Politics

త్వరలో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన: బీజేపీ

త్వరలోనే లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల

బీజేపీ రాష్ట్రాల ఎన్నికలతోపాటు లోక్ సభ ఎన్నికలపైనా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కేంద్రంలో అధికారమే బీజేపీ ప్రధాన లక్ష్యంగా ఉన్నట్టు అర్థం అవుతున్నది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలపడటానికి కంటే కూడా ఇక్కడి నుంచి ఎంపీ సీట్ల విజయం లేదా.. స్థానిక పార్టీల మద్దతు ఎక్కువ ఆశిస్తున్నది. ఈ అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో ఓ వార్త మరింత సంచలనంగా కనిపిస్తున్నది.లోక్ సభ ఎన్నికలకు ఆరు నెలలకు పైగా వ్యవధి ఉన్నప్పటికీ ఇప్పుడే తొలి జాబితా విడుదలకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ వార్త సారాంశం ప్రకారం, ఎన్నికలకు చాలా కాలం ముందే అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. తొలి విడతగా దేశంలోని 160 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నట్టు ఆ వార్త చెబుతున్నది. బీజేపీ బలహీనంగా ఉన్న చోట్లను ఎంచుకుని తొలిగా అభ్యర్థులను ప్రకటించాలని ఆలోచిస్తున్నది. ఇందులో తెలంగాణలోని 12 లోక్ సభ నియోజకవర్గ స్థానాలకు కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్టు సమాచారం.ఇటు తెలంగాణ తోపాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్తాన్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఉండగా.. ఈ ఎన్నికల తర్వాత జరిగే లోక్ సభ ఎలక్షన్స్ కోసం బీజేపీ ప్రణాళికలు వేస్తుండటం గమనార్హం. ఈ వార్తల పై అధికారిక ధ్రువీకరణ ఇంకా రాలేదు.