తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకరు. అంతేకాకుండా అమ్మాయిలకు కలల రాకుమారుడుగా పేరు పొందాడు. అయితే మహేశ్ బాబు పెళ్లి అయిన తర్వాత ఎంతోమంది యువతులు తీవ్రంగా బాధపడ్డారు. అప్పట్లో మహేశ్ బాబు మ్యారేజ్ తెగ హాట్ టాపిక్ గా మారింది. ఇక మహేశ్ బాబు హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ను వివాహమాడిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత నమ్రత సినిమాల్లో మరోసారి నటించలేదు. 23 ఏళ్ల తర్వాత మళ్లీ మహేశ్ బాబుతో నమ్రత నటిస్తుందనే విషయంపై ఆమె తాజాగా స్పందించారు. బాల నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో సత్తా చాటిన మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’ నుంచి వరుసగా ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారు వారి పాట’ వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుని హవా చాటాడు. దీంతో మరింత ఉత్సాహంతో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం మహేశ్ బాబు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయనే విషయం తెలిసిందే.
అనేక ఆసక్తికర విషయాలతో గుంటూరు కారం సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక SSMB29 సినిమాకు రాజమౌళి కథ రెడీ చేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2000 సంవత్సరంలో వంశీ సినిమాతో మొదలైన వీరి ఫ్రెండ్షిప్ మూవీ కంప్లీట్ అయ్యేసరికి ప్రేమగా మారింది. అది కాస్తా వివాహానికి దారి తీసింది. ముందుగా నమ్రత తన మనసులోని ప్రేమ బయటపెట్టగా మహేశ్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్ దంపతులకు గౌతమ్, సితార పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత మహేశ్ బాబు బిజినెస్ వ్యవహారాలు, పిల్లలను చూసుకుంటోంది నమ్రత. అయితే తాజాగా ఓ జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్ కు వెళ్లిన నమ్రత ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. “నాకు పెద్దగా నగలేమి ఇష్టముండదు. చాలావరకు సింపుల్ గానే ఉండటాన్ని ఇష్టపడతాను. షాపింగ్ కూడా అంతగా ఇష్టముండదు” అని నమ్రత తెలిపింది.
“మహేశ్ బాబు నాకు ఇచ్చిన మొదటి బహుమతి వెడ్డింగ్ రింగ్. నేను ఇప్పటివరకు అందుకున్న ఉత్తమమైన బహుమతుల్లో మరొకటి మా అమ్మ ఇచ్చిన బంగారు ఉంగరం. ఎనిమిదేళ్ల వయసులో అమ్మ నాకు సాయి బాబా ఉంగరం ఇచ్చింది. ఇప్పటికే నేను దాన్ని పెట్టుంకుంటున్నాను. ఇకపోతే మహేశ్ బాబుతో కలిసి నటించబోతున్నా, రీ ఎంట్రీ ఇవ్వనున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు” అని నమ్రత శిరోద్కర్ చెప్పుకొచ్చింది.