దేవుడి గుడిలో అడుగు పెట్టగానే భక్తులు భక్తిలో మునిగిపోతారు. దేవుడిపై అపార నమ్మకంతో హుండీలోనూ అందుకు అనుగుణంగా కానుకలు వేస్తుంటారు. దేవుడికి చెల్లించడానికీ ఉబలాపడతారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం కొంత తెలివిగా నడుచుకున్నట్టు అర్థం అవుతున్నది. బంగారం వేసి దాన్ని కోల్పోవడం ఎందుకు అని కొత్తగా ఆలోచించాడో ఏమో. ఖాతాలో వంద రూపాయలైనా లేకున్నా.. వంద కోట్లు రాసి ఓ చెక్ హుండీలో వేశాడు. ఏమవుద్దీ.. ఏమైనా తన ఖాతాలోనే డబ్బు లేదు.. అంతకు మించి ఆ దేవుడేమైనా బ్యాంకుల చుట్టూ తిరుగుతాడా? అని అనుకున్నాడో ఏమో గానీ, ఆ చెక్ చూసిన ఆలయ సిబ్బంది మాత్రం ఖంగుతిన్నారు.
ఈ ఘటన సింహాచలం వరాహలక్ష్మీ నర్సింహ స్వామి హుండీని సిబ్బంది పక్షం రోజులకు ఒకసారి లెక్కిస్తారు. తాజాగా ఈ హుండీని ఓపెన్ చేయగా.. అందులో రూ. 100 కోట్ల విరాళం కనిపించింది. సింహాద్రి అప్పన్న ఆలయంలో ఈ ఘటన వెలుగు చూసింది.ఆలయ చరిత్రలో రూ. 100 కోట్ల కానుక హుండీలో పడటం ఇదే ప్రథమం. దీంతో ఆలయ సిబ్బంది కూడా ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఆలయాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలా? అని ఆలోచనలూ చేశారు. ఈ విషయం ఆ నోట ఈ నోట మీడియాకు చేరింది. మీడియా సిబ్బంది కొందరు ఈ విషయాన్ని ఆలయ సిబ్బందితో ప్రస్తావించారు. దీంతో ఆలయ సిబ్బంది ఆ చెక్ వివరాల కోసం బ్యాంకును సంప్రదించారు. బ్యాంకు నుంచి వారు దిమ్మదిరిగే జవాబు విన్నారు.
సదరు ఖాతాదారు పేరు బొడ్డేపల్లి రాధాకృష్ణకు చెందినదని బ్యాంకు అధికారులు చెప్పారు. ఆయన ఖాతాలో రూ. 100 కోట్లు కాదు కదా.. వంద రూపాయాలు కూడా లేవని చెప్పారు. ఆ ఖాతాలో రూ. 17 మాత్రమే ఉన్నాయని వివరించారు. దీంతో ఆలయ సిబ్బంది ఖంగుతిన్నారు.ఇది ఆకతాయి పనా? లేక మతిస్థిమితం సరిగా లేక ఎవరైనా చేసిన పనా? అని ఆలోచిస్తున్నారు. చెక్కును బ్యాంక్‌కు పంపి అధికారికంగా వివరాలు తెలుసుకోవాలని సిబ్బంది నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఏం చేయాలనే విషయాన్నినిర్ణయించుకుంటామని చెప్పారు. సదరు భక్తుడిపై చర్యలు తీసుకోవాలా? మందలించాలా? వదిలివేయాలా? అనే విషయాన్నీ పరిశీలిస్తామని తెలిపారు.