Business

గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్‌5 & ఫోల్డ్‌5 ఫోన్‌లకు డిమాండ్-TNI నేటి వాణిజ్య వార్తలు

గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్‌5 & ఫోల్డ్‌5 ఫోన్‌లకు డిమాండ్-TNI నేటి వాణిజ్య వార్తలు

గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్‌5 & ఫోల్డ్‌5 ఫోన్‌లకు డిమాండ్

సామ్‌సంగ్‌కు చెందిన పలు మాడళ్లకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. దేశీయంగా తయారైన గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌5, జెడ్‌ఫోల్డ్‌5లకోసం కస్టమర్లు ఎగబడి కొనుగోలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 1.50 లక్షల ముందస్తు బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ పేర్కొంది. ఐదో జనరేషన్‌గా గత నెల చివర్లో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ కోసం ఈ నెల 17న ముందస్తు బుకింగ్‌లను నిలిపివేసింది. ఐదో జనరేషన్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించిందని సామ్‌సంగ్‌ ఇండియా మొబైల్‌ బిజినెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజు పుల్లన్‌ తెలిపారు. ఈ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌, గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5తో దేశీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో తిరిగి తొలి స్థానం దక్కించుకోనున్నట్లు చెప్పారు. ఈ గెలాక్సీ ఫోన్లను రిటైల్‌ మార్కెట్లో 10 వేల స్టోర్లలో కూడా లభించనున్నట్లు తెలిపారు. గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌5(256జీబీ) ధర రూ.85,999, గెలాక్జీ జెడ్‌ ఫోల్డ్‌ 5(256జీబీ) ధర రూ.1,38,999 గా నిర్ణయించింది.

హ్యాపీబర్త్‌డే విండోస్‌

కంప్యూటర్‌ ఓఎస్‌ అనగానే విండోస్‌ (Windows) పేరు టక్కున చెప్పేస్తాం. మార్కెట్లో ఎన్ని కొత్త ఓఎస్‌లు వచ్చినా విండోస్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ ప్రత్యేకం. అందుకే, మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ అభివృద్ధి చేసిన విండోస్‌ ఓఎస్‌నే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఈ ఓఎస్‌ విడుదలై 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) విండోస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక గిఫ్‌ (GIF)ను సోషల్‌ మీడియాలో షేర్‌  చేశారు. ‘‘కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మీతో ఉండిపోతాయి. 28 ఏళ్లుగా మిమ్మల్ని ఎంతోమంది అనుసరిస్తున్నారు. హ్యాపీ బర్త్‌డే విండోస్‌’’ అని బిల్ గేట్స్‌ ట్వీట్‌ చేశారు.1995లో తీసిన ఓ వీడియోకు సంబంధించిన ఈ గిఫ్‌లో.. విండోస్‌ విడుదల సందర్భంగా బిల్‌ గేట్స్‌తోపాటు అప్పటి మైక్రోసాఫ్ట్‌ సీఈవో స్టీవ్‌ బాల్‌మర్‌ వేదికపై ఆనందంతో డ్యాన్స్‌ చేస్తూ కన్పించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ తొలిసారిగా 1995, ఆగస్టు 24న విండోస్‌ 95ను 32-బిట్‌ సిస్టమ్‌తో విడుదల చేసింది. తర్వాతి కాలంలో వేర్వేరు వెర్షన్లలతో విండోస్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ, స్టార్ట్‌ బటన్‌, రీసైకిల్ బిన్‌ వంటి కొన్ని ఫీచర్లలో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. విండోస్‌ 95కు ముందు విండోస్‌ 1.0, విండోస్‌ 2.0, విండోస్‌ 3.0 వంటివి మైక్రోసాఫ్ట్ డిస్క్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ (MS DOS)లుగా మాత్రమే ఉండేవి. వాటిని గ్రాఫికల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లుగా పరిగణించేవారు. దీంతో పర్సనల్‌ కంప్యూటర్స్‌ కోసం 1995లో గ్రాఫికల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేజ్‌ ఓఎస్‌గా విండోస్‌ 95ను పరిచయం చేశారు.

