అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకు ఏ దేశమూ చేరుకోని చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను సురక్షితంగా దింపి జయకేతనం ఎగురవేసింది. నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను పట్టుదలతో ఇస్రో సాకారం చేసుకుంది. చంద్రయాన్-3 మిషన్‌లో తుది అంకాన్ని దిగ్విజియంగా పూర్తి చేసింది. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. ఇప్పటివరకూ అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ మాత్రమే చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించగా వాటి సరసన భారత్ కూడా చేరింది. ఐతే ఏ దేశమూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టడం ఇస్రో ఖ్యాతిని విశ్వవాప్తం చేసింది.
సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు ల్యాండర్ మాడ్యూల్ నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంది. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ ప్రారంభమైంది. ALS కమాండ్‌ను స్వీకరించిన వెంటనే ల్యాండర్ మాడ్యూల్ థ్రాటల్ బుల్ ఇంజిన్ల వేగాన్ని తగ్గించుకుంటూ ముందుకెళ్లింది. చివరి 17 నిమిషాల సంక్షిష్ట ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న విక్రమ్ ల్యాండర్ సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు జాబిల్లిపై అడుగుపెట్టింది. గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వ్యోమనౌక 17 నిమిషాల్లోనే తన జోరుకు కళ్లెం వేసుకుని చందమామ దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగింది.
చందమామ ఉపరితలంపై సెకనుకు సెంటీమీటరు వేగంతో రోవర్ కదులుతుంది. ల్యాండర్, రోవర్ 14 రోజుల పాటు జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తాయి. బెంగళూర్‌లోని మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ నుంచి చంద్రయాన్-3 ల్యాండింగ్ ఈవెంట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు వీక్షించారు. బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు