* ముంబై గెలాక్సీ హోటల్లో అగ్ని ప్రమాదం
మహారాష్ట్ర రాజధాని నగరం ముంబయి(Mumbai)లోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. హోటల్ గెలాక్సీలో మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. శాంతాక్రూజ్ ప్రాంతంలోని ప్రభాత్‌నగర్ కాలనీలో ఉన్న ఈ హోటల్ రెండో అంతస్తులో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
* రంగారెడ్డి జిల్లాలో దారుణం
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మైలార్దేవుపల్లిలో 17 ఏండ్ల బాలుడిని దుండగులు గొంతుకోసి కిరాతకంగా చంపేశారు. ఈ అమానుష ఘటన మైలార్‌దేవుపల్లిలోని లక్ష్మీగూడ హౌసింగ్‌బోర్డ్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆదివారం జరిగింది.మృతుడు బిహార్‌కు చెందిన రాజా పాశ్వాన్‌గా గుర్తించారు. రెండు రోజుల క్రితం బిహార్‌కు చెందిన వారితో పాశ్వాన్‌కు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే గొడవపడిన వారే చంపి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు బీభత్సం
ఆదివారం కావడంతో విశాఖ ఆర్కే బీచ్ కు భారీ ఎత్తున సందర్శకులు చేరుకున్నారు. బీచ్ కు రద్దీ పెరిగింది. పర్యాటకులతో ఆర్కే బీచ్ కలకళలాడుతోంది. ఈ సమయంలో గోకుల్ పార్క్ వద్ద భారీ శబ్దం. వచ్చి చూసేసరికి.. ఆర్టీసీ బస్సు ముందు అద్దాలు పగిలి ఉన్నాయి. బస్సు కింద ఓ బైకు నలిగిపోయింది. ఫుట్ పాత్ పై ఉన్న సోలార్ పోల్స్ ధ్వంసం అయ్యాయి. అయ్యో భారీ ప్రమాదమే జరిగి ఉంటుందని అక్కడ దృశ్యాలు చేసి అంతా గుండెలు పట్టుకున్నారు. అదృష్టవశాత్తు భారీ ప్రమాదం ముప్పు తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అదే ప్రమాదం ఆర్కే బీచ్ వద్ద జరిగి ఉంటే.. తీవ్రత చెప్పలేనంతగా ఉండేది.విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. 28 సర్వీస్ నెంబర్ గల ఆర్టీసీ బస్సు.. ఆర్కే బీచ్ నుంచి సింహాచలం వెళ్లాల్సి ఉంది. ఆర్కే బీచ్ నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు.. ఒక్కసారిగా అదుపుతప్పింది. కొద్ది దూరం వెళ్ళాక ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. భారీ శబ్దంతో సోలార్ పోల్స్, పార్కింగ్ బైక్ ల పైకి దూసుకెళ్లింది. దాదాపు 50 మీటర్ల వరకు బీభత్సం సృష్టించింది. దింతో స్కూటీ, బైక్ బస్సు కింద నలిగిపోయాయి. ఆ టూ వీలర్లతోపాటు సోలార్ పోల్స్, బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. బస్సులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.తప్పిన పెను ప్రమాదం.
* డ్రగ్స్ పట్టివేతలో ఎస్సై రాజేందర్ చేతివాటం
డ్రగ్స్ పట్టివేతలో ఓ ఎస్సై చేతివాటం ప్రదర్శించాడు. నార్కోటిక్ విభాగం అధికారులు వలపన్ని పట్టుకోవడంతో అతడి అవినీతి బయటపడింది. దీంతో ఎస్సైను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో (సీసీఎస్) రాజేందర్ ఎస్సైగా పనిచేస్తున్నారు. నిందితుల వద్ద పట్టుబడిన డ్రగ్స్‌లో సుమారు 1,750 గ్రాముల వరకు దాచిపెట్టి అమ్మేందుకు ఎస్సై యత్నించారు.దీనిపై నగరంలోని నార్కోటిక్ విభాగం అధికారులకు పక్కా సమాచారం అందండంతో వారు వలపన్ని రాజేందర్‌ను అతడి ఇంట్లోనే పట్టుకున్నారు. ఆ తర్వాత నార్కోటిక్ విభాగం అధికారులు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) డైరెక్టర్, సీపీ సీవీ ఆనంద్‌కు నివేదిక ఇచ్చారు. అనంతరం నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించడంతో వారు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన రాయదుర్గం ఎస్సైగా పనిచేసినప్పుడు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అప్పట్లో అతడిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆ ఉత్వర్వులపై కోర్టు నుంచి రాజేందర్ స్టే తెచ్చుకున్నారు. ఈ తర్వాత సైబరాబాద్ సీసీఎస్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్నారు.
