తిరువూరు రెవెన్యూ పరిధిలోని గంపలగూడెం మండలం గుల్లపూడికి చెందిన కేతినేని కిషోర్‌బాబుకు కాలిఫోర్నియా కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. కోవిద్ క్లిష్ట సమయంలో జీతభత్యాలు చెల్లింపుల నిమిత్తం అమెరికా ప్రభుత్వం అందజేసిన ఋణానికి (Paycheck Protection Program PPP Loan Fraud) సంబంధించిన నకిలీ సమాచారం సమర్పించి ₹24కోట్లు తీసుకున్నందుకు, మరో ₹16కోట్లు పన్నులు ఎగ్గొట్టినందుకు గానూ ఆయనకు ఈ శిక్ష విధించారు.
కిషోర్‌బాబు నేతృత్వంలోని BiteGate, Dinenamics, Neelinfo, TechPMC సంస్థలతో పాటు, అతని సోదరుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న Boxstertech, Hiretechforce, TechGlobalSystems అనే మూడు సంస్థలు కోవిద్ సమయంలో ఏప్రిల్ 2020 నుండి మే 2021 మధ్య 12 దరఖాస్తుల ద్వారా తప్పుడు సమాచారం సమర్పించి ₹24కోట్లు ($3.1Million USD) అక్రమంగా తీసుకుని వాటిని జీతభత్యాలకు వినియోగించకుండా స్వప్రయోజనాలకు వినియోగించుకోవడమే గాక కుటుంబ సభ్యులకు బదిలీ చేసినట్లు అధికారులు అభియోగం మోపారు. దీనితో పాటు Neelinfo సంస్థ 2014-18 మధ్య ₹16కోట్ల ($2Million USD) మేర పన్నులు ఎగ్గొట్టారని మరో అభియోగాన్ని మోపారు. విచారణ అనంతరం తాను మోసానికి పాల్పడినట్లు కిషోర్‌బాబు ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగీకరించడంతో కాలిఫోర్నియా కోర్టు శుక్రవారం నాడు రెండేళ్ల జైలుశిక్ష, ₹12లక్షల జరిమానా ($15000 USD)తో పాటు అక్రమంగా సంపాదించిన నిధులను తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చింది. జైలుశిక్ష నుండి విడుదల అయిన రెండేళ్ల వరకు కిషోర్‌బాబుపై నిఘా ఉంచాలని జడ్జి అధికారులను ఆదేశించారు.
Official Government Press Release: https://www.justice.gov/usao-ndca/pr/software-development-ceo-sentenced-two-years-prison-tax-and-conspiracy-charges