Editorials

నేటి నుండి ఫ్యుకుషిమా అణు వ్యర్థాలు పసిఫిక్‌లోకి విడుదల

నేటి  నుండి ఫ్యుకుషిమా అణు వ్యర్థాలు పసిఫిక్‌లోకి విడుదల

జపాన్‌లో భూకంపంతో దెబ్బతిన్న ఫ్యుకుషిమా అణు రియాక్టర్‌ నుంచి వ్యర్థ జలాలను గురువారం నుంచి సముద్రంలోకి విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంట్‌ను మూసివేయాలంటే వ్యర్థ జలాలను ఫసిఫిక్‌ మహా సముద్రంలోకి వదిలేయాక తప్పదని జపాన్‌ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిదా మంగళవారం చెప్పారు. కేబినెట్‌ మంత్రులతో సమావేశమైన ఆయన ఈ వ్యర్థ జలాలను ప్రణాళికా బద్ధంగా సముద్రంలోకి పంపాలని ఇందు కోసం ప్లాంట్‌ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 24 నుంచి నీటి విడుదల కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2011 మార్చి 11న సంభవించిన తీవ్రమైన భూకంపం అనంతరం ముంచెత్తిన సునామీకి ఈ ప్లాంట్‌ దెబ్బ తింది. అప్పట్నుంచి ఈ వ్యర్థ జలాలను జపాన్‌ నిల్వ చేసి ఉంచింది. కానీ ఇప్పుడు వాటిని నిల్వ చేయడానికి చోటు సరిపోక సముద్రంలోకి వదలాలని నిర్ణయించింది. ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేయడంపై చుట్టుపక్కల దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. జపాన్‌ దగ్గర దాదాపుగా 13.4 లక్షల టన్నుల వ్యర్థ జలాలు ఉన్నాయి. వీటిని దశలవారీగా శుద్ధి చేసి సముద్రంలోకి వదులుతారు. ఇలా చెయ్యడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని అంచనా. ఈ నీళ్లను సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నీటి విడుదలకి ఇంటర్నేషనల్‌ ఆటమిక్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ఇప్పటికే అంగీకరించింది. జపాన్‌ పసిఫిక్‌ సముద్రాన్ని తన సొంత మురికి కాల్వగా భావిస్తోందని చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు విమర్శిస్తున్నాయి.