తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్రమంత్రి అమిత్ షా భేటీ ముగిసింది. ఖమ్మం బహిరంగ సభ తర్వాత రాష్ట్ర కోర్ కమిటీ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన.. అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.ఇదిలా ఉంటే.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌ను గద్దె దింపాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని అమిత్ షా పేర్కొన్నారు. ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన ‘రైతు గోస-బీజేపీ భరోసా’ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ కుంటుంబాన్ని గద్దె దింపాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఎన్నికల వేళ తూతూ మంత్రంగా రుణమాఫీ ప్రకటించి రైతులకు అన్యాయం చేయడానికి పూనుకున్నారని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.