Politics

భాజపా సమీక్షల్లో బిజీగా నల్లారి

భాజపా సమీక్షల్లో బిజీగా నల్లారి

అన్నమయ్య జిల్లాలో బీజేపీ నేత కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పీలేరు, పుంగనూరు, రాయచోటికి చెందిన బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. ఈనెల 30 వరకు కలికిరిలో సమీక్షలు చేయనున్నారు కిరణ్‌కుమార్‌ రెడ్డి. దేశంలో ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్‌షా నాయకత్వంలో దేశం పురోభివృద్ధి సాగిస్తోందని.. అది నచ్చే బీజేపీలో చేరానని కిరణ్‌ కుమార్‌రెడ్డి పార్టీలో చేరిన సందర్భంలో స్పష్టం చేసిన విషయం తెలసిందే. 7 శాతం నుంచి 37 శాతానికి బీజేపీ ఎదిగిన విధానం.. 47 శాతం నుంచి 19 శాతానికి కాంగ్రెస్‌ పడిపోవడం సాధారణ అంశం కాదన్నారు కిరణ్‌ కుమార్‌రెడ్డి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి సీఎంగా, అంతకుముందు స్పీకర్‌గా పనిచేశారు కిరణ్‌. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. సొంతగా సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. దీంతో ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆపార్టీకి పూర్వ వైభవం తెస్తారని ఆశించినా.. ఎందుకో అంటీముట్టనట్లుగా ఉన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్‌.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌కి రెండోసారి రాజీనామా చేసి బీజేపీలో చేరి.. పొలిటికల్ స్పీడ్ పెంచారు.