DailyDose

కూతురిని గొంతుకోసి చంపిన తండ్రి-TNI నేటి నేర వార్తలు

కూతురిని గొంతుకోసి చంపిన తండ్రి-TNI నేటి నేర వార్తలు

నల్గొండలో ఘోర రోడ్డుప్రమాదం

ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారి దారిలో వారు వెళుతుండగా అదుపుతప్పిన బస్సు మృత్యువు రూపంలో దూసుకువచ్చింది. ఇలా ఇద్దరు వలస కూలీలను బస్సు బలితీసుకుంది.పోలీసుల తెలపిన వివరాలాలా ఉన్నాయి. సోమవారం ఉదయం మిర్యాలగూడ నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మార్గమద్యలో బీభత్సం సృష్టించింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం సమీపంలో వేగంగా వెళుతున్న బస్సు టైర్ ఒక్కసారిగా పగిలింది. దీంతో డ్రైవర్ కు బస్సును అదుపుచేయడం సాధ్యంకాలేదు. అదే వేగంతో ముందుకు దూసుకెళ్ళిన బస్సు అదుతప్పిన ఎదురుగా వచ్చిన బైక్ ను ఢీ కొట్టింది. బైక్ వెళుతున్న ముగ్గురు చత్తీస్ ఘడ్ వలసకూలీల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడి మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం.టైర్ పగిలి బైక్ ను ఢీకొని కూడా బస్సు ఆగలేదు. రోడ్డుపక్కన పొలంలోకి దూసుకెళ్ళి  బురదలో చిక్కుకుపోవడంతో ఆగింది. ఈ ప్రమాదం నుండి బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రోడ్డుపై పడివున్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఎస్సీ బాలికపై యువకుడి అత్యాచారం

మాయమాటలతో లోబరుచుకుని 14 ఏళ్ల బాలికను ఏడాదిగా పలుమార్లు అత్యాచారం చేశాడో యువకుడు. గర్భం దాల్చిన బాలిక తరగతి గదిలో కూర్చోలేక కడుపు నొప్పిగా ఉందంటూ ఏడ్చింది. ప్రిన్సిపల్‌ వైద్య పరీక్షలు చేయించారు. ఆరునెలల గర్భిణి అని వైద్యులు నిర్ధారించడంతో నిర్ఘాంతపోయి బాలిక తల్లికి సమాచారమిచ్చారు. ఆమె వచ్చి బాలికను ప్రశ్నించడంతో అత్యాచార విషయం వెలుగుచూసింది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో ఓ గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబం పదేళ్ల కిందట గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఓ ఊరికి వలస వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. వారి కుమార్తె స్థానిక పాఠశాలలో గతేడాది ఏడో తరగతి చదివింది. ఆ సమయంలో గొట్టిపాడు గ్రామానికి చెందిన రాజుపాలెం రామకృష్ణ (27) బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి లోబరుచుకుని పలుమార్లు అనుభవించాడు. కొన్నినెలల తర్వాత బాలిక తండ్రి చనిపోవడంతో తిరిగి ఆ కుటుంబం స్వగ్రామం వెళ్లిపోయింది. అయినప్పటికీ సదరు యువకుడు ఆ ఊరికి వెళ్లి బాలికను కలిసి పలుమార్లు లోబరుచుకున్నాడు. పోలీసులు యువకుడిపై పోక్సో, అత్యాచార చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

