Movies

చంద్రయాన్-3 పై ప్రకాష్ రాజ్ కార్టూన్ ట్వీట్

చంద్రయాన్-3 పై ప్రకాష్ రాజ్ కార్టూన్ ట్వీట్

చంద్రయాన్-3 లోని విక్రమ్ ల్యాండర్ పంపిన ఫొటో అంటూ ప్రకాశ్ రాజ్ ఓ కార్టూన్ ను ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక వ్యక్తిని ద్వేషించడానికి, దేశాన్ని ద్వేషించడానికి చాలా తేడా ఉందని ఆయనను విమర్శిస్తున్నారు.మరో రెండు రోజుల్లో చంద్రయాన్ -3 చందమామ దక్షిణ ధ్రువంపై దిగి చరిత్ర సృష్టించాలని చూస్తున్న తరుణంలో.. మన దేశ మూన్ మిషన్ పై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. ‘చంద్రుడి నుంచి వస్తున్న తొలి చిత్రం’ అంటూ ఆయన ఓ పోస్టు చేశారు. అందులో లుంగీ కట్టుకొని, పొడవాటి చేతులు ఉన్న షర్ట్ ధరించి, టీ పోస్తున్న కార్టూన్ ఫొటోను ఆదివారం షేర్ చేశారు.

‘‘ బ్రేకింగ్ న్యూస్ : విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుంచి పంపిన తొలి ఫొటో వావ్’’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో చంద్రయాన్-3ని ప్రకాశ్ రాజ్ అపహాస్యం చేస్తున్నారంటూ ఆ పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు. దీనిపై కమెడియన్ అపూర్వ్ గుప్తా కూడా స్పందించారు. ‘‘ఒకరిని ద్వేషించడానికి, దేశాన్ని ద్వేషించడానికి తేడా ఉంది. మీ ఈ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది!’’ అంటూ పేర్కొన్నారు.చాలా మంది వినియోగదారులు ఇలాంటి భావాలనే వ్యక్తపరిచారు. అతడి రాజకీయ భావజాలంతో సంబంధం లేకుండా మూన్ మిషన్ ను గౌరవించాలని సలహా ఇచ్చారు. కొందరు యూజర్లు ఆయన పోస్ట్ అభ్యంతరకరంగా ఉందని, మోడీని విమర్శించే ప్రయత్నంలో, రాజ్ వాస్తవానికి శాస్త్రవేత్తల కృషిని అపహాస్యం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘మోడీపై గుడ్డి ద్వేషంతో చంద్రయాన్ ను హేళన చేసినందుకు సిగ్గుపడాలి. దీన్ని విజయవంతం చేయడానికి ఏళ్ల తరబడి శ్రమించిన మన శాస్త్రవేత్తలను మీరు ఎగతాళి చేస్తున్నారు’’ అని ముంబైకి చెందిన ఓ బీజేపీ నాయకుడు కామెంట్ చేశారు.

చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ విఫలం కావాలని, దీని వల్ల మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కొందరు దేశ పౌరులు ప్రార్థిస్తున్నారని మరో ఎక్స్ (ట్విట్టర్) యూజర్ పేర్కొన్నారు. కాగా.. చాలా కాలంగా ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీ ప్రకాశ్ రాజ్ విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన బహిరంగంగా వ్యతిరేకించారు.

ఇదిలా ఉండగా.. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు సిద్ధమవుతోంది. సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కొండలు, లోయలు లేని అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ వెతుకుతోంది. నాలుగేళ్ల క్రితం 2019 సెప్టెంబర్ లో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కు ప్రయత్నించి, చివరి దశలో విఫలమైన చంద్రయాన్-2కు కొనసాగింపుగా ఈ మిషన్ ను ఇస్రో చేపట్టింది. ఈ సారి సాఫ్ట్ ల్యాండింగ్ జరిగితే అమెరికా, చైనా, మాజీ సోవియట్ యూనియన్ వంటి అగ్రరాజ్యాల జాబితాలో భారత్ చేరుతుంది.