చింగారీ యాప్ సీన్ సితార్ అయ్యింది

ఫైనాన్షియల్ క్రంచింగ్తో బెంగళూరుకు చెందిన షార్ట్ వీడియో ఫ్లాట్ ఫారమ్ చింగారీ రెండోసారి ‘లేఆఫ్’ ప్రకటించింది. ప్రాడక్ట్, కస్టమర్ సపోర్ట్, డిజైన్, మార్కెటింగ్లో 50 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. మరికొంత మంది ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే  చింగారి కంపెనీ 20 శాతం ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం చింగారీ కంపెనీలో  50- నుంచి 60 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునుందుకు తొలగింపులతో పాటు ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆప్టోస్ ల్యాబ్ నుంచి చింగారి సంస్థ నిధులను సేకరించింది. ఈ నిధులను వినియోగదారుల పెరుగుదల, ఉత్పత్తి పెంపు,  విస్తరణ, ఇంజనీరింగ్ బృందాన్ని పెంచేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపింది.  

చాట్‌జీపీటీకి దీటుగా కోడ్ లామా లాంఛ్

ఏఐ రేస్‌లో చాట్‌జీపీటీకి (Code Llama VS ChatGPT) దీటైన పోటీ ఇచ్చేందుకు మెటా స‌రికొత్త ఏఐ టూల్ కోడ్ లామాతో ముందుకొచ్చింది. కోడ‌ర్లు, ఐటీ ఇంజ‌నీర్ల‌కు కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌లో తోడ్పాటు ఇచ్చేలా ఏఐ టూల్ కోడ్ లామాను మెటా డెవ‌ల‌ప్ చేసింది. ఓపెన్ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ టూల్ ప్ర‌స్తుతం ప్రాజెక్టులు, కోడ్స్ రాయ‌డంలో ప్ర‌జ‌ల‌కు సాయ‌ప‌డుతుండ‌గా ఈ టూల్‌కు కోడ్ లామా ప్ర‌ధాన పోటీదారుగా ముందుకొచ్చిందని టెక్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.కోడ్ లామా ద్వారా యూజ‌ర్లు త‌మ వ‌ర్క్‌ను వేగంగా, మ‌రింత స‌మ‌ర్ధంగా పూర్తిచేయ‌వ‌చ్చ‌ని మెటా పేర్కొంది. కోడ్ నేర్చుకునే వారికి ఎదుర‌య్యే అడ్డంకుల‌ను ఇది నిరోధిస్తుంద‌ని మెటా తెలిపింది. ప్రోగ్రామ‌ర్లు మ‌రింత వేగంగా, స‌మ‌ర్ధ‌వంతమైన సాఫ్ట్‌వేర్‌ను రాసేందుకు కోడ్ లామా ప్రోడ‌క్టివిటీ, ఎడ్యుకేష‌నల్ టూల్‌గా సాయప‌డుతుంద‌ని కంపెనీ వెల్ల‌డించింది. న్యూ సాఫ్ట్‌వేర్‌ను రాయ‌డం నుంచి ప్ర‌స్తుత కోడ్ డీబ‌గ్గింగ్ వ‌ర‌కూ ప్రోగ్రామ‌ర్లు ఇప్ప‌టికే ఎల్ఎల్ఎంల‌ను వాడుతున్నార‌ని మెటా బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది.డెవ‌ల‌ప‌ర్ల ప‌నిని మ‌రింత స‌మ‌ర్ధంగా ఉండేలా ఈ టూల్ ఉప‌క‌రిస్తే వారు త‌మ ప‌నుల్లో మాన‌వ మేథ‌ను వాడే అంశాల‌పై మ‌రింత దృష్టిసారించే వెసులుబాటు ఉంటుంద‌నేదే త‌మ ధ్యేయ‌మ‌ని మెటా వెల్ల‌డించింది. బెంచ్‌మార్క్ టెస్టింగ్‌లో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న ల్యాంగ్వేజ్ మోడ‌ల్స్ కంటే కోడ్ లామా మెరుగైన సామ‌ర్ధ్యం క‌న‌బ‌రుస్తుంద‌ని కంపెనీ తెలిపింది. కోడ్ బెంచ్‌మార్క్ హ్యుమ‌న్ఇవ‌ల్‌పై కోడ్ లామా 53.7 స్కోర్ సాధించింద‌ని మెటా పేర్కొంది.

