Politics

ఎల్లుండి ఇండియా కూటమి ఎంపీలు ఖర్గే నివాసంలో భేటీ

ఎల్లుండి ఇండియా కూటమి ఎంపీలు ఖర్గే నివాసంలో భేటీ

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 5న విపక్ష కూటమి ‘ఇండియా’(I.N.D.I.A) ఎంపీలు భేటీ కానున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో విపక్షాలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అలాగే, జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌(Ramnath Kovind) అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ, తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. ఇందుకోసం రాజాజీ మార్గ్‌లోని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం వీరంతా సమావేశం కానున్నారు. అయితే, ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల అజెండాను కేంద్రం ఇప్పటివరకు వెల్లడించకపోవడంతో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, అజెండాలో ముఖ్యమైన అంశాలు ఉన్నాయని.. వాటిని సిద్ధం చేస్తున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు.

మరోవైపు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా ఏకతాటిపైకి వచ్చిన విపక్షాలు ఉమ్మడి కార్యాచరణను రూపొందించడంలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే కూటమిలోని పార్టీలన్నీ మూడు సార్లు సమావేశమయ్యాయి. పట్నా, బెంగళూరులో జరిగిన భేటీకి 26 పార్టీల నేతలు హాజరు కాగా.. ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1న ముంబయి వేదికగా జరిగిన భేటీకి 28 పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరైన విషయం తెలిసిందే. అంతేకాకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంతవరకు కలిసికట్టుగా పోటీచేయాలని తీర్మానం చేశారు. ఈ నెలాఖరు నాటికి  సీట్ల సర్దుబాటు అంశాన్ని కొలిక్కి తెచ్చేలా 14మందితో సమన్వయ కమిటీని సైతం ఏర్పాటు చేశారు.