగుమతి ద్వారా వస్తాయి)ను బట్టి ఐఫోన్‌ 15 ఉత్పత్తి పరిమాణం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఈ కొత్త ఐఫోన్‌ను సెప్టెంబరు 12న యాపిల్‌ అంతర్జాతీయంగా ఆవిష్కరించే అవకాశం ఉంది. చైనా ప్లాంట్ల నుంచి ఐఫోన్‌ 15 సరఫరాలు మొదలైన కొన్ని వారాలకు, శ్రీపెరంబదూర్‌ప్లాంటు నుంచి డెలివరీలు మొదలు పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ సన్నాహాలు చేస్తున్నట్లు ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. మన దేశంలో యాపిల్‌కు ఐఫోన్లు అందించే పెగాట్రాన్‌ కార్ప్‌, టాటా గ్రూప్‌ కొనుగోలు చేస్తున్న విస్ట్రాన్‌ కార్ప్‌ ఫ్యాక్టరీలలోనూ ఐఫోన్‌ 15 అసెంబ్లింగ్‌ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణామాలపై యాపిల్‌ ప్రతినిధి కానీ, విస్ట్రాన్‌, పెగాట్రాన్‌, ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులు కానీ స్పందించలేదు.ఐఫోన్‌ 14 ముందు వరకు చూస్తే.. అంతర్జాతీయంగా కంటే మన దేశంలో 6-9 నెలల ఆలస్యంగా ఆయా మోడళ్ల తయారీ ప్రారంభమయ్యేది. గతేడాది నుంచి పరిస్థితి మారింది. అంతర్జాతీయంగా తయారీ ప్రారంభించిన కొద్దికాలంలోనే, ఇక్కడా చేపడుతున్నారు. ఈ ఏడాది మార్చి చివరకు చూస్తే, యాపిల్‌ ఐఫోన్లలో 7 శాతాన్ని భారత్‌లోనే తయారు చేసింది.  ఐఫోన్‌ 15లో భారీ మార్పులు: ప్రస్తుత ఐఫోన్‌ 14తో పోలిస్తే, కొత్తగా వచ్చే ఐఫోన్‌ 15లో కెమేరా వ్యవస్థలో భారీ మార్పులుంటాయని చెబుతున్నారు. మెరుగుపరచిన 3 నానోమీటర్‌ ఏ16 ప్రాసెసర్‌తో ప్రో మోడళ్లు ప్రయోజనం పొందొచ్చు.

