NRI-NRT

IDP ఉంటే 150దేశాల్లో డ్రైవింగ్ చేయవచ్చు

IDP ఉంటే 150దేశాల్లో డ్రైవింగ్ చేయవచ్చు

మీరు విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే, మీకు అక్కడ డ్రైవింగ్ చేయడం ఎలా? అసలు ఇతర దేశాలలో డ్రైవింగ్ చేసేందుకు కావాల్సిన దృవ పత్రాలు ఏంటి? వాటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే ప్రశ్నలు మీ మదిలో మెదిలే ఉంటాయి. వీటన్నింటికీ ఒకే సమాధానం ‘ఇంటర్నెషనల్ డ్రైవర్ పర్మిట్’ (International Driver’s Permit). యునైటెడ్ నేషన్స్ (United Nations) జారీ చేసే ఈ ఒక్క డాక్యుమెంట్ మన దగ్గర ఉంటే చాలు.. ఏకంగా 150 దేశాల్లో ఎంచక్కా డ్రైవింగ్ చేసుకోవచ్చు. తరచూ విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. స్వదేశంలో మన దగ్గర ఇచ్చే డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా యూఎన్ఓ దీన్ని వివిధ భాషల్లో జారీ చేస్తుంది. ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్, రష్యన్, జర్మన్, అరబిక్, ఇటాలియన్, పోర్చుగీస్‌తో పాటు స్కాండనవియన్ భాషల్లో ఈ ఐడీపీ (IDP) అందుబాటులో ఉంటుంది. ఇక దీని చెల్లుబాటు గడువు అనేది ఒక ఏడాది ఉంటుంది. మీకు ఐడీపీ జారీ అయిన తేదీ నుంచి ఈ గడువు అమలులోకి వస్తుంది. లేదా మన ఒర్జినల్ డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) వాలిడిటీ ఎంతవరకు ఉంటుందో అప్పటిదాక ఈ డాక్యుమెంట్‌ను వాడుకోవచ్చు. ఈ రెండింటీలో ఏది మొదట వస్తే దాన్ని ఐడీపీ వాలిడిటీగా పరిగణించడం జరుగుతుంది.

ఇండియాలో ఐడీపీ దరఖాస్తు ఇలా…

ఐడీపీ కావాల్సిన వారు ఈ కింద విధంగా దరఖాస్తు చేసుకోవాలి.

* ముందుగా మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. లేదా స్థానిక ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లాలి.

* ఒకవేళ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే కావాల్సిన ఫార్మ్స్ పూర్తి చేయాలి. ఫార్మ్-4ఏ, ఫార్మ్-1ఏ.

* వాటిలో అడిగిన విధంగా పూర్తి వివరాలు( డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్, రెసిడెన్స్ ప్రూఫ్, ఐడెంటిఫికేషన్) ఇవ్వాలి.

* అలాగే ఐడీపీ దరఖాస్తుకు కావాల్సిన ధృవపత్రాలు, ఫారాలను సబ్మిట్ చేయాలి.

* ఆ తర్వాత ఒక డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుంది.

* ప్రాసెసింగ్ ఫీజు రూపంలో రూ.1000 చెల్లించాలి.

* ఇలా పూర్తిగా దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత నాలుగు నుంచి ఐదు రోజుల్లో మన చేతికి ఐడీపీ డాక్యుమెంట్ వస్తుంది.

అర్హత మరియు అవసరమైన డాక్యుమెంటేషన్..

* దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా 18ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండాలి.

* చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం తప్పనిసరి.

* సంబంధిత అధికారులు ఇచ్చే నిర్ధిష్ట ఫార్మ్‌ను నింపి, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది.

భారతీయులకు కావాల్సిన ధృవపత్రాలివే..

* మనోళ్లకు 4ఏ ఫార్మ్ తప్పనిసరి.

* పాస్‌పోర్ట్, వీసా కాపీలు

* విమాన టికెట్లు

* దరఖాస్తులో పేర్కొన్న మెడికల్ సర్టిఫికేట్స్

* దరఖాస్తు రుసుము రూ.1000

* ఐదు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు

* భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించే ధృవీకరణ పత్రం

* చిరునామా రుజువు

* వయస్సు రుజువు