పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని ఉండకూదని చెప్పి కేంద్ర సర్కారు, ప్లాస్టిక్ స్ట్రాల తయారీ, వినియోగాన్ని నిషేధించింది. దీంతో కంపెనీలు ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో పేపర్ స్ట్రాలను ప్రవేశపెట్టాయి. ‘ఏ రాయి అయితేనేమి పండ్లూడ గొట్టుకోవటానికి’ అన్నట్టుగా పేపర్ స్ట్రాతోనూ ఆరోగ్యానికి హాని వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేపర్ స్ట్రాలలో ఉండే విషపూరిత రసాయనాలు ప్రజలకు, వన్యప్రాణులకు, పర్యావరణానికి హాని కలిగిస్తాయని బెల్జియం పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా పేపర్, వెదురుతో చేసిన స్ట్రాలను పరీక్షించి చూశారు. వీటిల్లో పాలీ అండ్ పెర్ ఫ్లూరో ఆల్కిల్ పదార్థాలు (పీఎఫ్ఏఎస్) ఉన్నట్టు గుర్తించారు. దీర్ఘకాలంలో పీఎఫ్ఏఎస్ అనేవి మానవుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వీరు చెబుతున్నారు. కాకపోతే ప్లాస్టిక్ స్ట్రాల మాదిరి పేపర్ స్ట్రాల వల్ల పర్యావరణానికి హాని ఉండదన్నది నిజం. వీరు 20 బ్రాండ్ల పేపర్ స్ట్రాలపై పరీక్షలు చేయగా, 18 వాటిల్లో పీఎఫ్ఏఎస్ ఉన్నట్టు తెలిసింది. 2020 కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పీఎఫ్ఏఎస్ వినియోగంపై నిషేధం విధించడం గమనార్హం. స్టీల్ స్ట్రాలలో ఇలాంటి హానికారకాలు లేవని వీరి అధ్యయనంలో వెల్లడైంది.
పీఎఫ్ఏఎస్ అనేవి మన శరీరంలో ఏళ్ల పాటు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల టీకాలకు పెద్దగా స్పందించకపోవడం, తక్కువ బరువుతో శిశువులు జన్మించడం, థైరాయిడ్, కొలెస్ట్రాల్, కాలేయం దెబ్బతినడం, కిడ్నీకేన్సర్, టెస్టిక్యులర్ కేన్సర్ ముప్పు ఉంటుందని వీరు చెబుతున్నారు.