DailyDose

శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం-TNI నేటి తాజా వార్తలు

శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం-TNI నేటి తాజా వార్తలు

చంద్రబాబు పురంధేశ్వరిపై సజ్జల ఫైర్

 వైసీపీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంటగంటకు మాట మార్చడం చంద్రబాబుకు అలవాటన్నారు. బీజేపీని తిట్టిన నోటితోనే ప్రశంసలు కురిపిస్తున్నారంటూ సజ్జల బాబుపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 70 శాతం ప్రజలు జగన్‌ పాలనను కోరుకుంటున్నారన్నారు. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్‌లా మారిపోయారని అన్నారు. ఎన్టీఆర్‌ నాణెం విడుదల సందర్భంగా రాష్ట్రపతిభవన్‌లో నీచరాజకీయాలు చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతిని పిలవకుండా అవమానించారని అన్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు రెండోసారి వెన్నుపోటీ పొడిచారంటూ సజ్జల విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని నందమూరి కుటుంబ సభ్యులు అవమానించారని, ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల సందర్భంగా రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయ వేదికగా మార్చారంటూ సజ్జల పేర్కొన్నారు. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారని, నాడు తన పక్కన ప్రచారంలో కూడా నిలబెట్టుకున్నారని.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆమెను ఆమోదించారంటూ పేర్కొననారు. కానీ, లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్‌కు సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేదని.. 2024లో అధికారంలోకి వస్తే ఏదో చేస్తానంటున్నారని.. అసలు 2019 వరకు ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మాట్లాడిన తీరు ప్రజలందరికీ తెలుసునన్నారు. తాము పవన్ కల్యాణ్‌తో లేమని, బీజేపీతో ఉండమని చెబితే లోకేశ్ పాదయాత్రకు అంతమంది జనాలు వస్తారా అంటూ సజ్జల పేర్కొన్నారు. లోకేశ్ పాదయాత్రకు కార్యకర్తలే రావడం లేదంటూ విమర్శించారు. పొత్తుల కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారని,  బీజేపీ, టీడీపీ కలవాలనుకుంటే ఎవరు ఆపుతారన్నారు. బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసినా ఫర్వాలేదంటూ పేర్కొన్నారు. ఇప్పటికీ.. చంద్రబాబు 175 చోట్ల సొంతంగా పోటీ చేస్తానని చెప్పలేకపోతున్నారన్నారు. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్‌లా మారారని.. బాబు నాడు మోదీని తిట్టి ఇప్పుడు పొగుడుతున్నారంటూ సజ్జల విమర్శించారు.పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందన్నారు. వీరంతా ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడుతున్నారని, కానీ అసలు ఆ వ్యతిరేకత ఉందా.. అంటూ సజ్జల ప్రశ్నించారు. తమకు 70 శాతం పాజిటివ్ ఓటు బ్యాంకు ఉందని.. మిగతా 30 శాతాన్ని ప్రతిపక్షాలు పంచుకుంటాయంటూ సజ్జల జోస్యం చెప్పారు

*  దక్షిణాఫ్రికాలో భారీ అగ్ని ప్రమాదం

 దక్షిణాఫ్రికా లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అతిపెద్ద నగరమైన జొహన్నెస్‌బర్గ్‌ లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 63 మంది సజీవదహనమయ్యారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.జొహన్నెస్‌బర్గ్‌లోని ప్రముఖ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఓ భవనంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి రాగా.. భవనమంతా దట్టమైన పొగ అలుముకొని సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 63 మృతదేహాలను గుర్తించామని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ అధికారులు వెల్లడించారు. మరో 43 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు. అర్ధరాత్రి దాటాక అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.నిరాశ్రయులు ఎలాంటి లీజ్‌ అగ్రిమెంట్లు లేకుండానే ఈ భవనంలో నివాసముంటున్నారని ఎమర్జెన్సీ అధికారులు తెలిపారు. అందువల్ల భవనంలో చిక్కుకుపోయిన వారిని వెతకడం కష్టంగా మారిందని తెలిపారు. ఈ భవనంలో దాదాపు 200 మంది నివాసముంటున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంటల ధాటికి భవనం చాలా వరకు ధ్వంసమైంది.