* బీజేపీ ఎంపీ ఇంట్లో బాలుడి మృతదేహం
భాజపా ఎంపీ ఇంట్లో పదేళ్ల బాలుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన అస్సాం (Assam)లోని సిల్చార్ (Silchar)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిల్చార్ లోక్‌సభ భాజపా ఎంపీ రాజ్‌దీప్ రాయ్ (Rajdeep Roy) ఇంట్లో ధోలాయ్ ప్రాంతానికి చెందిన మహిళ రెండున్నరేళ్లుగా పనిచేస్తోంది. అదే ఇంట్లోని మొదటి అంతస్తులోని ఓ గదిలో మహిళ పదేళ్ల కుమారుడు, కుమార్తె కూడా ఉంటున్నారు. శనివారం సాయంత్రం కుంటుంబంతో కలిసి భోజనం చేసిన తర్వాత.. బాలుడు తల్లిని ఫోన్ అడిగి తీసుకున్నాడు. అనంతరం ఎంపీ ఇంట్లో పై అంతస్తులో పనిచేసేందుకు బాలుడి తల్లి, సోదరి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వారు తిరిగి తమ గదికి వచ్చి చూడగా.. బాలుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీని గురించి ఎంపీ ఇంట్లో ఉన్న పోలీసులకు సమాచారం అందించడంతో గది తలుపులు పగలగొట్టి బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై రాజ్‌దీప్ రాయ్ మాట్లాడుతూ.. ‘‘మా ఇంట్లో పనిచేసే మహిళ సిబ్బంది కుమారుడు వాళ్లు నివసించే గదిలో ఉరి వేసుకున్నట్లు పోలీసులను సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడి చేరుకున్నాను. బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన గది లోపల గడియపెట్టి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని పోలీసులను కోరాను’’ అని ఎంపీ తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* ఛార్జింగ్ వైర్ తో భార్యను చంపిన శాడిస్ట్ భర్త
కంటికి రెప్పలా కాపాడతానని వేదమంత్రాల సాక్షిగా పెళ్ళాడినవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. చెడు వ్యసనాలకు భానిసైన మొగుడు కుటుంబపోషణ మరవడంతో ఆ భారం ఆ ఇల్లాలిపై పడింది. అయితే ఇలా పనిచేసుకుంటున్న భార్యపై అనుమానం పెంచుకున్న తాగుబోతు భర్త దారుణానికి ఒడిగట్టాడు. సెల్ ఫోన్ చార్జింగ్ వైర్ తో భార్యను అతి దారుణంగా హతమార్చాడు. ఈ అమానుష ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో కుమ్మమూరు గ్రామానికి చెందిన వీర్ల రామకృష్ఱ అదే గ్రామానికి చెందిన రమ్యతేజ భార్యాభర్తలు. ఒకరంటే ఒకరు ఇష్టపడి ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నేళ్లు దంపతులు అన్యోన్యంగా వుండటంతో సంసారం సాఫీగా సాగింది. దీంతో వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం కలిగారు.అయితే కొంతకాలంగా రామకృష్ణ తాగుడుకు బానిసయ్యాడు.ఇలా పనీపాట లేకుండా ఎప్పుడూ మద్యంమత్తులో వుంటూ భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో పోషణ భారం ఆ ఇల్లాలిపై పడింది. దీంతో రమ్యతేజ డ్వాక్రా గ్రూప్ బుక్ కీపర్ గా పనిచేయసాగింది. అయితే ఆమె సంపాదించిన డబ్బులు సైతం బలవంతంగా లాక్కుని తాగేవాడు రామకృష్ణ. ఈ విషయంలో భార్యాభర్తలకు మద్య గొడవలు జరగడంతో పుట్టింటివారితో కలిసి భర్తపై పోలీసులకు ఫిర్యాదుచేసింది.
* క్లాస్ రూమ్‌లో దళిత విద్యార్థి ఆత్మహత్య
స్కూల్లోని తరగతి గదిలో దళిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నేపథ్యంలో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు (Teachers Suspended). రాజస్థాన్‌లోని బెహ్రోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కోట్పుత్లీలోని ప్రభుత్వ స్కూల్‌కు చెందిన 15 ఏండ్ల దళిత విద్యార్థి స్కూల్ హాస్టల్లో ఉండి చదుతున్నాడు. అయితే ఇద్దరు ఉపాధ్యాయులు కులంపేరుతో తనను దూషించి వేధిస్తున్నారని తండ్రికి చెప్పాడు. ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు. ఈ నేపథ్యంలో క్లాస్ రూమ్‌లోకి సీలింగ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కాగా, ఈ విషయం తెలియడంతో విద్యార్థి కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఇద్దరు టీచర్లతోపాటు ఆ స్కూల్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దళిత విద్యార్థిని వేధించి అతడి మరణానికి కారకులైన ఇద్దరు టీచర్లపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మరోవైపు ఆ ప్రభుత్వ స్కూల్ కూడా ఈ సంఘటనపై స్పందించింది. ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే బాధిత కుటుంబానికి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసన విరమించారు.
* కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడిన పండ్ల వ్యాపారి
పండ్లు అమ్మేవాడు ట్రావెల్ ఏజెంట్ చివరకు మోసగాడుగా మారాడు. భారతదేశంలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడు. రూ. 30,000 కోట్ల కుంభకోణం ఇది. పైగా ఇతడు కూడా కర్ణాటకకు చెందిన వ్యక్తి కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కర్ణాటక వెలుపల వ్యాపారం ప్రారంభించిన ఆయన జీవిత కథ నేడు తెరపైకి రాబోతోంది. దేశం చూడని అతిపెద్ద కుంభకోణానికి పాల్పడింది ఎవరు? అతను కర్ణాటకలోని ఏ పట్టణానికి చెందినవాడు..? కర్ణాటక సహా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో రూ. రూ.30,000 కోట్ల నకిలీ ప్రింటింగ్ పేపర్ స్కామ్ రువారీ కరీం లాలా తెలుగు బయోపిక్ తెరపైకి వచ్చింది. దర్శకుడు హన్సల్ మెహతా స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీని తెరపైకి తీసుకొచ్చారు. నకిలీ ప్రింటింగ్ పేపర్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీ ఎవరు? నేపథ్యం ఏమిటి? ఇక్కడ సమాచారం ఉంది.అబ్దుల్ కరీం లాల్ తెల్గీ కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని ఖానాపూర్‌లో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఖానాపూర్ రైల్వేస్టేషన్లో పోర్టర్‌గా పనిచేసేవాడు. అబ్దుల్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబాన్ని పోషించుకోవాల్సి వచ్చింది. తొలుత అబ్దుల్ రైల్వేస్టేషన్లో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ప్రాథమిక విద్యను పూర్తి చేసేందుకు సౌదీ అరేబియా వెళ్లాడు. కానీ వెంటనే తిరిగి వచ్చి బొంబాయికి మకాం మార్చారు.అబ్దుల్ బొంబాయి చేరుకున్నప్పుడు, అతను ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేకుండా రోజుల తరబడి తిరిగాడు. అయితే, అబ్దుల్ ట్రావెల్ ఏజెంట్‌ను కలుసుకుని అతనితో చేరాడు. తర్వాత ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాడు. గల్ఫ్ దేశాలలో పని కోసం వెతుకుతున్న కార్మికులకు నకిలీ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పత్రాలను విక్రయించడం ప్రారంభించాడు.
* విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ పరీక్షలో చీటింగ్
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇటీవలే జరిగాయి. ఇందులో కూడా చీటింగ్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు ఫైల్ చేసి నిందితులను అరెస్టు చేస్తున్నారు. తాజాగా హర్యానా నుంచి ముగ్గురు నిందితులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) తిరువనంతపురంలో ఉన్నది. ఇది ఇస్రోకు అనుబంధ సంస్థ. లాంచ్ వెహికిల్ డిజైన్, డెవలప్మెంట్ ఇక్కడే జరుగుతుంది.కేరళ పోలీసుల ప్రకారం అరెస్టు చేసిన ఈ వ్యక్తులు పరీక్షా కేంద్రంలో వేరే అభ్యర్థుల తరఫున కూర్చున్నారు. పరీక్షా కేంద్రంలో చీటింగ్‌కు పాల్పడ్డారు. ‘ఈ నెల 20వ తేదీన విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టడీస్ నిర్వహించిన పరీక్షలో వీరు చీటింగ్‌కు పాల్పడ్డారు. పరీక్ష రాయాల్సిన అభ్యర్థుల తరఫున వేరే వ్యక్తులు రాశారు. కొందరు ఈ కొశ్చన్ పేపర్‌ను కాపీ చేశారు. షర్ట్ కింద దాచిపెట్టిన కొన్ని డివైజ్లతో ఈ కొశ్చన్ పేపర్‌ను కాపీ చేశారు. కొన్ని అప్లికేషన్లతో వాటిని బయటికి పంపించారు. చెవిలోపల దాచి పెట్టిన హెడ్‌సెట్స్ ద్వారా ఆ ప్రశ్నలకు సమాధానాలు విన్నారు.’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులకు నిందితులు హర్యానాలోని జిండ్, హిసార్, ఇతర జిల్లాల నుంచి వచ్చి ఈ నేరానికి పాల్పడినట్టు తెలిసింది. ‘కొన్ని ఇన్‌పుట్‌లతో ఈ రోజు ముగ్గురిని అరెస్టు చేశాం’ అని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది.
* బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
బాణసంచా (Firecracker) ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుని ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal)లో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో అందులో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి భవనం పైకప్పు కూలింది. ఘటనాస్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే.. ఈ ఫ్యాక్టరీని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇళ్ల మధ్యలో నిర్వహిస్తున్నారని సమాచారం. పశ్చిమబెంగాల్ స్టేట్ యూనివర్సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఘటన నేపథ్యంలో పక్కనే ఇళ్లలో నివసిస్తున్నవారిని అధికారులు అప్రమత్తం చేసి.. అక్కడి నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.