తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న బహిరంగ సభకు వేదిక ఖరారైంది. రెండు మూడు వేదికలను పరిశీలించిన ఏఐసీసీ జనరల్సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చివరకు హైదరాబాద్ తుక్కుగూడ ఈ–సిటీలోని ఖాళీ జాగాను ఖరారు చేశారు. ఎల్బీ స్టేడియంలో సభకు పోలీసులు పర్మిషన్ ఇచ్చినా.. పది లక్షల మందితో సభ నిర్వహించనుండడంతో అది సరిపోదని భావించిన పార్టీ నేతలు తుక్కుగూడలో సభ నిర్వహణకు మొగ్గుచూపినట్టుగా తెలిసింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చిన కేసీ వేణుగోపాల్ పార్టీ బహిరంగ సభ కోసం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, తుక్కుగూడ ఖాళీ స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం రాత్రి తాజ్ కృష్ణా హోటల్ లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపైనా చర్చించారు. సభకు వేదికను ఖరారు చేసిన నేతలు.. సీడబ్ల్యూసీ సమావేశాలను తాజ్ కృష్ణాలోనే నిర్వహించాలని నిర్ణయించారు. రెండు రోజులపాటు సీడబ్ల్యూసీ మెంబర్లు, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలతో సమావేశాలను నిర్వహించనున్నారు. పార్టీ అగ్రనేత సోనియా గాంధీ నేతృత్వంలో సాగే ఈ సమావేశాలకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా 300 మంది దాకా డెలిగేట్స్ రానున్నారు.
కమిటీ ఏర్పాటు
సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ, బహిరంగ సభను సక్సెస చేయడం కోసం పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ చైర్మన్‌గా ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. సమావేశాల బాధ్యతలన్నీ ఆ కమిటీనే దగ్గరుండి పర్యవేక్షించనున్నట్టు సమాచారం. మరోవైపు సీపీఐ నేత నారాయణ బుధవారం కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.
పార్టీ నేతలు మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా పాల్గొన్న ఈ భేటీలో రాష్ట్రంలో పొత్తులు, టికెట్లపై చర్చించినట్టు తెలిసింది. వామపక్షాలను బీఆర్ఎస్ దూరం పెట్టడంతో ఇండియా కూటమిలో భాగమైన ఆ పార్టీలు కాంగ్రెస్‌తో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.