పెన్షనర్స్ ప్యారడైజ్‌గా, ప్లాన్డ్ సిటీగా, రెండో మద్రాస్‌గా ప్రాచుర్యం పొందిన కాకినాడ మరోసారి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును కై వసం చేసుకుంది. మూడేళ్ల క్రితం దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగ రాల్లో (బెస్ట్ లివింగ్ సిటీ) నాలుగో స్థానం సాధించిన కాకినాడ ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డులు–2022 పోటీలో దేశంలోనే కాకినాడ నగరం రెండో స్థానంలో నిలిచింది.
తద్వారా ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా ప్రత్యే క గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో దేశంలోని 100 స్మార్ట్‌సిటీలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఇండోర్ మొదటి స్థానం సాధించగా.. మిగిలిన నగరాలన్నింటినీ అధిగమించి కాకినాడ రెండో స్థానాన్ని కై వసం చేసుకుంది. వచ్చే నెల 27వ తేదీన ఇండోర్‌లో జరిగే కార్యక్రమంలో కాకినాడ నగరానికి ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు.
అవార్డు ఎందుకు దక్కిందంటే..
* పారిశుధ్య విభాగంలో చేపట్టిన పాలనా సంస్కరణలు ఈ గుర్తింపునకు ప్రధాన కారణంగా నిలిచాయి.
* ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం, తడి – పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం, ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో చేసిన కృషికి కూడా ఈ గుర్తింపు దక్కడానికి కారణం.
* సాంకేతిక పరంగా కూడా పారిశుధ్య విభాగంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. పారిశుధ్య వాహనాల కదలికలను గుర్తించేందుకు జీపీఎస్ విధానం అమలు చేశారు.
* చెత్త సేకరణకు 108 హూపర్, టిప్పర్ వాహనాలు సమకూర్చారు.
* స్మార్ట్ సిటీని 380 మైక్రో ప్యాకెట్లుగా విభజించారు. ప్రతి మైక్రో ప్యాకెట్‌కు ఇద్దరు పారిశుధ్య కార్మికులను కేటాయించి ప్రణాళికాబద్ధంగా చెత్త సేకరిస్తున్నారు.
* ఇక సేకరించిన చెత్త నుంచి సంపద సృష్టించే లక్ష్యంతో రూ.కోటితో ఇంటిగ్రేటెడ్ సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వేస్ట్ వంటి పొడి చెత్తను 16 రకాలుగా విభజించి ప్రాసెస్ చేయడం, తడి చెత్త నుంచి ఎరువుల తయారీ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
* ఈ చర్యలన్నీ జిల్లా కేంద్రమైన కాకినాడ స్మార్ట్ సిటీలో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు దోహదం చేశాయి.
* పారిశుధ్య నిర్వహణలో ఇటువంటి సంస్కరణలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
* వీటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు స్మార్ట్ సిటీ కమిషనర్, మున్సిపల్ ఆరోగ్య అధికారి (ఎంహెచ్ఓ), పారిశుధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేశారు. ఇవన్నీ కూడా కాకినాడ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు దోహదపడ్డాయి.
ఇది కాకినాడకు దక్కిన గౌరవం
ఇండియన్ స్మార్ట్‌సిటీ అవార్డ్స్–2022లో దేశంలోనే కాకినాడ నగరం రెండో స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. గతంలో కూడా బెస్ట్ లివింగ్ సిటీల్లో కాకినాడ 4వ స్థానం సాధించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఇక్కడి అధికారులు చేపట్టిన పాలనా సంస్కరణలు కాకినాడ నగరానికి అరుదైన గౌరవాన్ని, గుర్తింపును తెచ్చి పెట్టాయి. కమిషనర్ నాగనరసింహారావు, ఇతర అధికారులు, పారిశుధ్య కార్మికులు, స్మార్ట్ సిటీ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.
శ్రమకు తగిన గుర్తింపు
పారిశుధ్య విభాగంలో చేపట్టిన పాలనా సంస్కరణలకు సముచిత గుర్తింపు లభించింది. ఇక్కడి పారిశుధ్య సిబ్బంది, అధికారులతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారం వల్లే మంచి ఫలితాన్ని సాధించగలిగాం. జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా పొందగలిగాం. కాకినాడ స్మార్ట్ సిటీ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలవడానికి కారకులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. ఇదే స్ఫూర్తితో మరింత బాగా పని చేసి, ప్రజలకు మరిన్ని మంచి సేవలు అందించాలి.