కూతురిని గొంతుకోసి చంపిన తండ్రి

మానవత్వం మంటగలిసిపోతుంది. కన్నపేగును సైతం కాలరాస్తోంది. భార్యకు ఆనందాన్ని దూరం చేద్దామని కుట్ర పన్నిన భర్త..అభం శుభం తెలియని కన్న కుమార్తెనే కడ తేర్చాడు. శవాన్ని మాయం చేసే క్రమంలో అనూహ్యంగా ప్రమాదానికి కారణమై.. పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన కుందేటి చంద్రశేఖర్‌, హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతానికి చెందిన హిమబిందుకు 2011లో వివాహం జరిగింది.గతంలో భార్యాభర్తలు ఇద్దరూ బెంగళూరులో ఒకే ఐటీ కంపెనీలో పనిచేశారు. భార్య ఉన్నతస్థాయి బాధ్యతల్లో పనిచేస్తున్నారు. భర్త కింది స్థాయి ఉద్యోగిగా ఉన్నారు. అమెరికా, హైదరాబాద్‌లో ఒకే కంపెనీలో పనిచేసినప్పుడు భార్య టీం లీడర్‌ బాధ్యతల్లో చేపట్టారు. భర్త చంద్రశేఖర్‌ సాధారణ ఉద్యోగి(Software Job). పనితీరు బాగోలేదన్న కారణంతో చంద్రశేఖర్‌ను ఐటీ కంపెనీ సంస్థ ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పుడే చంద్రశేఖర్‌ భార్యపై కక్ష పెట్టుకున్నాడు. టీం లీడర్‌ స్థానంలో తన భార్య చెప్పడం వల్లే కంపెనీ తన ఉద్యోగం నుంచి తొలగించారని అనుమానించాడు. ఇదే విషయమై భార్యతో ఇంట్లో తరచూగ గొడవపడేవారని తెలిసింది. ఈ వేధింపులు తట్టుకోలేని భార్య తన కూతురు మోక్షజను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.వారంలో రెండుసార్లు కూతురి వద్దకి వెళ్లి చూసేవాడు. చంద్రశేఖర్‌ ఈ క్రమంలోనే మోక్షజ జాతకం గురించి తెలుసుకున్నాడు. భవిష్యత్​తో ఆమె కష్టాలు అనుభవిస్తుందని జాతకం ద్వారా భావించాడు. చందానగర్‌లో ఒంటరిగా ఉంటున్న అతను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో పాటు.. భార్య తనను పట్టించుకోవడం లేదని.. కూతురి కోసం ఇంటికెళ్లినప్పుడు ఆమె చులకనగా చూస్తోందని రగిలిపోయాడు. కూతురిని ఆమె దగ్గరే ఉంచుకుంటోందని కక్ష పెంచుకున్నాడు. తనలాగే భార్య కూతురిని కూడా ఇబ్బందులు పెడుతుందేమోనని మానసిక భావనలోకి వెళ్లిపోయాడు. కూతురు కష్టపడొద్దని.. భార్య ఒంటరిగా మారి నరకం చూడాలన్న ఆలోచనతో మోక్షజను అంతం చేయాలని పోలీసుల దర్యాప్తు తెలింది.చిన్నారి మోక్షజను శుక్రవారం సాయంత్రం తనతో పాటు కారులో తీసుకెళ్లి గొంతుకోసి చంపాడు స్కూల్‌ ముగిసి చాలా సమయమైనా కూతురు ఇంటికి రాకపోవడంతో భార్య కుటుంబ సభ్యులు చంద్రశేఖర్‌కు ఫోన్‌ చేశారు. పాపను ఇంకా ఇంటికెందుకు తీసుకురాలేదని ప్రశ్నించగా.. నిద్రపోతోందని నమ్మించాడు. గూగుల్‌ లొకేషన్‌ పంపిస్తే తామే వచ్చి తీసుకెళ్తామని చెబితే.. తానే వస్తానని చెప్పి ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు.మృతదేహాన్ని నగర శివార్లలో దూరంగా విసిరేసి ఆనవాళ్లు లేకుండా చేద్దామని.. తర్వాత తన సొంతూరు విజయవాడ పారిపోవాలన్న పథకాన్ని రచించాడు. ఓఆర్‌ఆర్‌పై తారామతిపేట-కోహెడ మధ్య చక్కర్లు కొట్టినా..మృతదేహాన్నివిసిరేసే అవకాశం దొరకలేదు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో కారు టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టినప్పుడు ఓ వ్యక్తి ఆప్రమాదాన్ని గమనించాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న స్ధానికుడు.. కారు లోపలి చంద్రశేఖర్‌ దుస్తులకు రక్తపు మరకలు, కారులో చిన్నారి మృతదేహం కనిపించడంతో అనుమానం వచ్చి డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చందని పోలీసులు వెల్లడించారు.

భర్తను క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి చంపిన భార్య

భర్తలు, భార్యలను చిత్రహింసలకు గురి చేయడం, ఇతర చెడు అలవాట్లకు బానిస అవడం లాంటీ కారణాలు ఎవి ఉన్నా భార్యలకు ఒపిక ఉన్నంతవరకే మగవాళ్ల ఆటలు కొనసాగుతాయి. వాళ్లలో ఒపిక, సహనం చచ్చిపోతే మాత్రం భద్రకాళీలా మారి భర్తలనే దారుణంగా చంపేసే పరిస్థితి ఉంటుంది. ఇలా భార్య కోపానికి బలైన ఓ భర్త తనువు చాలించాడు. భర్త మద్యానికి బానిస కావడంతో భార్య దారుణంగా చంపిన ఘటన రాజస్థాన్‌లోని జున్‌జును జిల్లాలో జరిగింది.రాజస్థాన్‌లోని జున్‌జును జిల్లాలో ఓ మహిళ తన భర్తను తాగి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేసిందని పోలీసులు తెలిపారు. ఆ మహిళను ఆదివారం అరెస్టు చేశారు. ఈ ఘటన జిల్లాలోని బాల్మీకి కాలనీలో శనివారం చోటుచేసుకుంది. కవితా దేవి (35) అనే మహిళ తన భర్త బంటీ బాల్మీకి (40)ని హత్య చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రోజూవారీ కూలీ అయిన ఆమె భర్త మద్యానికి బానిసయ్యాడని జుంజును పోలీస్ సూపరింటెండెంట్ శ్యామ్ సింగ్ తెలిపారు. శనివారం బంటీ బాల్మీకి తాగి ఇంటికి తిరిగి వచ్చి అతని భార్యను కొట్టడం ప్రారంభించాడని, ప్రతీకారంగా ఆమె అతనిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టిందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

