నారాలోకేష్ యువగళం పాదయాత్రలో మంగళవారం జరిగిన గొడవలనేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. బేతపూడి యువగళం క్యాంప్ సైట్‌లో ఉన్న లోకేష్‌ను పోలీసులు వివరణ కోరారు. యాత్ర సందర్భంగా లోకేష్రె చ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు జారీచేశారు.
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి వద్ద నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర క్యాంప్ సైట్‌పై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు.3 వాహనాల్లో వచ్చిన పోలీసులు యువగళం వాలంటీర్లు, వంట సిబ్బంది సహా సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు.
మంగళవారం రాత్రి వైసీపీ కార్యకర్తలు కాపుకాచి లోకేశ్ పాదయాత్రపై రాళ్ల దాడికి పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. టీడీపీ కార్యకర్తల్ని లోకేష్ రెచ్చగొట్టారనే అభియోగాలతో యాత్ర వెంట సాగుతున్న వాలంటీర్లను అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు వివిధ ప్రాంతాల్లో తిప్పుతున్నారు. మంగళవారం రాత్రి భీమవరం, నర్సాపురం, వీరవాసరం, కాళ్ల పోలీస్ స్టేషన్లకు మార్చారు. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తల్ని సిసిలిలోని రాజ్యలక్ష్మి మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్యాక్టరీలో ఉంచారు.
అదుపులోకి తీసుకున్న వాలంటీర్లపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యువగళం పాదయాత్రకి అనుమతి ఇచ్చి అదే రూట్‌లో వైసీపీ వారిని అనుమతించారని మండిపడుతున్నారు.
రాళ్ల దాడి చేసిన వైసిపి కార్యకర్తలను, కవ్వింపు చర్యలకు స్కెచ్ వేసిన రౌడీ షీటర్ ఎన్ సుధని అరెస్ట్ చెయ్యకుండా యువగళం వాలంటీర్ల ను అరెస్ట్ చెయ్యడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సోడాలు, రాళ్ల తో దాడి చేసిన వారిని వదిలి యువగళం పై జులుం ప్రదర్శించారని ఆరోపిస్తున్నారు.
మంగళవారం రాత్రి యువగళం యాత్ర భీమవరం పట్టణం దాటి తాడేరు చేరుకోగానే కొందరు వైకాపా కార్యకర్తలు చుట్టుపక్కల ఉన్న భవనాలపై నుంచి రాళ్లతో దాడి చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో పక్క వీధి నుంచి కూడా మరి కొందరు రాళ్లు విసిరారని, వైకాపా కార్యకర్తలు జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ దాడికి తెగబడ్డారని ఆరోపిస్తున్నారు.