తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శ్రావణ శుక్రవారం.. అది కూడా వరలక్ష్మీ వ్రతం కావడంతో భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు పోటెత్తారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అమ్మవార్ల కోవెలలు భక్తులతో సందడిగా మారాయి. కుటుంబ సమేతంగా అమ్మవార్లకు భక్తులు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సూర్యోదయం కంటే ముందు నుంచే ఆలయానికి క్యూ కట్టారు. మరోవైపు.. రాజరాజేశ్వరీ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేస్తున్నారు. కన్యకాపరమేశ్వరి గుడిలో అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా మారింది. మంత్రోచ్ఛరణలు ఆ ప్రాంగణంలో మార్మోగుతున్నాయి.
మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.