అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల మోత (Mass Shooting) మోగింది. కాలిఫోర్నియా (California)లోని ఆరెంజ్ కౌంటీలో ప్రముఖ బైకర్స్ బార్ వద్ద దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అమెరికా (USA) కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు రిటైర్డ్ పోలీసు అధికారి అని అమెరికా (America) మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తనను దూరం పెడుతున్న భార్యను లక్ష్యంగా చేసుకుని నిందితుడు ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది.కాల్పుల ఘటన గురించి సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుడిని అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కాల్పులు జరగ్గా.. నిందితుడు సహా ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు.