ఉరుకులు పరుగుల జీవితం.. చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. ఇలా ప్రతి చిన్న విషయం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఆహారంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. యవ్వనంలో శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో అనేక మార్పులు మొదలవుతాయి.. సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే, అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి ఒత్తిడి, ఆహారం, వ్యాయామం, తగినంత నిద్రపై పూర్తిగా శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు ఎల్లప్పుడూ సలహా ఇస్తున్నారు. 30 సంవత్సరాల వయస్సులో మీరు మీ ఆరోగ్యాన్ని ఎలా చూసుకుంటారు అనేది రాబోయే 10 నుంచి 12 సంవత్సరాలు మీకు ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది. అందుకే.. ఈ వయసులో మీ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి.. అకాల వృద్ధాప్యాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఫైబర్ ఆహారాలు తీసుకోండి..మీ ఆహారంలో ఫైబర్ చేర్చడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్ శరీరానికి అందాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందువల్ల మీ ఆహారంలో ఖచ్చితంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చుకోండి..
శరీరానికి ఒమేగా -3 కూడా ముఖ్యమైనది..మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో మంటను తగ్గిస్తుంది. అలాగే జీవితకాలాన్ని పెంచడంలో అలాగే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఆహారంలో సాల్మన్ లేదా సార్డిన్ చేపలను చేర్చుకోండి. అంతేకాకుండా గింజలు, చియా విత్తనాలను కూడా తినవచ్చు.
ఎముకల బలం కోసం కాల్షియం…శరీరంలోని ఎముకల సంరక్షణ కూడా ముఖ్యం. 30 ఏళ్ల తర్వాత, ఎముకలు కొద్దిగా బలహీనపడటం ప్రారంభిస్తాయి. ఈ వయస్సులో, పాలు, పెరుగు, చీజ్, బ్రోకలీ, బచ్చలికూర, పాలకూర, బాదం వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తినాలి.
రెగ్యూలర్‌గా ప్రోటీన్ ఆహారం తీసుకోండి…కండరాల పెరుగుదలకు ప్రోటీన్ కూడా అవసరం. 30 ఏళ్ల తర్వాత శరీరానికి ఇది చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పురుషులు కనీసం 55 గ్రాములు, స్త్రీలు 45 గ్రాముల ప్రొటీన్లను రోజూ తినాలని సూచిస్తున్నారు. మీ ఆహారంలో గుడ్లు, పాలు, పప్పులు, చిక్కుళ్ళు, సోయాబీన్స్ వంటి వాటిని రెగ్యూలర్‌గా చేర్చుకోండి.