హోండా సీబీ 350 వాహనాదారులకు శుభవార్త

భారతదేశంలో హోండా బైక్స్‌ ఉన్న క్రేజ్‌ వేరు. హోండా కంపెనీ బడ్జెట్‌ బైక్స్‌తో పాటు ఉన్నత శ్రేణుల వారిని ఆకట్టుకునేందుకు ప్రీమియం బైక్స్‌ను రిలీజ్‌ చేస్తూ ఉంటుంది. ఈ ప్రీమియం బైక్స్‌లో హోండా సీబీ 350, హోండా సీబీ 350 ఆర్‌ఎస్‌ బైక్స్‌ ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే ఈ బైక్స్‌ ధర విషయాలను పక్కన పెడితే ఏదైనా సమస్య వస్తే బాగు చేయించుకునే ఖర్చు ఎక్కువగా ఉంటుందని సగటు వినియోగదారుడి భావన. ఇలాంటి సమస్యకు చెక్‌ పెడుతూ హోండా కంపెనీ ఈ రెండు బైక్స్‌పై ఎక్స్‌టెండెడ్‌ వారెంటీని ప్రకటించింది. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌) హోండా హెచ్‌నెస్‌ సీబీ 350, హోండా సీబీ 350 ఆర్‌ఎస్‌ కస్టమర్‌ల కోసం పొడిగించిన వారంటీతో పాటు పొడిగించిన వారంటీ ప్లస్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్‌ కింద మొదటి 10,000 కొత్త హెచ్‌నెస్‌ సీబీ 350, సీబీ 350 ఆర్‌ఎస్‌ కస్టమర్‌లు అస్సలు ఖర్చే లేకుండా పొడిగించిన వారెంటీ ప్రోగ్రామ్‌లో నమోదు పొందుతారు. ఈ ఆఫర్‌ ఆగస్ట్ 8, 2023 నుంచి ప్రారంభమైంది. మొదటి 10 వేల కస్టమర్లు ఇప్పుడు ఈ తాజా ఆఫర్‌ను పొందుతున్నారు. ఈ ఆఫర్‌ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.ముఖ్యంగా వాహనం కొనుగోలు చేసిన తేదీ నుంచి 91 రోజుల నుండి 9వ సంవత్సరం వరకు సౌకర్యవంతమైన విండోలో కస్టమర్‌లు పొడిగించిన వారంటీని పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్ కస్టమర్‌లకు సమగ్ర 10 సంవత్సరాల వారెంటీ కవరేజీని అలాగే యాజమాన్యంలో మార్పు జరిగినప్పుడు కూడా బదిలీ చేయదగిన పునరుద్ధరణ ఎంపికలను మంజూరు చేస్తుంది. పొడిగించిన వారెంటీ ప్లస్ ప్రోగ్రామ్ క్లిష్టమైన అధిక-విలువ ఇంజిన్ భాగాలు, అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్ భాగాలను భద్రపరిచే సమగ్ర కవరేజీని అందిస్తుంది. మూడు ఎంపికలు ఉన్నాయి. ఏడో  సంవత్సరం వరకూ వాహనాలకు మూడేళ్ల పాలసీ, వారి ఎనిమిదో సంవత్సరంలో వాహనాలకు రెండేళ్ల పాలసీ, వారి తొమ్మిదో సంవత్సరంలో ఉన్నవారికి ఒక సంవత్సరం పాలసీ అందుబాటులో ఉంటుంది. ఈ ఎంపికలు వారి అన్ని హెచ్‌నెస్‌తో పాటు సీబీ 350 ఆర్‌ఎస్‌ మోటార్‌సైకిళ్లకు 1,30,000 కిలోమీటర్ల వరకు కవరేజీని అందిస్తాయి.లక్ష మంది కస్టమర్ల మైలురాయిని పురస్కరించుకుని ఈ ప్రోగ్రామ్ కొత్త సంతృప్తి ప్రమాణాలను నెలకొల్పుతుందని హోండా ప్రతినిధులు పేర్కొంటున్నారు. అలాగే వారెంటీ ప్రోగ్రామ్‌ల ప్రారంభ ధర రూ. 5,321 అయితే వాహనం కొనుగోలు చేసిన సంవత్సరం ఆధారంగా ధరల నిర్మాణం మారుతూ ఉంటుంది. హోండా హెచ్‌నెస్‌ సీబీ350 ధర రూ. 2,09,857 నుంచి రూ. 2,14,856 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ), హోండా సీబీ 350 ఆర్‌ఎస్‌ ధర రూ. 2,14,856 నుంచి రూ. 2,17,857 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)లో ఉంటుంది. 

టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదల

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్‌…ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్లోకి అడుగుపెట్టింది. టీవీఎస్‌ ఎక్స్‌ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్‌ ప్రారంభ ధరను రూ.2.50 లక్షలుగా నిర్ణయించింది. 4.44 కిలోవాట్ల సామర్థ్యంతో తయారు చేసిన ఈ స్కూటర్‌ కేవలం 2.6 సెకండ్లలో సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నట్లు కంపెనీ సీఈవో కేఎన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు.గంటకు 105 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్‌ త్వరలో భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్‌ కొనుగోలుదారుడు 50 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్‌ లేదా నాలుగున్నర గంటల్లో 80 శాతం చార్జింగ్‌ రకాలను ఎంచుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ స్కూటర్‌ కోసం ముందస్తు బుకింగ్‌లు ఆరంభించినట్లు, కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లకు నవంబర్‌ తొలి వారం నుంచి అందచేయనున్నట్లు పేర్కొంది. ఈ నూతన మాడల్‌ను ఉత్పత్తి చేయడానికి రూ.250 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. ఈ స్కూటర్‌లో 10.2 అంగుళాల హెచ్‌డీ+టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్‌, నావిగేషన్‌, సంగీతం, వీడియో ఆఫరింగ్‌, గేమ్స్‌ కూడా ఆడుకోవచ్చును.

రిక్రూటర్లను ఆకట్టుకుంటున్న వీఐటీ ఏపీ

టాలెంటెడ్​ స్టూడెంట్స్​ ఎక్కువగా ఉండటంతో క్యాంపస్​ ప్లేస్​మెంట్స్​లో వీఐటీ–ఏపీ యూనివర్శిటీ ముందంజలో ఉందని ఛాన్స్​లర్​ డా. జీ విశ్వనాథన్​ చెప్పారు. ఇక్కడున్న కెరీర్​ డెవలప్​మెంట్​ సెంటర్​ (సీడీసీ) చురుగ్గా పనిచేస్తోందని పేర్కొన్నారు. దేశంలోని పెద్ద కంపెనీలను సైతం క్యాంపస్​ రిక్రూట్​మెంట్​కు వచ్చేలా కృషి చేస్తోందని చెప్పారు. క్యాంపస్​ ప్లేస్​మెంట్స్​ సజావుగా జరిగేలా సీడీసీ చొరవ తీసుకుంటోందని ప్లేస్​మెంట్​ సెలబ్రేషన్స్​లో  అన్నారు.రూరల్ స్టూడెంట్స్​ కోసం సపోర్టెడ్​ అడ్వాన్స్​మెంట్​ ఆఫ్​ రూరల్​ స్టూడెంట్స్​(స్టార్స్​) పేరుతో ఒక ప్రోగ్రామ్​ను వీఐటీ అమలు చేస్తున్నట్లు విశ్వనాథన్​ వెల్లడించారు. 2023 గ్రాడ్యుయేటింగ్​ బ్యాచ్​ క్యాంపస్​ రిక్రూట్​మెంట్ అద్భుతంగా సాగిందని, 1,021 మంది స్టూడెంట్లు ఉద్యోగాలు సంపాదించుకున్నారని వైస్​ చాన్సలర్​ డా. ఎస్​ వీ కోటా రెడ్డి చెప్పారు. తమ స్టూడెంట్లకు మొత్తం 1,560 జాబ్​ ఆఫర్లు వచ్చినట్లు పేర్కొన్నారు. వీఐటీ–ఏపీ క్యాంపస్​లోని ఒక స్టూడెంట్​కు ఒక ఎంఎన్​సీ నుంచి రూ. 34.4 లక్షల జీతంతో ఆఫర్​ రావడం విశేషమని వెల్లడించారు. 2023 బ్యాచ్​ యావరేజ్​ శాలరీ కూడా బాగా పెరిగి రూ. 7.20 లక్షలకు చేరిందన్నారు. ఈ ఏడాది మొత్తం 900 మంది రిక్రూటర్​లు క్యాంపస్​కు వచ్చినట్లు చెప్పారు. 

తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?

బంగారం, వెండి ధరలు అసలు తగ్గనంటున్నాయి. గత మూడు రోజులుగా పరుగులు పెడుతూ వస్తోన్న పసిడి ధరలు శుక్రవారం (ఆగస్టు 25) కూడా భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఆకాశానంటుతున్నాయి. బులియన్‌ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.59,450 పలుకుతోంది. పది గ్రాముల బంగారంపై రూ.200 నుంచి రూ. 220 మేర పెరిగింది. ఇక వెండి ధరలు కూడా బంగారాన్ని అనుసరిస్తున్నాయి. శుక్రవారం కిలో వెండి ధర ఏకంగా రూ.1600 మేర పెరగడం గమనార్హం. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76, 900 పలుకుతోంది. మరి శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం రండి.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లు రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 పలుకుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 ట్రేడ్‌ అవుతోంది.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,600గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 గా ఉంది. చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,830, 24 క్యారెట్ల ధర రూ.59,820 పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450గా ఉంది.

*  పన్ను చెల్లింపుదారులకు శుభవార్త

2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ జూలై 31 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గడువుకు ముందే చాలా మంది తమ ఐటీ రిటర్న్స్ ను ఫైల్ చేశారు. ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన చాలా మందికి వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయ్యింది. అయితే కొద్ది మందికి మాత్రం ఇంకా డబ్బు జమ కాలేదు. అయితే వారందరూ తమ ఖాతాలో మనీ ఎందుకు క్రెడిట్ కాలేదని ఆలోచిస్తున్నారు. దానికి కారణాన్ని ఆదాయపు పన్ను శాఖ ట్విటర్ ద్వారా తెలిపింది.ఆదాయపు పన్ను వెబ్‌సైట్ ప్రకారం, ఆగస్టు 23 వరకు 6.91 కోట్ల మందికి పైగా ప్రజలు ఐటీ రిటర్న్‌లు దాఖలు చేశారు. అయితే 6.59 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ల ధృవీకరణ చేపట్టారు. అయితే మిగిలిన 31 లక్షల మంది రిటర్న్‌లు ఇ-వెరిఫై చేయలేదు. దీంతో వారి రిటర్న్స్ ను ఆదాయపు పన్ను శాఖ ధృవీకరించలేకపోయింది. అందుకే వారి ఖాతాలో డబ్బులు జమకాలేదు. ఐటీ శాఖ నిబంధనల ప్రకారం, పన్ను చెల్లింపుదారులందరూ తమ ఐటీఆర్ ను ఫైల్ చేసిన తరువాత 30 రోజుల్లో దానిని ధృవీకరించడం తప్పనిసరి. ఒకవేళ ట్యాక్స్ పేయర్ ఇ-ఫైలింగ్ చేసిన తరువాత దానిని ధృవీకరించకపోతే, ఐటీఆర్ ప్రాసెస్ జరగదు. దీనికి సంబంధించే ఆదాయపు పన్ను శాఖ ప్రకటన చేసింది. ‘పన్ను చెల్లింపుదారులకు ధృవీకరణ కోసం 30 రోజుల సమయం ఉంది, ఇది త్వరలో ముగుస్తుంది. వీలైనంత త్వరగా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఈ లోపు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేయకపోతే మళ్లీ రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది’ అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఇక ఆలస్యరుసుము విషయానికి వస్తే వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులు రూ. 1000 ఆలస్యరుసుముగా చెల్లించాలి.ఇక వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5000 చెల్లించాల్సి ఉంటుంది. ఇ-వెరిఫికేషన్ ను మీ బ్యాంక్ ఖాతా నుంచి, ఆధార్ ఓటీపీ ద్వారా, మీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా కూడా చేసుకోవచ్చు.