* రాఖీ స్పెషల్ కవిత ఎమోషనల్ ట్వీట్

తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగను అంగంరగ వైభవంగా నిర్వహిస్తున్నార. రాష్ట్రమంతటా రాఖీ పండుగ శోభ సంతరించుకుంది. సోదర, సోదరీమణుల మధ్య.. ఆప్యాయ అనురాగాలు వెల్లివిరుస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులకు.. మహిళా నేతలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు రాఖీలు కట్టారు. మరోవైపు మార్కెట్‌లలో రాఖీల కొనుగోలుతో.. సందడి వాతావరణం నెలకొంది. కొంతమంది నేతుల సోషల్ మీడియా ద్వారా తమ సోదరసోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.రక్షా బంధన్​ పండుగను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విటర్​) వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో కవిత.. ‘అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం నా “ అన్న ” అని రాసుకొచ్చారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.మరోవైపు రాఖీ సోదరీమణుల ప్రేమకు చిహ్నమని ఎంపీ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. ఎమ్మెల్సీ కవితతో పాటు తన సోదరి సౌమ్య.. తనకు రాఖీ కడుతున్న ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నేడు ఇండియా కూటమి భేటీ

బీజేపీని గద్దె దించడమే టార్గెట్‌గా జట్టు కట్టిన విపక్ష పార్టీలు.. ఆ దిశగా స్పీడ్ పెంచాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటడంతో.. కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. అందుకోసమే ఇవాళ, రేపు మహారాష్ట్రకు మకాం మార్చాయి విపక్ష పార్టీలు. అయితే ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటున్న విపక్ష కూటమి.. తాజా సమావేశంలో తమ కూటమి లోగో తో పాటు.. భవిష్యత్ కార్యాచరణ, అనుసరించిన వ్యూహాలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రధాని అభ్యర్ధి ఎవరనే దానిపైనా కూటమిలో చర్చ ఉండబోతోంది.రాష్ట్రాల్లో ఎవరి గుర్తుపై వాళ్లే పోటీ చేయాలని కూటమి పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. అయితే ఇండియా కూటమి కన్వీనర్‌గా ఎవరు ఉంటారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి ప్రధాని అభ్యర్ధిగా.. రాహుల్ గాంధీ ఉంటారంటూ కాంగ్రెస్ నుంచి ప్రకటన వచ్చింది. ఈ విషయంలో సందేహం అక్కర్లేదని, ముమ్మాటికి రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్ధిగా బరిలో ఉంటారని సంచలన ప్రకటన చేశారు రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌. రాహుల్‌గాంధీకి ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయనేది ఆయన అభిప్రాయం.ఇదే సమయంలో ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్ధిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సరైన వ్యక్తి అని ప్రియాంక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఢిల్లీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన కేజ్రీవాల్‌కే.. దేశాన్ని నడిపే సత్తా ఉందంటున్నారామె.ప్రధానమంత్రి పదవి రేసులో మమతా బెనర్జీ సహా పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు. మరోవైపు బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ను కన్వీనర్‌గా ఎన్నుకుంటారని ప్రచారం జరిగింది. అయితే తనకు ఆ పదవి మీద ఆసక్తి లేదని నితీష్‌ తేల్చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూటమి కన్వీనర్‌గా ఎవరిని ఎన్నుకుంటారు. ప్రధాని అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేస్తారు.. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదురుతుందా.. లేదా అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం.విపక్ష కూటమి మొదటి మీటింగ్ పాట్నాలో జరిగింది. బెంగళూరులో రెండోసారి సమావేశం జరిగింది. ఇప్పుడు ముంబై వేదికగా.. సమావేశమవుతోంది విపక్ష ఇండియా కూటమి. మే 23న బెంగళూరులో జరిగిన సమావేశంలో 26 పార్టీలు పాల్గొంటే, ఈరోజు సమావేశానికి 28 పార్టీలు హాజరవుతున్నాయి. ముచ్చటగా మూడోసారి భేటీ అవుతున్న ఈ కూటమి.. ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి.

