ScienceAndTech

విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన చంద్రయాన్ 3

విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన చంద్రయాన్ 3

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును.. మన చంద్రయాన్-3 బ్రేక్ చేసింది. అదేంటి..? అసలు ఇదెలా సాధ్యం అని అనుమానం మీకు రావచ్చు. వెయిట్.. ఈ స్టోరీ చదవండి మీకే అర్ధమవుతుంది. కోహ్లీ రికార్డు బద్దలైంది గ్రౌండ్‌లో కాదు.. ట్విట్టర్‌లో.. ఇది బ్రేక్ అయింది. సరిగ్గా 10 నెలల క్రితం అంటే.. 2022 టీ20 ప్రపంచకప్ సమయంలో పాకిస్తాన్‌పై విజయం సాధించిన అనంతరం కోహ్లీ ఒక ట్వీట్ చేశాడు. ఇక ఇప్పుడు ఆ ట్వీట్‌కు సంబంధించిన రికార్డు చంద్రయాన్-3 బద్దలు కొట్టింది. అలాగే చంద్రయాన్ 3కి సంబంధించిన ట్వీట్‌ను ఏకంగా 55.3 మిలియన్ వ్యూయర్స్ చూడటం విశేషం.చంద్రుడి ఉపరితలంపై ‘చంద్రయాన్ 3’ సురక్షితంగా ల్యాండ్ అయ్యాక.. ‘నేను నా లక్ష్యాన్ని చేరుకున్నా’ అంటూ చంద్రయాన్ 3 ఇచ్చిన సందేశాన్ని ‘ఇస్రో’ సరిగ్గా 3 రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. ఇక ఇప్పుడు ఆ ట్వీట్ భారత్‌లో అత్యధిక లైకులు(840.1k) పొందిన ట్వీట్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పటివరకు టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై విజయం తర్వాత విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ అత్యధిక లైకులు(796.2k) పొందిన ట్వీట్‌గా ఉండగా.. ఆ రికార్డును ఇస్రో ట్వీట్ ఇటీవల బ్రేక్ చేసింది. తద్వారా కింగ్ కోహ్లీ రికార్డును చంద్రయాన్ 3 సునాయాసంగా బ్రేక్ చేసిందనమాట. ప్రస్తుతం ఈ రికార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

2022 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై మ్యాచ్ గెలిచిన అనంతరం కోహ్లీ చేసిన ఈ ట్వీట్ కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. 50 మిలియన్ల కంటే ఎక్కువ మంది దీన్ని వీక్షించడమే కాకుండా.. అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్‌గా రికార్డు సృష్టించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ చివరి వరకు క్రీజులో నిలబడి.. అజేయంగా 82 పరుగులు చేసి.. భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. గేమ్ గెలిచిన తర్వాత, తన అభిమానుల కోసం ఒక ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేసి, “ప్రత్యేక విజయం. హోరెత్తిన మీ అభిమానానికి ధన్యవాదాలు. ” అంటూ చేసిన కోహ్లీ ట్వీట్‌కు 796K లైక్‌లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇస్రో పోస్ట్‌కి 800K లైక్‌లు దాటడంతో.. రికార్డు చంద్రయాన్-3 వశం అయింది.