Business

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ (Sensex) 11 పాయింట్లు లాభపడి 65,087.25 దగ్గర ముగిసింది. నిఫ్టీ (Nifty) 4.80 పాయింట్లు పెరిగి 19,347.45 దగ్గర నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో జియోఫిన్‌, టాటా స్టీల్‌, మారుతీ, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఐటీసీ, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, విప్రో, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.73 దగ్గర స్థిరపడింది.

ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు (Stock market) దాదాపు ఆఖరి గంటన్నర వరకు అదే బాటలో పయనించాయి. చివర్లో లాభాల స్వీకరణలో ఒక్కసారిగా కిందకు దిగొచ్చాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 65,458.70 వద్ద గరిష్ఠాన్ని.. 65,052.74 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 19,452.80- 19,334.75 మధ్య కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలే సూచీలను ముందుకు నడిపించాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

*  జీఎస్టీ ఇన్వాయిస్‌ ఆధారంగా త్వరితగతిన రుణాలు పొందేలా ఎంఎస్‌ఎంఈల కోసం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ప్రత్యేక యాప్‌ను లాంఛ్‌ చేసింది. బ్యాంకు షేరు ఈరోజు ఇంట్రాడేలో ఒకశాతానికి పైగా పెరిగింది. చివరకు రూ.63.30 దగ్గర స్థిరిపడింది.

*  రూ.4,000 కోట్ల నిధుల సమీకరణకు డైరెక్టర్ల కమిటీ అనుమతి లభించినట్లు ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. బ్యాంక్‌ షేరు ఈరోజు 2.54 శాతం నష్టపోయి రూ.381.80 దగ్గర ముగిసింది.

*  టిటాగఢ్‌ రైల్‌ సిస్టమ్స్‌ షేరు ధర ఈరోజు 1.91 శాతం పెరిగి రూ.745.40 దగ్గర ముగిసింది. అహ్మదాబాద్‌ మెట్రోకు సంబంధించి రూ.350 కోట్ల ప్రాజెక్టు కాంట్రాక్ట్‌కు అనుమతి లభించినట్లు కంపెనీ తెలిపింది.

*  దక్షిణ అమెరికాలోని ఓ క్లైంట్‌ నుంచి రూ.73.65 కోట్లు విలువ చేసే ఆర్డర్‌ లభించినట్లు రామకృష్ణ ఫోర్జింగ్స్‌ తెలిపింది. కంపెనీ షేరు విలువ ఈరోజు 1.13 శాతం పెరిగి రూ.661 వద్ద నిలిచింది.

*   గోకల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ షేరు వరుసగా రెండోరోజూ రాణించింది. ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న అట్రాకో గ్రూప్‌నకు చెందిన వస్త్ర వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు కంపెనీ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షేరు రాణిస్తోంది. ఈరోజు చివరకు షేరు 14.78 శాతం లాభపడి రూ.844 వద్ద స్థిరపడింది.