వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్)లో నకిలీ ర్యాంకు కార్డుతో బీటెక్ సీటు పొందేందుకు మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థిని యత్నించింది. ధ్రువపత్రాల పరిశీలనలో ఆమె ర్యాంకు కార్డు, సీటు కేటాయింపు (అలాట్మెంట్) పత్రాలు నకిలీవని గుర్తించారు. ఆమెను నిట్ అకాడమిక్ అధికారులు విచారించగా పత్రాలను ఫోర్జరీ చేసినట్లు అంగీకరించిదని తెలిసింది. అయిదు లక్షల ర్యాంకు వస్తే దానిని 50 వేల ర్యాంకుగా మార్చుకుని, నకిలీ సీటు అలాట్మెంట్ పత్రాలను తయారు చేసినట్లుగా తేలింది. ఈ విషయమై సెంట్రల్ సీట్ అలాట్మెంట్ బోర్డు(సీసాబ్)కు సమాచారమివ్వగా… కేసు నమోదు చేయించాలని వారు ఆదేశించారు. ఇలాంటి నకిలీ ధ్రువపత్రాలతో రవూర్కేలాలోనూ ముగ్గురు విద్యార్థులు సీటు పొందేందుకు యత్నించినట్లు తెలిసింది. ఫోర్జరీల వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్ పాసై జేఈఈలో లక్షల్లో ర్యాంకు వచ్చిన విద్యార్థులతో ఈ ముఠా కుమ్మక్కై తప్పుడు పత్రాలను సృష్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.