లోకేశ్ యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్ర నూజివీడు నియోజకవర్గంలో అట్టర్‌ఫ్లాప్ అయిందని ఎమ్మెల్యే మేకా ప్రతాప్ చెప్పారు. కనీసం వెయ్యి మంది కూడా లోకేశ్ వెంట నడవలేదని ఎద్దేవా చేశారు. ఇక నియోజకవర్గంలో ఇసుకను దోచుకున్నది, నీరు–మట్టి పథకంలో మట్టిని దోచుకున్నదీ ఎవరో కూడా నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. భూకబ్జాలంటూ చెబుతున్నారని, ఎక్కడ భూకబ్జా చేస్తున్నానో చూపిస్తే అదే భూమిని చంద్రబాబుకు, లోకేశ్‌కు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు రాసిస్తానన్నారు.
లోఫర్ లోకేశ్ అని తానూ అనగలనని, అయితే అలా మాట్లాడే వ్యక్తిత్వం తనది కాదని, ఎందుకంటే తనకు సంస్కారం ఉందని స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నారా లోకేశ్‌పై మండిపడ్డారు. ఏలూరు జిల్లా ముసునూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో తన కుమారుడిని కేటుగాడని అనడంపై ఆదివారం ఎమ్మెల్యే విలేకర్ల సమావేశం నిర్వహించి లోకేశ్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. నూజివీడు వచ్చి రౌడీయిజం చేయాలని ప్రయత్నించినా, ప్రోత్సహించినా ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.