భారత మార్కెట్‌లోకి వెస్పా కొత్త మోడల్‌ స్కూటర్

వెస్పా’ స్కూటర్ అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. అలా ఉంటాయి ఆ బండి లుక్స్. ఇటలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియో సంస్థ వీటిని తయారు చేస్తుంది. తాజాగా ఓ కొత్త మోడల్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆ బండి ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ.6.45 లక్షలట మరి. వెస్పా కొత్త మోడల్‌కు అంత భారీ ధర నిర్ణయించడానికి ఓ కారణముంది. ‘జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్’ పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ అని, పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. కెనడా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఆలోచనలకు అనుగుణంగా బండిని డిజైన్ చేసినట్లు వెల్లడించింది. ఇందుకోసం బీబర్‌‌తో సంస్థ ఒప్పందం కూడా చేసుకోవడం గమనార్హం. వెస్పా కొత్త మోడల్ స్కూటర్‌‌లో 150 సీసీ ఇంజిన్ ఉంది. 8 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీ ట్యాంక్ ఏర్పాటు చేశారు. మిగతావన్నీ గత వెస్పా మోడల్స్‌లో మాదిరే ఉంటాయి. వెస్పా వెబ్‌సైట్ ద్వారా ప్రీ బుక్ చేసుకోవచ్చు.
మోదీ హయాంలో సొంతిల్లు కొనడం కూడా కష్టమే
ద్రవ్యోల్బణం కట్టడి సాకుతో కేంద్రంలోని బీజేపీ సర్కారు చేపడుతున్న వడ్డీరేట్ల పెంపు మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను కల్లగా మారుస్తున్నది. బ్యాంకుల్లో అప్పు చేసి సొంతింటి కలను నిజం చేసుకొన్న సామాన్యులపై ఈఎంఐల రూపంలో కేంద్రసర్కారు పెను భారం మోపుతున్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటు పెంపుతో గృహ రుణ వాయిదాల మొత్తం అమాంతం పెరిగిపోతున్నది. ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపుతో గడిచిన రెండేండ్లలో ఈఎంఐలు 20% మేర పెరిగినట్టు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ‘అనరాక్‌ రీసెర్చ్‌’ తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్బీఐ నిర్ణయంతో మొత్తం గృహరుణంలో అసలు కంటే వడ్డీనే ఎక్కువ కట్టే దుస్థితి దాపురించినట్టు వెల్లడించింది.ఆర్బీఐ రెపోరేటును ఎంత పెంచితే వాణిజ్య బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను అంతశాతం పెంచేస్తాయి. దీంతో వ్యక్తిగత, ఆటోమొబైల్‌, విద్య, కార్పొరేట్‌తో పాటు గృహరుణాలపై కూడా వడ్డీరేట్లు కూడా పెరుగుతాయి. గడిచిన రెండేండ్లలో ఆర్బీఐ రెపోరేటును 2 శాతానికి పైగా పెంచింది. దీనికి అనుగుణంగా బ్యాంకులు కూడా వడ్డీరేట్లను ఆమేరకు పెంచాయి. ఫలితంగా ఇప్పటికే గృహరుణాలు తీసుకొన్నవారు, కొత్తగా రుణాలు తీసుకొంటున్నవారు అధిక వడ్డీని చెల్లించాల్సివస్తున్నది. 2021 జూలైలో బ్యాంకుల్లో గృహరుణంపై సగటున 6.7% వడ్డీని వసూలు చేసేవారు. దీంతో 20 ఏండ్ల కాలపరిమితికి రూ. 30 లక్షల రుణం తీసుకొన్న గ్రహీత నెలకు రూ. 22,772ను ఈఎంఐగా చెల్లించేవాడు. అయితే, ప్రస్తుతం వడ్డీరేటు 9.15 శాతానికి పెరుగడంతో నెలవారీ ఈఎంఐ రూ. 27,282గా మారింది. అంటే రెండేండ్లలో నెలవారీ ఈఎంఐ చెల్లింపు రూ.4,560 (దాదాపు 20%) పెరిగిందని అనరాక్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. రెండేండ్ల కిందట 30 లక్షల రుణంలో చెల్లించాల్సిన వడ్డీ రూ. 24,53,239గా ఉంటే అది ప్రస్తుతం రూ. 35,47,648కు చేరింది. అంటే రెండేండ్లలో రూ. 11 లక్షల మేర వడ్డీ అదనంగా పెరిగిందన్నమాట.
శ్రావణమాసంలో తగ్గిన బంగారం ధరలు
నేడు బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి.శ్రావణమాసం మొదలైంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వారికి ఈ బంగారం తగ్గుదల గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ఇక హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,550 ఉండగా, నేడు 100 తగ్గడంతో గోల్డ్ ధర రూ.54,450గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,400 ఉండగా, నేడు 110 తగ్గడంతో గోల్డ్ ధర రూ.59,510గా ఉంది.

* టమాటాల తర్వాత ఆపిల్ ధరల్లో తీవ్ర పెరుగుదల 

భారీ వర్షాలు, వరదలు, విరిగిపడిన కొండ చరియల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. ఆ రాష్ట్రంలో పండిన పంట సరఫరాలో జాప్యం కారణంగా టమాటాల తర్వాత ఆపిల్ ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదైంది. దీంతో టమాటాలు, ఇతర కూరగాయలతో పాటు పండ్ల సరఫరా కూడా దెబ్బతింది. ఇప్పుడు దీని ప్రభావం ఢిల్లీ హోల్‌సేల్ మార్కెట్‌పై కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ దెబ్బతింది. దీంతో ఆహార సరఫరా గొలుసు దెబ్బతింది. ఈ ప్రభావం ఢిల్లీలోని ఆపిల్ హోల్‌సేల్ మార్కెట్‌పై పడింది. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం ఎప్పుడూ వ్యవసాయానికి, వ్యాపారానికి నష్టం చేకూరుస్తుందని ఓఖ్లాలోని ఓ షాపు యజమాని చెప్పాడు. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతానికి బంగాళాదుంప, యాపిల్, నేరేడు వంటి పండ్ల హోల్‌సేల్‌లో హిమాచల్ ప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.నిజానికి యాపిల్ బాక్స్ ధర వెయ్యి రూపాయలు ఉండాలి. వర్షం కారణంగా దాని ధర 2 వేల రూపాయల నుండి 3 వేల 500 రూపాయలకు పెరిగిందని దుకాణదారుడు చెప్పాడు. హిమాచల్ ప్రదేశ్‌లో రహదారులు దెబ్బతిని అధ్వాన్నంగా ఉండడంతో రైతులు ఒకే ట్రక్కులో పండ్లను ప్యాక్ చేస్తున్నారు. దీని కారణంగా ఈ పండ్లు త్వరగా కుళ్లిపోతున్నాయి. దీంతో పండ్ల సరఫరా దెబ్బతినడంతో పాటు డిమాండ్ కూడా పెరుగుతోంది.ఆజాద్‌పూర్ మండికి చెందిన ఒక దుకాణదారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆపిల్‌ల సరఫరా నిలిచిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో తాజా యాపిల్స్ సరఫరా కూడా జరగడం లేదు. అయితే, ఏదో ఒకవిధంగా మధ్య మార్గాల ద్వారా ఆపిల్‌లను సరఫరా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తను తెలిపాడు.ఈ సంవత్సరం రుతుపవనాల 54 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లో 742 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది 50 ఏళ్లలో సరికొత్త రికార్డు అని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వర్షం కారణంగా 1,200 రోడ్లు మూసుకుపోయి రూ.7,480 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

