ప్రధాని మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. గురువారం ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఇందుకు వేదికైంది. ‘ కూతురు లాంటి మణిపూర్ తీవ్ర విద్వేషాగ్నిలో చిక్కుకున్నపుడు తండ్రి స్థానంలో ఉన్న ప్రధాని మోదీ.. ఆమెన కాపాడాల్సిదిపోయి, పట్టించుకోకుండా మరో వైపు తిరిగి నిల్చున్నారు. మోదీ మౌనంగా ఎందుకున్నారని దేశం యావత్తు ప్రశ్నిస్తోంది. ఆయన ఇలా మౌనముద్రలో ఉండటం ఇదే తొలిసారి కాదు. గత తొమ్మిదేళ్ల పాలనా కాలంలో దేశంలో ఎక్కడ సంక్షోభం ఎదురుపడ్డా ఆయన ఇలాగే సైలెంట్ అయిపోయారు’ అని కేజ్రీవాల్ విమర్శించారు.పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిల్చిన మహిళా మల్లయోధులు బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ యాదవ్‌పై లైంగిక ఆరోపణలు చేసినపుడూ మోదీ మౌనవ్రతం చేశారు. ఇదే మహిళా రెజ్లర్లు పతకాలు గెల్చినపుడు వారితో ఫొటోలు దిగేందుకు మొదట ముందుకొచ్చింది మోదీనే. ‘మీరు నా బిడ్డలు’ అని భరోసా ఇచ్చారు. కానీ తీరా వాళ్లు ధర్నాలు చేస్తుంటే మోదీ మౌనముద్రలోకి జారుకున్నారు. కనీసం ప్రధాని హోదాలో ‘నేనున్నాను. ఎంక్వైరీ చేయించి సంబంధిత వ్యక్తుల్ని శిక్షిస్తానని హామీ ఇవ్వలేకపోయారు. కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం మహిళలు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక మణిపూర్ అంశంలోనూ ఇంతే ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.