Business

ఏపీ కంటే తెలంగాణలో విదేశీ పెట్టుబడులు ఎక్కువ

ఏపీ కంటే తెలంగాణలో విదేశీ పెట్టుబడులు ఎక్కువ

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో తెలంగాణ కన్నా ఏపీ చాలా వెనుకబడింది. ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఏపీ కంటే తెలంగాణకు 10 రెట్లు ఎక్కువ FDI (Foreign Direct Investment)లు వచ్చాయి. ఈ 6 నెలల కాలంలో తెలంగాణకు 8,655 కోట్లు రాగా.. ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 744 కోట్లు దక్కినట్లు DPIIT (Department for Promotion of Industry and Internal Trade) వెల్లడించింది.

ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో తెలంగాణకు ఏపీ కంటే పది రెట్లు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలంలో దేశంలోకి 1,66,294 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇందులో జనవరి-మార్చి నెలల మధ్యలో 76,361 కోట్లు రాగా, ఏప్రిల్‌-జూన్‌ మధ్యలో 89,933 కోట్లు వచ్చాయి.

ఈ ఆరు నెలల కాలంలో తెలంగాణకు 8,655 కోట్లు రాగా, ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 744 కోట్లు దక్కినట్లు కేంద్ర పరిశ్రమ, అంతర్గత వాణిజ్య విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం వెల్లడైంది. ఏపీకి తొలి మూడు నెలల్లో 297 కోట్లు, మలి మూడు నెలల్లో 447 కోట్లు దక్కాయి. తెలంగాణకు తొలి మూడు నెలల్లో 1,826 కోట్లు రాగా, మలి మూడు నెలల్లో అవి 6,829 కోట్లకు పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల పెట్టుబడులను ఒక్కటే పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది.

ఈ త్రైమాసికంలో మహారాష్ట్రకు 36,634 కోట్లు, దిల్లీకి 15,358 కోట్లు, కర్ణాటకకు 12,046 కోట్లు, తెలంగాణకు 6,829 కోట్లు, గుజరాత్‌కు 5,993 కోట్లు, తమిళనాడుకు 5,181 కోట్లు, హరియాణాకు 4,056 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇందులో గుజరాత్‌ కంటే తెలంగాణ ఒక మెట్టు పైనే నిలిచింది. 2023 తొలి ఆరు నెలల్లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ 6వ స్థానంలో నిలువగా, ఆంధ్రప్రదేశ్‌ 12వ స్థానానికి (Andhra Pradesh Ranked 12th) పరిమితమైంది.

మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక తొలి మూడు స్థానాలను ఆక్రమించాయి. 16 రాష్ట్రాలకే ఒక్కోదానికి 100 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇందులో తొలి 7 రాష్ట్రాలకు కలిపి 1,58,289 కోట్ల పెట్టుబడులు రాగా, మిగిలిన 9 రాష్ట్రాలకు కలిపి 7,746 కోట్లు దక్కాయి. 2019 అక్టోబరు నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ఆంధ్రప్రదేశ్‌కు 6,495 కోట్ల ఎఫ్‌డీఐలు రాగా, తెలంగాణకు 42,595 కోట్లు వచ్చాయి.