2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. దేశంలో అవినీతి, కుల-మత తత్వాలకు స్థానం ఉండదని వెల్లడించారు. ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల్లో దిల్లీలో జీ20 (G20) శిఖరాగ్ర భేటీ జరగనున్న నేపథ్యంలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
జీడీపీ దృక్కోణంలో చూడటం నుంచి.. మానవీయ దృక్కోణంలో చూసే దిశగా ప్రపంచం మారుతోందని మోదీ పేర్కొన్నారు. భారత్ ఇందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రపంచ సంక్షేమానికి ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ మార్గదర్శకంగా మారుతుందన్నారు.
భారత్ అధ్యక్షతతో సానుకూల ప్రభావం…జీ20పై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత్ అధ్యక్షత వహించడంతో జీ20పై చాలా సానుకూల ప్రభావం పడింది. వీటిల్లో కొన్ని నా మనసుకు దగ్గరైనవి ఉన్నాయి. ఈ సదస్సులో భారత్ మాటలు, దార్శనికతను ప్రపంచం భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్‌గా భావిస్తోంది. అంతేకాదు.. భారత నాయకత్వం పేద దేశాల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ‘వసుధైవ కుటుంబకం’ అనేది కేవలం ఒక స్లోగన్ కాదు. అది మన సాంస్కృతిక విలువల నుంచి నడిపించిన సమగ్ర తత్వం. ఏడాది పాటు జరిగే జీ20 కార్యక్రమాల్లో దాదాపు 1.5 కోట్ల మంది భారతీయులు భాగస్వాములయ్యారు. మన జీ20లో ఆఫ్రికాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం’’ అని అన్నారు.
కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లో జీ20 సదస్సు నిర్వహించడంపై చైనా, పాక్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను మోదీ కొట్టిపారేశారు. దేశంలోని ప్రతి భాగంలో జీ20 కార్యక్రమాలు నిర్వహించడం సర్వసాధారణమన్నారు.
ఆకలి కడుపు నుంచి ఆకాంక్షల వైపు..
భారత్ వృద్ధిపై ప్రధాని మాట్లాడుతూ..‘‘ఒకప్పుడు భారత్‌ను 100 కోట్ల ఆకలి కడుపులుగా చూసేవారు. కానీ, ఇప్పుడు ఆకాంక్షలతో నిండిన 100 కోట్ల మెదళ్లుగా.. నైపుణ్యంతో కూడిన 200 కోట్ల చేతులుగా చూస్తున్నారు. వచ్చే వెయ్యేళ్లకు గుర్తిండిపోయే విధంగా అభివృద్ధికి పునాది వేయడానికి భారతీయులకు ఇప్పుడే మంచి అవకాశం. భారత్ గత పదేళ్లలో జీడీపీ విలువల్లో ఐదు స్థానాలు ఎగబాకింది’’ అని వెల్లడించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ స్పందించారు. కేవలం చర్చలు, సంప్రదింపులతో మాత్రమే వేర్వేరు ప్రాంతాల్లో తలెత్తిన వేర్వేరు సంక్షోభాలను పరిష్కరించుకోగలమన్నారు. ఇక ఉగ్రవాదం, సైబర్ ముప్పులపై ప్రధాని స్పందిస్తూ..‘‘సైబర్ ముప్పులను తీవ్రంగా పరిగణించాలి. సైబర్ ఉగ్రవాదం, ఆన్లైన్ రాడికలైజేషన్, మనీలాండరింగ్‌లు కేవలం ఓ చిన్న భాగం మాత్రమే. ఉగ్రవాదులు దేశాల సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీయాలనే దారుణ లక్ష్య సాధన కోసం డార్క్‌నెట్, మెవెర్స్, క్రిప్టో కరెన్సీలను వాడుకొంటున్నారు. వార్తలపై విశ్వాసాన్ని ఫేక్ న్యూస్, డీప్ ఫేక్‌లు దెబ్బతీస్తాయి. ఇది సామాజిక అస్థిరతకు కారణమవుతుంది. సైబర్ క్రైమ్‌పై పోరాడేందుకు ప్రపంచ సహకారం అనివార్యం’’ అని అన్నారు.
దేశంలో గత తొమ్మిదేళ్లుగా నెలకొన్న రాజకీయ స్థిరత్వంతోనే పలు సంస్కరణలు సాధ్యమయ్యాయని మోదీ తెలిపారు. అభివృద్ధి అనేది దీనికి లభించిన బోనస్ మాత్రమేనని అన్నారు.