NRI-NRT

అమెరికాలో కుల వివక్ష వ్యతిరేక బిల్లు ఆమోదించిన కాలిఫోర్నియా

అమెరికాలో కుల వివక్ష వ్యతిరేక బిల్లు ఆమోదించిన కాలిఫోర్నియా

అమెరికా(USA)లోని కాలిఫోర్నియా(California) రాష్ట్ర అసెంబ్లీ కుల వివక్ష వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల వారిని వివక్షత నుంచి రక్షించేందుకు వీలుగా దీనిని తీసుకొచ్చింది. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ సోమవారం 50-3 మెజార్టీతో పాస్‌ చేసింది. ఇక దీనిపై గవర్నర్‌ గవీన్‌ న్యూసమ్‌ సంతకం చేస్తే చట్టంగా మారుతుంది. ఈ చట్టం పరిధిలోకి కులాలను తీసుకొచ్చి వివక్షత నుంచి వాటికి రక్షణ కల్పిస్తోంది.ఈ బిల్లును తొలిసారి అయిష వాహబ్‌ ప్రవేశపెట్టారు. దీనికి దేశవ్యాప్తంగా పలు కుల, జాతులకు చెందిన ఉద్యమ సంఘాలు మద్దతు తెలిపాయి. తాజాగా బిల్లు ఆమోదం పొందడంపై వాహబ్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ఎస్‌బీ 403 (బిల్లు)కు మద్దతుగా ఓటు వేసిన అసెంబ్లీ సభ్యులకు ధన్యవాదాలు. సుదీర్ఘ కాలంగా వివక్షకు గురైన ప్రజలను ఈ బిల్లుతో మేము కాపాడుతాము’’ అని ట్వీట్‌ చేశారు. కానీ, బిల్లుపై ‘హిందూస్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా’ (CoHNA) స్పందిస్తూ.. కాలిఫోర్నియా చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించింది.

ఈ బిల్లుతో కాలిఫోర్నియా పౌరహక్కుల చట్టాలు, ఎడ్యూకేషన్‌, హౌసింగ్‌ కోడ్‌ వంటి వాటిల్లో మార్పులు వస్తాయి. వారసత్వ కేటగిరి కింద కులాన్ని చేర్చి సంరక్షిస్తాయి. ఈ బిల్లుపై ఈక్వాలిటీ ల్యాబ్స్‌ డైరెక్టర్‌ తెన్మోలి సౌందర్యరాజన్‌ స్పందిస్తూ.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 700 సమావేశాలు నిర్వహించారు. వీటిల్లో కుల సమానత్వ రక్షణకు నినదించారు. కులాన్ని జీవితాంతం భరించి.. వాటి కారణంగా అణచివేతకు గురై జీవితాంతం పోరాడిన వ్యక్తిగా కష్టాలు నాకు తెలుసు’’ అని పేర్కొన్నారు.