కాస్త చీకటి పడితే చాలు… లైట్ల వైపుగా ఇళ్లలోకి పరుగులు తీస్తుంటాయి పేడ పురుగులు. రెక్కల సాయంతో అటూ ఇటూ ఎగిరే ఈ జీవాల్ని కట్టడి చేయడం కాస్త కష్టమైన పనే. కానీ వాటి డిజైన్లు నగల్లో కనిపించడం, అలాంటి వాటిని ధరించడం ఇప్పుడు క్రేజ్‌గా మారింది. నిజానికి స్కారబ్ బీటిల్ జువెలరీ అన్నది ఈజిప్షియన్ల కాలానిది. మట్టిని లేదా పేడను ఉండలుగా చేస్తూ నడిచే ఈ ప్రాణిని సూర్యుడికి గుర్తుగా భావించేవారట. అందుకే వాళ్ల సంస్కృతిలో అంత పవిత్ర స్థానం లభించింది. శక్తికి, రక్షణకు, అదృష్టానికి చిహ్నంగానూ భావిస్తారు. అంతేకాదు, పునరుత్పత్తికి సంకేతంగా… బిడ్డల కోసం ఎదురు చూసే తల్లులకు వీటిని బహుమతిగా ఇస్తారు. ఆ తర్వాతి కాలంలో ఇటలీ, ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్ తదితర దేశాలకు ఈ సంస్కృతి పాకింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా నగలు తయారవుతున్నాయి. బ్రేస్‌లెట్లు, ఉంగరాలు మొదలు నెక్లెస్‌లు, బ్రూచ్‌ల లాంటివీ ఈ డిజైన్లలో రూపొందిస్తున్నారు. పచ్చలు, నీలాలు, కెంపుల్ని పొదుగుతున్నారు ఇందులో. వీటి వెనక కథ ఏదైనా, క్రేజీగా కనిపిస్తుండటంతో కుర్రకారు కెవ్వుకేక పెడుతున్నారు!
పేడ పురుగు డిజైన్లే ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్
Related tags :