తుమ్మలపై కందాల సెటైర్లు

ఐదేళ్లు మంత్రిగా పనిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  ఒక్క సీటును కూడ గెలిపించలేకపోయారని  పాలేరు ఎమ్మెల్యే  కందాల ఉపేందర్ రెడ్డి  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావునుద్దేశించి వ్యాఖ్యానించారు.గురువారంనాడు హైద్రాబాద్ లో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు  తాను కూడ గెలవలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఐదేళ్లు మంత్రిగా ఉండి  ఏం చేశారని ఆయన  ప్రశ్నించారు.ఓడిపోయి  ఇంటి వద్ద  ఉన్న తుమ్మల నాగేశ్వరరావును  పిలిచి ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇవ్వడం కేసీఆర్ చేసిన అన్యాయమా అని  ఎమ్మెల్యే  ఉపేందర్ రెడ్డి  ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు ఖమ్మం జిల్లాను  చేతిలో పెట్టడం కేసీఆర్ చేసిన అన్యాయమా అని ఆయన అడిగారు.  షర్మిల ఇప్పటివరకు తెలంగాణకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తెలంగాణకు ఏం చేస్తుందని ఆయన  అడిగారు.2018 ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానంనుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  కందాల ఉపేందర్ రెడ్డి  పోటీ చేసి  బీఆర్ఎస్ అభ్యర్ధి  తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించారు.   ఆ తర్వాత  చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి  బీఆర్ఎస్ లో చేరారు.  ఈ నెల  21న  కేసీఆర్ ప్రకటించిన  బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో  కందాల ఉపేందర్ రెడ్డికి  చోటు దక్కింది.  ఇదే స్థానం నుండి తుమ్మల నాగేశ్వరరావు  బీఆర్ఎస్ టిక్కెట్టు ఆశించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా  ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ మొండిచేయి  చూపారు. దీంతో  తుమ్మల నాగేశ్వరరావు  తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.  బీజేపీ, కాంగ్రెస్ నుండి తుమ్మల నాగేశ్వరరావును  తమ పార్టీల్లో చేరాలని  ఆహ్వానాలు పంపారు. కాంగ్రెస్ లో చేరేందుకు  తుమ్మల నాగేశ్వరరావు మొగ్గు చూపుతున్నారనే  ప్రచారం సాగుతుంది. రెండు మూడు రోజులుగా  జిల్లా వ్యాప్తంగా పలు మండలాలకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఆయనతో సమావేశమౌతున్నారు.ప్రజా క్షేత్రంలో ఉండాలని  తుమ్మ ల నాగేశ్వరరావు సూచించారు. మరో వైపు పాలేరు నుండి పోటీ చేస్తానని  అనుచరులకు  తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేసినట్టుగా  సమాచారం. ఈ దిశగా తుమ్మల నాగేశ్వరరావు కూడ కసరత్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై  తుమ్మల నాగేశ్వరరావుకు మంచి పట్టుంది. సుదీర్ఘ కాలం పాటు టీడీపీలో కొనసాగిన తుమ్మల నాగేశ్వరరావు  2014 ఎన్నికల తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పారు.  కేసీఆర్ ఆహ్వానం మేరకు  బీఆర్ఎస్ లో చేరారు.  2014లో కేసీఆర్ కేబినెట్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా  పనిచేశారు.  2018లో పాలేరు నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  అప్పటి నుండి తుమ్మల నాగేశ్వరరావుకు కష్టాలు మొదలయ్యాయి. పాలేరు టిక్కెట్టు దక్కక అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం  తన దూతగా  ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును పంపారు.  ఎన్నికల తర్వాత తుమ్మల నాగేశ్వరరావుకు  కీలక పదవిని అప్పగించనున్నట్టు హామీ ఇచ్చారు.పాలేరు టిక్కెట్టు  దక్కని  తుమ్మల నాగేశ్వరరావు నామా నాగేశ్వరరావు రాయబారంతో   తృప్తి చెందలేదు.

*  శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్‌లో అర్ధరాత్రి దాటాక ఎల్‌ బ్లాక్‌ సముదాయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 షాపులు కాలి బూడిదయ్యాయి. అప్రమత్తమైన దేవస్థానం అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. మల్లన్న ఆలయ సమీపంలోని లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలలో బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. ఎల్ బ్లాక్‌లో దాదాపుగా 15 దుకాణాలు మంటలతో దగ్దమయ్యాయి. ఓ దుకాణంలో చెలరేగిన మంటలు.. పక్కన ఉన్న దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. దుకాణదారులు విద్యుత్ శాఖకు ఫోన్ చేసి.. పవర్ కట్ చేయించారు. అయితే అప్పటికే సుమారు 15 బొమ్మలు, గాజులు, దేవుడి ఫోటోల దుకాణాలకు మంటలు వ్యాపించాయి.

బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదు

కాంగ్రెస్, బీజేపీ నేతలపై మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాన భవన్‌లో ఎమ్మార్పీఎస్ నాయకుడు యాతాకుల భాస్కర్ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం రాష్ట్ర మహిళలకు హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. దళిత జాతి మేలు కోసమే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి భాస్కర్ అని కొనియాడారు. దళితజాతి అభివృద్ధి కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు భాస్కర్‌ను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఎన్నికలు రాగానే పార్టీలు నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయి.. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలు నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. నకీలు మాటలు, వెకిలి చేష్టలు చేసే పార్టీలు ఎక్కువయ్యాయని విమర్శించారు.అమిత్ షాకు తెలంగాణపై అవగాహన లేదు.. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పోయారని ఎద్దేవా చేశారు. అమిత్ షా గుజరాత్ గుడ్డి పాలనను సరిచేసుకోవాలని సూచించారు. ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో హామీలు అమలు కావడం లేదని.. కర్ణాటకలో బీజేపీపై ప్రజలకు కక్కొస్తే కాంగ్రెస్ గెలిచిందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్ అని అన్నారు. ప్రపంచంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టిన ఏకైక సర్కార్ కేసీఆర్‌ది.. సెక్రటేరియట్‌కు అంబేడ్కర్ పేరు పెట్టి ఆయనపై పై భక్తిని చాటుకున్న సర్కార్ కేసీఆర్‌ది గుర్తుచేశారు. పార్లమెంట్‌కు అంబేడ్కర్ పేరు పెట్టమంటే కేంద్రం మొఖం చాటేసిందని మండిపడ్డారు. అంబేడ్కర్ మార్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. యాతాకుల భాస్కర్ సేవలను బీఆర్ఎస్‌ తప్పకుండా ఉపయోగించుకొని ఉన్నత స్థానం ఇస్తదని హామీ ఇచ్చారు.

