DailyDose

భార్య ప్రసవానికి భర్తకు సెలవు ఇవ్వాలని హైకోర్టు కోర్టు ఆదేశం

భార్య ప్రసవానికి భర్తకు సెలవు ఇవ్వాలని హైకోర్టు కోర్టు ఆదేశం

తన భార్య నిండు గర్భిణి అని ఆమెకు ప్రసవం జరిగే సమయానికి తాను పక్కన ఉండాలని..భర్తగా అది తన బాధ్యత అని భావించిన ఓ పోలీసు ఇన్పెక్టర్ తనకు సెలవు కావాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు సెలవు ఇవ్వటానికి అంగీకరించలేదు. దీంతో సదరు ఇన్పెక్టర్ కోర్టును ఆశ్రయించారు. తాను పక్కన ఉంటే తన భార్య ధైర్యంగా ఉంటుందని భర్తగా అది తన బాధ్యత అంటూ తనకు సెలవు మంజూరు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతు కోర్టుకు విన్నవించుకున్నాడు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం భార్య ప్రసవానికి భర్తకు సెలవు ఇవ్వాల్సిందేనంటు తీర్పునిచ్చింది. ఈ సందర్బంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తగా అతను చాలా బాద్యతగా ఆలోచించాడని పేర్కొంది.

మద్రాస్ హైకోర్టు(Madras High Court)లోని మధురై ధర్మాసనం (Madurai Bench)ఇచ్చిన ఈ తీర్పు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులోని తెన్ కాసి జిల్లాలోని కడయం పోలీస్ స్టేషన్ లో ఇన్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పి.శరవణను తన భార్య ప్రసవానికి తనకు సెలవు కావాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రసవం సమయంలో తాను ఆమె పక్కన ఉండేందుకు మే 1 నుంచి 90 రోజులు సెలవులు కావాలంటూ శరవణ్ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

దీనిపై ఉన్నతాధికారులు మొదట సెలవులు మంజూరు చేయటానికి అంగీకరించారు. కానీ తరువాత కుదరదు అని తేల్చి చెప్పారు. దానికి సంబంధించి మోమో జారీ చేశారు. దీంతో శరవణన్ మద్రాస్ హైకోర్టులోని మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం ప్రసూతి సమయంలో భార్య బాగోగులను చూసుకోవాల్సిన అవసరం భర్తకు ఉందని, కాబట్టి ఆయన సెలవు దరఖాస్తును పరిశీలించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌దారుడు బాధ్యతాయుతమైన భర్తగా వ్యవహరించారని..కాబట్టి ఆయనకు ఇచ్చిన మెమోను రద్దు చేస్తున్నట్టు పేర్కొంటూ మెమోను రద్దు చేస్తూ జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరీ నేతృత్వంలోని ధర్మాసంన ఉత్తర్వులు జారీ చేసింది.