నల్లగొండలో పొలాల్లో తీసుకువెళ్లిన ట్రావెల్ బస్సు

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంట పొలాల్లో ట్రావెల్ బస్సు తీసుకు పోవడంతో..ఇద్దరు మృతి వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం స్టేజ్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొట్టి పొలాల్లో తీసుకువెళ్లింది ట్రావెల్ బస్సు. ఈ ప్రమాదంలో బైక్ పైన ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. ట్రావెల్‌ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం 

 దేశ రాజ‌ధానిలోని ప‌శ్చిమ ఢిల్లీ నిలోథి గ్రామంలోని ఓ ఫ్యాక్ట‌రీలో సోమ‌వారం ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం (Fire Accident) జ‌రిగింది. ఘ‌ట‌నా స్ధలానికి ప‌ది అగ్నిమాప‌క యంత్రాల‌ను త‌ర‌లించి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.అగ్నిప్ర‌మాదం జ‌రిగిన ప్ర‌దేశంలో పెద్ద‌సంఖ్య‌లో ప్లాస్టిక్ పైపులు నిల్వ చేసి ఉండ‌టం విజువ‌ల్స్‌లో క‌నిపించింది. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ‌, ఆస్తిన‌ష్టం వాటిల్లిన వివ‌రాల‌ను ఇంకా అధికారులు వెల్ల‌డించ‌లేదు.కాగా, మంట‌లు ఎగిసిప‌డ‌టంతో ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ ఆవరించింది. కాగా ఈనెల 11న ఢిల్లీలోని భ‌వానా ప్రాంతంలోని ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించ‌గా కొద్దిరోజుల‌కే ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ఇక ఫ్యాక్ట‌రీలో అగ్నిప్ర‌మాదానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌రావాల్సి ఉంది.

బ్యాంకులో పని ఒత్తిడి తట్టుకోలేక మేనేజర్ సూసైడ్

బ్యాంకులో పని భారం భరించలేక ఓ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆఫీసులోనే ఆయన అఘాయిత్యానికి పాల్పడ్డారు. అస్వస్థతకు గురికావడంతో ఇతర సిబ్బంది ఆయనను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ పరిస్థితి విషమించడంతో చనిపోయారు. ఈ ఘటన ఆసిఫాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ లో బానోతు సురేష్ (35) తన భార్య ప్రియాంక, కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన వాంకిడి మండలంలోని ఎస్‌బీఐ బ్రాంచ్ లో మేనేజర్ గా పని చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయనకు పని భారం పెరిగింది. ఈ విషయాన్ని పలుమార్లు భార్యతో వెల్లడించారు. ఇద్దరు చేయాల్సిన పనిని తాను ఒక్కడిని చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కాగా.. ఎప్పటిలాగే ఈ నెల 17వ తేదీన కూడా బ్యాంకుకు వెళ్లారు. అంతకు ముందే తన వెంట పురుగుల మందు తీసుకెళ్లారు. విధులు పూర్తయిన తరువాత తన ఆఫీసులోనే 7.30 గంటల ప్రాంతంలో ఎవరికి తెలియకుండా పురుగుల మందు తాగారు. కొంత సమయం తరువాత అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీనిని ఇతర సిబ్బంది గమనించారు. ఏం జరిగిందని ప్రశ్నించారు. దీంతో తనకు ఆరోగ్యం బాగాలేదని ఆయన సమాధానం ఇచ్చాడు. దీంతో సిబ్బంది హుటాహుటిన సురేష్ ను ఆసిఫాబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. హాస్పిటల్ లో డాక్టర్లు ప్రథమ చికిత్స నిర్వహించారు. మెరుగైన చికత్స కోసం మంచిర్యాలలోని హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను కరీంనగర్ కు తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేటు హాస్పిటల్ లో సురేష్ ను జాయిన్ చేశారు. కాగా.. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం చనిపోయారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి లక్ష్మీరాజం ఫిర్యాదు మేరకు వాంకిడి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని వాంకిడి ఎస్సై సాగర్‌ తెలిపారు. 

