NRI-NRT

కాలిఫోర్నియాలో ఇల్లు…చాలా ఖరీదు గురూ!

కాలిఫోర్నియాలో ఇల్లు…చాలా ఖరీదు గురూ!

కాలిఫోర్నియాలో(California) ఉంటున్నారా? ఇల్లు కొనుక్కోవడమే మీ కలా? అయితే, ఆ కల మరి కొన్నాళ్లు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అక్కడి రియల్టర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడి జనాభాలో కేవలం 16 శాతం మంది మాత్రమే ఓ మాదిరి ధరలో ఇల్లు కొనుగోలు చేయగలిగే స్థితిలో ఉన్నారట. అంటే, అధికశాతం మంది ప్రజలు ఇళ్లు కొనుగోలు చేసే స్థితిలో లేరట. కాలిఫోర్నియా రియాల్టర్స్ అసోసియేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది(House Affordability).

ప్రజల కొనుగోలు శక్తి 16 ఏళ్ల నాటి కనిష్ఠానికి దిగజారింది. ఈ ఏడాది తొలి ప్రథమార్ధంలో ఓ మోస్తరు ధరలో ఇల్లు కొనుగోలు చేయగలిగేవారి వారి సంఖ్య గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం మేర తగ్గింది. 2012 నాటి లెక్కలతో పోలిస్తే ఏకంగా 50 శాతం మేర తగ్గిపోయింది. అమెరికా వ్యాప్తంగా చూస్తే సగటున 36 శాతం మంది ఓ చిన్న కుటుంబానికి సరిపడా మధ్యస్థ ధరలోని ఇళ్లను కొనుగోలు చేసే స్థితిలో ఉన్నారట.

అధిక హోంలోన్ వడ్డీ రేట్లు, ఇళ్ల కొరత కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అక్కడి రియల్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం 8 లక్షల డాలర్ల విలువైన ఇల్లు కొనాలంటే అక్కడి వారికి కసీనం 2.08 లక్షల డాలర్ల జీతం ఆదాయం ఉండాలట. ఇక శాన్ మాటియో, శాంటాక్లారా కౌంటీల్లోని వారికైతే ఈ ఆదాయం మరింత ఎక్కువ. కాండొమినియమ్స్, టౌన్ హౌస్‌లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి.