జమిలి ఎన్నికల (Jamili Elections) కమిటీపై న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను (Ramnath Kovind) నియమించింది. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది. కమిటీ తక్షణమే పని ప్రారంభించాలని న్యాయశాఖ ఆదేశించింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరింది.
కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి మొగ్గుచూపడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశం చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలన్నీ జమిలిపై దృష్టిసారించాయి. ప్రభుత్వం ఇందుకు మొగ్గుచూపినా లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా సమస్యలు అధిగమించాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో లా కమిషన్, పార్లమెంటు స్థాయీసంఘం జమిలి ఎన్నికలకు మద్దతుగా నివేదికలు ఇచ్చినప్పటికీ ఇందులో అధిగమించాల్సిన ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ, చట్టపరమైన అంశాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. తొలుత రాజకీయ ఏకాభిప్రాయం సాధిస్తే మిగిలిన అడ్డంకులు అధిగమించడం సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘జమిలి’ నిర్వహించాలంటే..జమిలి ఎన్నికలంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీల అధికారిక గడువులు భిన్నంగా ఉన్నాయి. వీటన్నింటినీ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే… (ఈసారే కాకుండా తర్వాత ఎప్పుడు పార్లమెంటు ఎన్నికలతో కలపాలన్నా) కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచటమో… మరికొన్నింటివి తగ్గించటమో చేయాలి. లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. కానీ అది అనుకున్నంత సులభం కాదు. ఇందుకు రాజ్యాంగ పరంగా అవరోధాలున్నాయి. దీన్ని అధిగమించాలంటే దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకుద్దేశించిన 1951 ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయటంతోపాటు… పలు కీలకమైన రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.