టెలికాం సేవల పరిశ్రమ ఆదాయం పెరగొచ్చని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) టెలికాం సేవల పరిశ్రమ ఆదాయం 7-9% పెరగొచ్చని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది. స్వల్పకాలంలో టారిఫ్‌ పెంపులు ఉండకపోవచ్చని, అందువల్ల టెలికాం సంస్థలకు వినియోగదారుపై సగటు ఆర్జన (ఆర్పు) స్వల్పంగా మాత్రమే పెరిగే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ మూలధన వ్యయాలు సుమారు రూ.70,000 కోట్లుగా ఉండొచ్చని పేర్కొంది. రాబోయే 4-5 ఏళ్లలో సుమారు రూ.3,00,000 కోట్ల మూలధనాన్ని టెలికాం సేవల కంపెనీలు వెచ్చించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 5జీ సేవలను దేశీయులందరికీ చేరువ చేసే సన్నాహాల్లో కంపెనీలున్నాయని.. ఇందుకోసం నెట్‌వర్కింగ్‌ మౌలిక వసతులు, ఫైబర్‌ లైన్ల ఏర్పాటుకు స్వల్ప, మధ్య కాలంలో మరింతగా మూలధనాన్ని కంపెనీలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చని తెలిపింది. దీని వల్ల కంపెనీల రుణ స్థాయులు 2024 మార్చి నాటికి రూ.6.1- 6.2 లక్షలకు పెరుగుతుందని ఇక్రా విశ్లేషించింది.ఆర్పు స్వల్పంగానే పెరగొచ్చు: మొత్తం టెలికాం చందాదార్లలో 4జీ సేవలు వినియోగిస్తున్న వారి సంఖ్య 75-80 శాతానికి చేరుకుందని,  మున్ముందు ఈ సంఖ్యలోనూ పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చని ఇక్రా పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 80 కోట్ల మంది 4జీ వినియోగదార్లు ఉన్నారు. 5జీ సేవలకు సంబంధించి ఇప్పటివరకు కంపెనీలు ఎలాంటి పథకాలను ప్రకటించలేదని ఇక్రా పేర్కొంది. దీనికితోడు టారిఫ్‌లు పెరిగే అవకాశం లేనందున ఆర్పు స్తబ్దుగానే ఉండొచ్చని విశ్లేషించింది. 2022-23లో ఆర్పు రూ.175గా ఉండగా.. 2023-24లో ఇది రూ.182- 185కు చేరొచ్చని అంచనా వేసింది. ఈ లెక్కన 2023-24లో టెలికాం సంస్థల ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 7-9 శాతమే పెరగొచ్చన్నది అంచనా. ఏకీకృత ప్రాతిపదికన సంస్థల ఆదాయాలు రూ.2.9- 3 లక్షల కోట్లుగా నమోదుకావచ్చని అంచనా వేస్తోంది.

నేడు గ్యాస్ సిలిండర్ ధరలు

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ రేట్లు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించి కాస్త ఊరటనిచ్చనప్పటికీ.. గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.హైదరాబాద్: రూ. 1,155,వరంగల్: రూ.1,174,విశాఖపట్నం: రూ. 1,112,విజయవాడ: రూ. 1,118,గుంటూర్: రూ. 1,114.