DailyDose

అయ్యన్న బుద్దా వెంకన్నపై కేసులు-TNI నేటి నేర వార్తలు

అయ్యన్న బుద్దా వెంకన్నపై కేసులు-TNI నేటి నేర వార్తలు

అయ్యన్న బుద్దా వెంకన్నపై కేసులు

 మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన ఫిర్యాదు మేరకు పలువురు తెదేపా నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా గన్నవరంలో నిర్వహించిన బహిరంగసభలో తెదేపా నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌లో పేర్ని నాని ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. అయ్యన్నపై 153A, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద.. బుద్దా వెంకన్నపై 153, 153A, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఆరేళ్ల మూగ చెవిటి బాలికపై మేనమామ అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చెవిటి, మూగ బాలికపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగినప్పటికీ గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.నిందితుడిని ఎస్ మాల్యాద్రి (27)గా గుర్తించారు.స్థానిక దేవతా ఉత్సవానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు గ్రామానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు బాధితురాలు, బాధితురాలి తల్లితో కలిసి బైక్‌పై కిరాణా సామాను కొనుగోలు చేసేందుకు సమీపంలోని గ్రామానికి వెళ్లారు.బాధితురాలి తల్లి కొనుగోళ్లలో నిమగ్నమై ఉండగా, నిందితుడు బాలికను చాక్లెట్‌ కొనిపిస్తానని ఆశ చూపించి పిలిచాడు. ఆ తరువాత తన బైక్‌పై నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బుధవారం సాయంత్రం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.బాలిక కనిపించకపోవడంతో కోసం కుటుంబ సభ్యులు వెతకుతుండగా.. బాలికతో పాటు నిందితుడుగ్రామానికి వచ్చాడు. అత్యాచార ఘటన చిన్నారిపై తీవ్ర ప్రభావం చూపించింది. మాటలు రాని ఆ చిన్నారి కన్నీళ్లతో తల్లిని గట్టిగా కౌగిలించుకుని, వణికిపోయింది. ఎక్కడికి వెళ్లావని తల్లి అడిగితే… సంకేత భాషతో తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతోపాటు బాలిక ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం కారడాన్ని బాధితురాలి తల్లి గమనించింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దీనిమీద పోలీసు అధికారులు మాట్లాడుతూ.. “నిందితుడిపై ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసాం. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చాం’’ అని తెలిపారు.

మద్యం విక్రయం కేసులో వాలంటీర్‌ అరెస్టు

కర్నూలు జిల్లా హాలహర్వి మండలం మల్లికార్జునపల్లి గ్రామంలో వాలంటీరుగా విధులు నిర్వహిస్తున్న వీరభద్రి అనే వ్యక్తిని కర్ణాటక మద్యం విక్రయిస్తున్న కేసులో సెబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన వీరభద్రి వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వాలంటీరుగా చేరి విధులు నిర్వహిస్తున్నాడు. అధికార పార్టీ అండ చూసుకుని గ్రామంలో కర్ణాటక మద్యం అమ్మకాలకు తెరలేపాడు. విధినిర్వహణలో భాగంగా సెబ్‌ పోలీసులు గురువారం గ్రామంలో దాడులు నిర్వహించారు. వీరభద్రి అక్రమంగా తెచ్చిపెట్టుకున్న 96 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయాలను సెబ్‌ పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం.

ప్రియురాలిని దారుణంగా హ‌త్య‌చేసిన ప్రియుడు

 కర్ణాటకలో తాజాగా ఒక షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌న‌పై వేధింపులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు ఒక దుర్మార్గుడు. దక్షిణ కన్నడ జిల్లాలో తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఓ వ్యక్తి తన 18 ఏళ్ల ప్రియురాలిని గొంతు కోసి హత్య చేశాడ‌నీ, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు.వివ‌రాల్లోకెళ్తే.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో 18 ఏళ్ల ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో నిందితుడు బాలికను హత్య చేశాడని పోలీసులు తెలిపారు. పుత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పుత్తూరు బస్ స్టేషన్ లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో పద్మరాజ్ అనే నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాలిక బెదిరించింది.పుత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా పద్మరాజ్ మోటార్ సైకిల్ పై ఆమెను వెంబడించి గొంతు కోశాడు. అటుగా వెళ్తున్న వారు బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడనీ, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ దుర్గావాహిని జిల్లా కన్వీనర్ శ్వేతా అద్యపాడి మాట్లాడుతూ ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. మహిళలపై ఇలాంటి దాడులు జరగకుండా పోలీసులు చూడాలన్నారు. పుత్తూరులో మహిళా పోలీస్ స్టేషన్‌కు కొన్ని మీటర్ల దూరంలో 18 ఏళ్ల బాలిక హత్యకు గురికావ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మ‌ని పేర్కొన్నారు.

