Sports

కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్

కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రాణించపోయినప్పటికీ పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి చరిత్రకెక్కాడు. ఆసియా కప్‌-2023లో భాగంగా సూపర్‌-4 దశలో పాకిస్తాన్‌- బంగ్లాదేశ్‌ బుధవారం తలపడ్డాయి.

పాక్‌ పేసర్ల ధాటికి బంగ్లా బ్యాటర్ల విలవిల
లాహోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, పాక్‌ పేసర్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ హ్యారిస్‌ రవూఫ్‌(4 వికెట్లు), నసీం షా(3), షాహిన్‌ ఆఫ్రిది(1) ధాటికి బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 38.4 ఓవర్లలో కేవలం 193 పరుగులు చేసి టైగర్స్‌ జట్టు ఆలౌట్‌ అయింది.

వాళ్లిద్దరూ అదరగొట్టారు
ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ను ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌(78), మహ్మద్‌ రిజ్వాన్‌(63- నాటౌట్‌) విజయతీరాలకు చేర్చారు. ఇక ఈ మ్యాచ్‌లో పాక్‌ వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ బాబర్‌ ఆజం 22 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌ సాయంతో 17 పరుగులు సాధించాడు.

కోహ్లి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్‌ ఆజం
ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 2000 పరుగుల మార్కును అందుకున్న కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. పాక్‌ తరఫున 31 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ మైలురాయిని అందుకున్న బాబర్‌.. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని అధిగమించాడు.

కాగా వన్డేల్లో 2000 పరుగులు పూర్తి చేసేందుకు కోహ్లికి 36 ఇన్నింగ్స్‌ అవసరమయ్యాయి. ఈ జాబితాలో వరుసగా 41, 47 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ సాధించిన బ్యాటర్లుగా సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిల్లియర్స్‌, వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

మరోసారి ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌
కాగా సూపర్‌-4 దశను పాకిస్తాన్‌ విజయంతో ఆరంభించింది. బంగ్లాపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన బాబర్‌ ఆజం బృందం.. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియాతో తలపడనుంది. శ్రీలంకలోని కొలంబో ఇందుకు వేదిక కానుంది.