*   కాపురంలో చిచ్చుపెట్టిన ఫోన్

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండరు.. ఆ ఫోన్ ఎందరి కాపురాలను కూల్చిందోమారేందరి ప్రాణాలను బలిగొనిందో చెప్పనక్కర్లేదు.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. ఫోన్ మాట్లాడుతుందని భార్యను అతి దారుణంగా భర్త చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. ఈ దారుణ ఘటన కర్ణాటక లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. తుమకూరు జిల్లా పావగడ తాలూకాలోని వైఎన్‌ హొసకోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బూదిబెట్ట గ్రామంలో భర్త చేతిలో భార్య హత్య కు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. లక్ష్మి, రామాంజినప్ప దంపతులు, వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఈ మధ్య భార్య ఎవరితోనో ఫోన్ లో మాట్లాడింది.. ఆ మాటలను తలుపు చాటున భర్త విన్నాడు.. అనుమానంతో రగిలిపోయాడు, దీనిపై గ్రామంలో పెద్ద మనుషుల తో పంచాయతీ పెట్టించగా వారు నచ్చజెప్పారు. కానీ రామాంజినప్ప ఆమెను కడ తేర్చాలని నిర్ణయించుకున్నాడు.తనని దారుణంగా మోసం చేసిన భార్యను ఎలాగైనా చంపెయ్యాలని ప్లాన్ చేసుకున్నాడు.. రాత్రి భార్య నిద్రిస్తుండగా రోకలిబండతో తలపై బాదాడు. ఆమెను బయటకు ఈడ్చుకు వచ్చి మళ్లీ బండరాయి తో తల పై కొట్టి హత్య చేశాడు. ఈ దుర్ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు.  మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన స్థానికంగా భయ బ్రాంతులకు గురించి చేసింది..నిందితున్ని అరెస్టు చేయడం తో తల్లీ, తండ్రి లేని అనాధలు అయ్యారు పిల్లలు.. వారిని చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌

 జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా (Pulwama) జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో (Encounter) ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. నిర్ధిష్ట సమాచారం మేరకు పుల్వామాలోని లారో-పరిగం ప్రాంతంలో (Larrow-Parigam) ఆదివారం అర్ధరాత్రి స్థానిక పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్‌ (Rashtriya Rifles) సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యం కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయినట్లు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. వారిలో ఒకరిని లష్కరే తొయీబా (Lashkar-e-Taiba) కమాండర్‌గా  అనుమానిస్తున్నామని చెప్పారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని, మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు వెల్లడించారు.రెండు వారాల క్రితం రాజౌరీ (Rajouri) జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమైన విషయం తెలిసిందే. ఆగస్టు 5న రాష్ట్రీయ రైఫిల్స్‌, కశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. కాగా, తాజా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

*  5 రోజుల వయసున్న శిశువుకు ఒకేసారి 5 టీకాలు

5 రోజుల పసికందుకు ఒకేసారి 5 టీకాలు వేసిన దారుణ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నర్సు నిర్వాకంతో చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పాలక్కాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ శిశువు తల్లిదండ్రులు చిన్నారికి బీసీజీ టీకా వేయించేందుకు స్థానికంగా ఉన్న ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడ వైద్యుడితో ప్రిస్క్రిప్షన్ రాయించుకుని, దాన్ని అక్కడి నర్సు చారులతకు చూపించారు. బిడ్డకు బీసీజీ టీకాకోసం వచ్చామని చెప్పడంతో నర్సు అకారణంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తరువాత బిడ్డకు తొలుత ఎడమ భుజంపై బీసీజీ టీకా ఇచ్చింది. అక్కడితో ఆగకుండా బిడ్డ తొడలపై మరో రెండు రకాల టీకాలు, ఆ తరువాత నోట్లో చుక్కలమందు వేసింది. అనుమానం వచ్చిన శిశువు తల్లిదండ్రులు వెంటనే డాక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ నర్సు బిడ్డకు బీసీజీతో పాటూ పెంటావేలెంట్ పోలియో టీకా, న్యూమోకొక్కల్ టీకా, నోటి ద్వారా తీసుకునే పోలియో టీకాతో పాటూ రోటావైరస్ టీకా వేసినట్టు తేలింది. దాంతో అధికారులు నిందితురాలిని సస్పెండ్ చేశారు. ఘటనపై డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి అయిదు టీకాలు తీసుకోవడంతో అనారోగ్యం పాలైన చిన్నారికి పాలక్కాడ్ జిల్లా ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.