శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీహరి తన బాల్యంలోనే కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి వలస వచ్చి పాఠశాల విద్యను పూర్తిచేసి, యలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిలు షాపు, సోడాలు అమ్మి అక్కడే జీవనం సాగించారు. సినిమాలపై మక్కువతో అరెకరం భూమి అమ్మి హైదరాబాద్ వచ్చి సినిమా ఇండస్ట్రీలో తనదైన స్థానం ఏర్పాటు చేసుకున్నారు. డిస్కో శాంతిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అక్టోబరు 9, 2013న కాలేయ సంబంధ వ్యాధివలన ముంబైలో కన్నుమూశారు.
శ్రీహరి మరణం తర్వాత ఒక్కసారిగా తమకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని శాంతి గుర్తుచేసుకుంది. శ్రీహరి లేరనే బాధ ఒకవైపు ఉండగానే కొంతమంది మోసం వల్ల డబ్బు కోల్పోయాను.. అదే డబ్బు ఉండిఉంటే తన కుమారుడు చదవుకునేందుకు ఫారిన్ వెళ్లేవాడని శాంతి తెలిపింది. తమకు రావాల్సిన డబ్బు అయితే తిరిగిరాలేదు కానీ తాము తీసుకున్న అప్పువాళ్లు మాత్రం ఇంటికి వచ్చారని చెప్పింది. అప్పుడు చేసేదిమి లేకపోవడంతో తమ వద్ద ఉన్న కార్లు, భూమి, బంగారం అన్నీ అమ్మేసి బాకీలు కట్టేశానని శాంతి తెలిపింది.
చివరకు ఎంతో ఇష్టంగా కొనుకున్న ఒక కారు ఈఎంఐ కూడా కట్టలేకపోతే బ్యాంకు వారు తీసుకుపోయారని చెప్పింది. తాళి మాత్రమే ఉంచుకుని మిగిలిన బంగారాన్ని మొత్తం కోల్పోయానని శాంతి గుర్తుచేసుకుంది. ప్రస్తుతం జీవనోపాధికి తమ రెండు ఇళ్ల నుంచి అద్దె వస్తుందని తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం తాము ఉంటున్న ఇళ్లు నుంచి కొంత భాగం రోడ్డు డివైడింగ్ కోసం పోయింది. అందుకు సంబంధించి వచ్చిన డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేశామని శాంతి తెలిపింది. సినీ ఇండస్ట్రీ నుంచి ఏమైనా మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని శాంతి పేర్కొంది.