జార్ఖండ్‌లో బాలికపై దారుణం

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జార్ఖండ్‌లోని సిమ్‌డేగా జిల్లాలో 19 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్దేగా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాలిక శనివారం జలదేగా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చింది. బాలిక సోమవారం ఒక వీక్లీ మార్కెట్‌ను సందర్శించి తిరిగి వెళుతుండగా, ఒక యువకుడు ఆమెను తన ఆటో రిక్షాలో ఎక్కించుకొని పాడుబడిన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ అతను తన స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు.మరుసటి రోజు, ఆమెను క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై నలుగురు వ్యక్తులు రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. గురువారం ఉదయం నిందితులు బాలికను విలియం చౌక్ సమీపంలో వదిలివెళ్లడంతో ఆమె జలదేగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. శుక్రవారం బాలికను వైద్య పరీక్షలకు పంపుతామని పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ బీరేంద్ర శర్మ తెలిపారు.

మునగచర్ల నేషనల్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగచర్లలోని నేషనల్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కాగా ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తరగతి గదిలో తేలు కాటు

తరగతి గదిలో తేలు కుట్టి విద్యార్థి మృతిచెందిన ఘటన డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన వై.ప్రసాద్‌, శ్రీదేవిల చిన్నకుమారుడైన అభిలాష్‌ (14).. వాకతిప్ప జడ్పీహెచ్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గురువారం తరగతి గదిలో చిక్కీల రేపర్లు ఎక్కువగా ఉండటంతో మరో విద్యార్థితో కలిసి వాటిని ఏరుతుండగా అభిలాష్‌ ఎడమ చేతిని తేలు కుట్టింది. ఉపాధ్యాయులు విద్యార్థిని వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఊపిరితిత్తుల్లోకి విషం చేరడంతో, రక్తపు వాంతులు అయ్యి బాలుడు మృతిచెందినట్లు వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసినట్లు అంగర ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి వలస కూలీగా వరంగల్‌లో పనిచేస్తుండగా, తల్లి ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటున్నారు. తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటుండగా ఇలా జరగడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

జబర్దస్త్‌ కమెడియన్‌ అరెస్ట్‌

జబర్దస్త్‌ కమెడియన్‌ నవసందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రేమపేరుతో యువతిని మోసం చేశాడన్న ఫిర్యాదు మేరకు నవసందీప్‌ను మధురానగర్‌లో అరెస్ట్‌ చేశారు. కాగా ఇటీవల ఓ యువతి.. తనను నవసందీప్‌ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు నటుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం..జబర్దస్త్‌ నటుడు నవసందీప్‌ 2018లో ఓ యువతికి ప్రేమకబుర్లు చెప్పి దగ్గరయ్యాడు. నిత్యం వాట్సాప్‌ చాటింగ్‌ చేసేవాడు. ఆమెను ఊరి నుంచి హైదరాబాద్‌కు రప్పించాడు. షేక్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఆ యువతి నాలుగేళ్లుగా ఉంటోంది. ఈ క్రమంలో త్వరలో పెండ్లి చేసుకుంటానని నమ్మించి తన కోరిక తీర్చుకున్నాడు. తర్వాత ఆమె పెళ్లి ప్రస్తావన తేగానే ముఖం చాటేశాడు. తాను వేరొకరిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నవసందీప్‌ను అరెస్ట్‌ చేశారు.

ఓబుళాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు

ఓబుళాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఓబుళాపురం మైనింగ్ కేసుకు సంబంధించి గతంలో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇవ్వడంపై సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం.. శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసింది. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి. అనంతపురం జిల్లా ఓబుళాపురం, మలపనగుడి గ్రామాల్లోని బళ్లారి రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలోని ఓఎంసీకి మైనింగ్‌ లీజుల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌, అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 2009 డిసెంబర్‌ 7న సీబీఐ ఓఎంసీపై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి శ్రీలక్ష్మి పాత్రపై దర్యాప్తు చేసిన సీబీఐ.. 2012 మార్చి 30న ఆమెపై చార్జిషీట్ దాఖలు చేసింది. 2007 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో శ్రీలక్ష్మి తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.ఓఎంసీకి అనుకూలంగా అక్రమ మైనింగ్ లైసెన్సులను మంజూరు చేసేందుకు కుట్ర పన్నడం ద్వారా ఆమె తనకు లభించిన అధికారాలను దుర్వినియోగం చేసిందని అభియోగం మోపింది. అనంతపురంలో మైనింగ్ లీజులు మంజూరు చేయడంలో ఓఎంసీ ప్రమోటర్, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డితో ఆమె కుమ్మక్కైనట్లు సీబీఐ పేర్కొంది.

ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి

దుమ్ముగూడెం మండల పరిధిలోని నరసాపురం గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసాపురం గ్రామానికి చెందిన మండలోజు ఝాన్సీ రాణి(51)అనే మహిళ దుర్మరణం పాలైంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుమ్మగూడెం వైపు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. మృతురాలి సోదరుడు వెంకన్న చారి ఫిర్యాదు మేరకు ఎస్సై పడాల కేశవ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.