ప్రతిష్ఠాత్మక జీ-20 శిఖరాగ్ర సదస్సుకు వేదికైన ప్రగతి మైదాన్‌లోని ఐటీపీఓ కాంప్లెక్స్‌ను అధునాతన హంగులతోనే కాకుండా.. దాని ఎదుట దేశ పురాతన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే నటరాజ విగ్రహాన్ని (Nataraja statue)కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు విచ్చేసే ప్రతినిధులకు సాదరంగా ఆహ్వానించడంతో పాటు, భారతదేశ సంస్కృతి ప్రతిబింబించేలా 27 అడుగుల ఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ విగ్రహ విశిష్టతను కొనియాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ట్వీట్ చేశారు. ‘‘జీ- 20 సదస్సుకు వేదికైన ప్రగతి మైదాన్ ముందు అద్భుతమైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ఇది భారత్‌కు ఉన్న గొప్ప చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలకు మరింత జీవం పోస్తుంది. శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచమంతా భారత్‌కు తరలివస్తున్న వేళ.. మన దేశ కళాత్మకత, సంప్రదాయాలకు ఇది నిదర్శనం’’ అని ప్రధాని పోస్టు చేశారు.
ఏమిటీ విగ్రహ ప్రత్యేకత…ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ‘అష్ట ధాతు’ విగ్రహాలను తయారు చేసిన పద్ధతిలో దీనిని కూడా తయారు చేశారు. వెండి, బంగారం, జింకు, రాగి, సీసం, తగరం, పాదరసం, ఇనుము పదార్థాల మిశ్రమంతో తయారైన విగ్రహాలను అష్ట ధాతు విగ్రహాలంటారు. చోళుల కాలం నాటి మైనపు కాస్టింగ్ (మధుచిష్ట్ విధాన్) అనే శిల్ప పద్ధతిని ఉపయోగించి దీనిని నిర్మించారు. అంటే ఎక్కడా కూడా అతుకులు లేకుండా విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం భారత శక్తి చిహ్నం.. అదే విధంగా దేశ సృజనాత్మకతకు నిదర్శం. ఇది జీ-20 సదస్సులో ఆకర్షణీయంగా నిలవనుంది అని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అధికారిక సైట్లో ప్రధాన శిల్పి రాధాకృష్ణ స్థపతి తెలిపారు.