Agriculture

తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణలో గత కొద్ది రోజులుగా పొడి వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలు ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. అయితే తాజాగా రాష్ట్రాన్ని వరుణుడు కరుణించాడు. రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా చల్లటి వాతావరణం నెలకొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 158 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసింది. హైదరాబాద్‌లోనూ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

భారీ వర్షసూచన నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగాం జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.

సోమవారం ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అయితే ఈ వారంలో రాష్ట్రంలో వర్షభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.