తమిళనాడు (Tamil Nadu)లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మదురై రైల్వే స్టేషన్ (Madurai railway station)లో ఆగి ఉన్న రైలు బోగీ (ప్రైవేటు పార్టీ కోచ్)లో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం తెల్లవారుజామున 5.15 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. రైల్లోకి అక్రమంగా తీసుకొచ్చిన సిలిండర్ (gas cylinder)పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు దక్షిణ రైల్వే (Southern Railway) అధికారులు వెల్లడించారు.
ఈ ప్రైవేటు పార్టీ కోచ్ (private party coach) ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ (Lucknow) నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. శుక్రవారం నాగర్‌కోయిల్ జంక్షన్ వద్ద దీన్ని పునలూరు-మదురై ఎక్స్‌ప్రెస్ రైలుకు అటాచ్ చేశారు. నిన్న రాత్రి మదురై రైల్వే స్టేషన్ వద్ద దీన్ని డిటాచ్ చేసి స్టాబ్లింగ్ లైన్‌లో నిలిపి ఉంచారు.
అయితే, ఈ ప్రైవేట్ పార్టీ కోచ్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు రైల్లోకి రహస్యంగా గ్యాస్ సిలిండర్‌ను తీసుకొచ్చారు. శనివారం తెల్లవారుజామున దానిపై టీ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు చేలరేగాయి. చూస్తుండగానే బోగీ అంతా వ్యాపించాయి. మంటలను గుర్తించిన కొంతమంది ప్రయాణికులు వెంటనే బోగీ నుంచి కిందకు దిగారు.
సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బోగీలో 65 మంది ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
రూ.10లక్షల పరిహారం..
ఘటనపై రైల్వే శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ ప్రైవేటు పార్టీ కోచ్‌ను ఐఆర్‌సీటీసీ పోర్టల్ నుంచి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు.