NRI-NRT

టీడీపీకి 25 లక్షలు విరాళం ఇచ్చిన గల్ఫ్ ఎన్నారై

టీడీపీకి 25 లక్షలు విరాళం ఇచ్చిన గల్ఫ్ ఎన్నారై

తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి తన వంతు చేయూతగా గల్ఫ్ ఎన్నారై టీడీపీ అధ్యక్షులు రావి రాధకృష్ణ మూర్తి రూ.25 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు గురువారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అమరావతిలో కలుసుకుని ఈ విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసిన రాధకృష్ణ.. అధినేత ఆశీస్సులు పొందారు. గల్ఫ్ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడిగా పార్టీకి అందిస్తున్న సేవలను, పార్టీ సంక్షేమ నిధికి రూ. 25 లక్షలు విరాళంగా అందించడం స్పూర్తిదాయకమని రాధకృష్ణను చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా రాధకృష్ణ మాట్లాడుతూ.. నిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, సమాజ అభివృద్దే జీవిత ధ్యేయంగా, రాజకీయ విలువలు కలిగిన దార్శనికులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో పార్టీకి సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు.

తండ్రి ఆశయాలను అందిపుచ్చుకున్న యువ నాయకులు, యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో నారా లోకేష్ చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. అధికార పార్టీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు నడుం బిగించిన లోకేష్.. 200 రోజుల పాటు యువగళం పాదయాత్ర పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. తన చేయూతగా తెలుగు దేశం పార్టీ సంక్షేమ నిధికి రూ.25 లక్షలు విరాళం అందించడం సంతోషంగా ఉందన్నారు.