ప్రభుత్వానికి మరోసారి కోమటిరెడ్డి ఛాలెంజ్

 బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రైతులకు ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లిన 3 గంటల కరెంటు ఇచ్చే ప్రభుత్వం కావాలా 24 గంటల కరెంటు ఇచ్చే ప్రభుత్వం కాలావాలా అంటూ ప్రజలను అడుగుతున్నారు. కానీ అసలు రాష్ట్రంలో ఎక్కడా కూడా 12,13 గంటల కంటే ఎక్కువ కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు.తమకు 24 గంటల కరెంట్ ఇవ్వడం చేత కావడం లేదని ప్రభుత్వం ఇకనైనా ఒప్పుకోవాలన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీపై నిందలు చేయాలని చూడడం మానుకోవాలన్నారు. రైతుబంధు డబ్బులు పెట్టుబడికి, వడ్డీలు కట్టేందుకు చాలడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలను నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తన సవాల్ స్వీకరించి రికార్డులను పరిశీలించేందుకు మంత్రి హరీశ్ రావు వస్తారో మంత్రి జగదీశ్ రెడ్డి వస్తారో లేక సీఎస్, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు వస్తారో రావాలన్నారు. మరో మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందన్నారు.

*  చిత్తూరు జిల్లాలో మరొకరి ప్రాణం తీసిన ఒంటరి ఏనుగు

చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. నిన్న ఇద్దరిని తొక్కి చంపిన ఒంటరి ఏనుగు ఇవాళ మరొకరి ప్రాణం తీసింది. ఏనుగు దాడిలో మహిళ మృతి చెందారు. చిత్తూరు – తమిళనాడు సరిహద్దు ప్రాంతం కోడేనత్తం గ్రామానికి చెందిన మహిళపై ఏనుగు దాడి చేసింది. దీంతో ఘటనా స్థలంలోనే మహిళ మృతి చెందారు.నిన్న (బుధవారం) దంపతులను మట్టుబెట్టిన మదపుటేనుగు ఇవాళ (గురువారం) మహిళను చంపినట్లు గుర్తించారు. ఇవాళ మళ్లీ ఒంటరి ఏనుగు గుడిపాల మండలం రామాపురం గ్రామానికి వచ్చింది. నిన్న ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఒంటరి ఏనుగు రాత్రి అడవిలోకి వెళ్లడంతో అటవీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఇవాళ ఒంటరి ఏనుగు మరో మహిళను చంపి తిరిగి గ్రామం పైకొచ్చింది. జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం కొనసాగుతోంది. అటవీ అధికారులు ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు ఆపరేషన్ గజ కొనసాగిస్తున్నారు. ఏనుగును మచ్చిక చేసుకుని బంధించేందుకు రెండు శిక్షణా ఏనుగులు వినాయక్, జయంత్ రంగంలోకి దిగాయి.

తెలంగాణలో పెరుగనున్న పగటి ఉష్ణోగ్రతలు

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తెలంగాణ మరింత ఉష్ణోగ్రతలు పెరుగనున్నాయి. తెలంగాణలో గత కొన్ని రోజులుగా వరుణుడి జాడ కనిపించడం లేదు. ఈసారి నైరుతి రుతుపవనాల రాకే ఆలస్యం కాగా, జూన్ నెలలో సరిగ్గా వర్షాలు కురవలేదు. దీంతో ఆ నెల లోటు వర్షపాతం నమోదయింది. ఇక జూలై చివరి వారంలో వర్షాలు దంచి కొట్టాయి.తెలంగాణ రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీ వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు. జూలై నెలలో రికార్డు వర్షపాతం నమోదయింది. ఇక ఆగస్టు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేడి గాలులు, విపరీతమైన ఉక్కపోత ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. వర్షాలు లేక అన్నదాతలు తలలు పట్టుకుం టున్నారు. అయితే… మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.