NRI-NRT

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి ఆరంభం

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి ఆరంభం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పార్టీలపరమైన రాజకీయ హంగామాకు బుధవారం తెరలేవబోతోంది. విస్కాన్సిన్‌ రాష్ట్రంలో రిపబ్లికన్‌ ఆశావహులు తమ పార్టీ అభిమానులు, నిధులిచ్చే దాతల మనసు గెల్చుకునేందుకు ఫాక్స్‌ న్యూస్‌ నిర్వహించే చర్చా వేదికద్వారా తొలి ప్రయత్నం చేయబోతున్నారు. ఆశావహులైనవారు తాము బలమైన అభ్యర్థులమని ఎలుగెత్తి చాటడానికీ ఈ వేదికను వారు ఉపయోగించుకోనున్నారు. చర్చలో డొనాల్డ్‌ ట్రంప్‌ తప్ప రిపబ్లికన్‌ పార్టీ టికెట్‌ ఆశిస్తున్న ప్రధాన అభ్యర్థులంతా పాల్గొనబోతున్నారు. అనేక కేసులు ఎదుర్కొంటున్నా పార్టీ అంతర్గత సర్వేల్లో ట్రంప్‌ అందరి కంటే ముందున్నారు. ఆ ధీమాతోనే చిన్నచిన్న అభ్యర్థులతో తానీ ప్రాథమిక చర్చలో పాల్గొనబోనని ఆయన వైదొలిగారు. దీని బదులు టెలివిజన్‌ ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీలో ట్రంప్‌ ప్రాబల్యమున్నా మిగిలిన ఆశావహులు వెనక్కి తగ్గట్లేదు. ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హెలీ, సెనెటర్‌ టిమ్‌ స్కాట్‌, ట్రంప్‌ హయాంలో ఉపాధ్యక్షుడిగా పని చేసిన మైక్‌ పెన్స్‌, న్యూజెర్సీ మాజీ గవర్నర్‌ క్రిస్‌ క్రిస్టీ, నార్త్‌ డకోటా గవర్నర్‌ డౌగ్‌ బర్గమ్‌, అర్కాన్సాస్‌ గవర్నర్‌ అసా హచిన్సన్‌, పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి చర్చకు అర్హత సంపాదించారు. ఒకరిద్దరు ఈ జాబితాకు ఇంకా అదనంగా చేరితే చేరొచ్చు. వీరిలో నిక్కీ హెలీ, వివేక్‌ రామస్వామి భారత సంతతివారు. ఆశావహులంతా ఇప్పటికే దాదాపు 150 కోట్ల రూపాయలకుపైగా నిధులను సమీకరించారు. ట్రంప్‌కు బలమైన పోటీదారుగా భావిస్తున్న రాన్‌ డిశాంటిస్‌కు ఈ సంవాదం అగ్ని పరీక్షగా భావిస్తున్నారు. ట్రంప్‌ కేసులపై కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో డిశాంటిస్‌ తన రేటింగ్‌ను పెంచుకోవడం తప్పనిసరి.

పలు అంశాలపై..
ఫాక్స్‌ న్యూస్‌ నిర్వహించే ఈ చర్చలో రిపబ్లికన్‌ అభ్యర్థులు అనేక అంశాలపై తమ వాదనలను వినిపించబోతున్నారు. వీటిలో రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి, అమెరికాలో అబార్షన్‌ చట్టాల వివాదం దాకా పలు అంశాలు ఉండబోతున్నాయి. ప్రధాన అభ్యర్థి అనుకున్న వారిని దెబ్బతీయడానికి, అనామకుడు అనుకున్న వారిని రేసులో నిలబెట్టడానికి ఈ ప్రాథమిక స్థాయి చర్చ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయబోతున్న వారిపై వీటి ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. దీని తర్వాత కాలిఫోర్నియాలో మరో ప్రాథమిక సంవాదం ఉంటుంది.

గత అధ్యక్ష ఎన్నికల సందర్భంగా (2020లో) జార్జియా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకున్న కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర అధికారుల ముందు ఈ నెల 24న లొంగిపోతానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో జార్జియాలో ట్రంప్‌ ఓడిపోయినప్పటికీ విజయం సాధించినట్లు చూపేందుకు ప్రయత్నించారన్నది ఆయనపై అభియోగం. ‘‘దీన్ని మీరు నమ్ముతారా? అరెస్టయ్యేందుకు నేను గురువారం (ఈ నెల 24న) జార్జియా రాజధాని అట్లాంటాకు బయలుదేరి వెళ్తున్నా’’ అని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ ‘ట్రూత్‌’లో సోమవారం రాత్రి రాసుకొచ్చారు. ఈ ఏడాది ట్రంప్‌పై దాఖలైన నాలుగు క్రిమినల్‌ కేసుల్లో ఇదొకటి. గత కేసుల్లో కూడా ఆయన బెయిల్‌ పొందారు. ఇప్పటికే ట్రంప్‌.. స్వయంగా ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్‌ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ ఫాని విల్లీస్‌ అనుమతించారు. ట్రంప్‌పై.. 13 ఆరోపణలున్నాయి. ట్రంప్‌ మాత్రం ఈ ఆరోపణలు మొత్తం అవాస్తవాలని అంటున్నారు. పూర్తిగా రాజకీయ దురుద్దేశపూర్వకంగానే వీటిని చేపట్టినట్లు ఆరోపిస్తున్నారు.