సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మధ్య వివాదం ముదురుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పోసాని కృష్ణ మురళిపై నారా లోకేశ్ రూ.4కోట్లకు పరువు నష్టం దావా వేయడం సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన పోసాని హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీ స్టేట్ ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి టీడీపీ నేత నారా లోకేశ్ పై సంచలన ఆరోపణలు చేశారు. లోకేశ్ వల్ల తనకు ప్రాణహాని ఉందన్నారు పోసాని కృష్ణమురళి. కోర్టుకు హాజరయ్యేటప్పుడు తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. నేను చనిపోతే నా చావుకి కారణం నారా కుటుంబమే అన్నారాయన.
”లోకేశ్ నాపై 4 కోట్లకు పరువు నష్టం దావా వేశాడు. 2 ఏళ్లు నేను జైల్లో ఉండాలంట. అమ్మనా బూతులు తిట్టే లోకేశ్ పై నేను పరువు నష్టం దావా వేస్తే 20 ఏళ్లు జైల్లో ఉంటాడు. కంతేరు దగ్గర లోకేశ్ ల్యాండ్ కొన్నాడని నేను ఎప్పుడో అన్నానని నష్టపరిహారం కావాలంట. ఫారినర్స్ తో ఎంజాయ్ చేస్తున్న లోకేశ్ పై నేను పరువునష్టం దావా వేస్తాను.
లోకేశ్ ఎవరిపైనా విమర్శలు చేయలేదా? జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన లోకేశ్ పై పరువు నష్టం దావా వేస్తే 20ఏళ్లు జైళ్లో ఉంటాడు. నాపై పాత కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టడంతో తనపై కక్ష కట్టాడు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్ధుడు చంద్రబాబు.
నారా కుటుంబం మొత్తం వేరా? ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఆస్తులు కొంటున్నారా? తల్లి, భార్య పేరు మీద ఉన్న ఆస్తులు ఎవరివి? లోకేశ్ పేరు మీద లేదని నన్ను జైల్లో పెడతారా? నేను వాస్తవాలు బయటపెడుతున్నానని మర్డర్ చెయ్యాలనుకుంటున్నారు. పుంగనూరులో నాపై కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవొచ్చు. కమ్మ కులమే గెలవాలా? లోకేశ్ నుంచి నాకు ప్రాణాహాని ఉందని చెప్పడానికి సాక్ష్యాలు లేకపోవచ్చు. కానీ ఇది నా మరణ వాగ్మూలం. నేను ఎవరికీ భయపడను. నేను కూడా లోకేశ్ పై కేసు పెడుతున్నా.
చంద్రబాబుపై ఎన్ని కేసులు ఉన్నా జైలుకు వెళ్లలేదు. కొంతమందికి కులం పిచ్చి ఎక్కించి నన్ను తిట్టిస్తున్నారు. కులాభిమానం ఉండొచ్చు. కానీ, దురాభిమానం ఉండకూడదు. గెలిచింది ఎవరైనా ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా అనేది చూడాలి. అమరావతిలో 5 శాతం భూములు పేదలకు ఇవ్వాలని చట్టంలో ఉంది. ఆ చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారు.(Posani Krishna Murali)
ప్రతిపక్షంలో కూర్చుని బూతుపనులు చేస్తున్నారు. నేను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. డబ్బులేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. నేను సంపాదించిన ఆస్తి మొత్తం పేద ప్రజలకు ఇచ్చేస్తా. రాజధాని రైతులు సెంటు భూమి ప్రభుత్వానికి ఇస్తారా? రాజధానిలో రైతులను చూస్తుంటే జాలేస్తుంది” అని పోసాని కృష్ణమురళి అన్నారు.