DailyDose

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో విషాదం-TNI నేటి నేర వార్తలు

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో విషాదం-TNI నేటి నేర వార్తలు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎన్‌ఐఏ సోదాల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేపట్టారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియాకు చెందిన యూనస్‌ను మూడు నెలల కిందట ఎన్‌ఐఏ అధికారారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూనస్ అత్తమ్మ గ్రామమైన ఆళ్లగడ్డలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్‌ఐఏ ఎస్పీ రాజీవ్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. యూఎస్ బంధువుల ఇళ్లలో కూడా ఎన్‌ఐఏ సోదాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గతంలో కూడా ఎన్‌ఐఏ అధికారులు ఆళ్లగడ్డలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక, యూనస్ కర్ణాటక పీఎఫ్‌ఐలో కీలకంగా వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. గతంలో నంద్యాల కేంద్రంగా కార్యకలాపాలు జరిపాడు. 2022లో ఎన్‌ఐఏ సోదాలు సమయంలో కర్ణాటకలోని బళ్లారికి పారిపోయాడు. అక్కడ పీఎఫ్‌ఐ సభ్యులకు శిక్షణ కార్యకలాపాలను కొనసాగించాడు.

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో విషాదం

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పీఎస్‌ పరిధిలోని అడ్డగుట్టలో విషాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 10 రోజుల కిందట భవనం ఆరో అంతస్తులో గోడపై ఎలివేషన్‌ నిర్మించే క్రమంలో చిన్నపాటి స్లాబ్‌ వేశారు. ఈ శ్లాబ్‌కు సంబంధించి సెంట్రింగ్‌ సామగ్రి తీస్తుండగా.. ఎలివేషన్‌ గోడ ఒక్కసారిగా కూలి పరంజిపై పడింది.గోడకూలి పరంజిపై పడటంతో అక్కడే పనిచేస్తున్న సంతు (23), సోనియా (23) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు తీవ్రంగా.. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సానియా (23) మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా రెండు నెలల క్రితం ఒడిశా నుంచి నగరానికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, డీఎస్పీ శ్రీనివాస్‌ ఘటనాస్థలిని పరిశీలించారు.

*  ప్రయాణికులపైకి దూసుకొచ్చిన మృత్యు శకటం

 జన్నారం మండలం కలమడుగు గ్రామ బస్టాండ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జోగు సాయి కుమార్ (37), జోగు లక్ష్మణ్ (7) అనే వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లాకు చెందిన జోగుసాయి కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా జన్నారం మండల రేండ్లగూడలో కూలీ పని చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సాయికుమార్ తన భార్య మంజుల, కుమారుడు లక్ష్మణ్ ను తీసుకుని తనస్వంత గ్రామానికి వెళ్దామని కలమడుగు బస్తాండ్ వద్ద బస్సు కొరకు ఎదురు చూస్తున్నాడు.ఈ క్రమంలో జన్నారం నుండి జగిత్యాల వైపు వెళ్తున్న ఐచర్ వ్యాన్ డ్రైవర్ మద్య సేవించి అజాగ్రత్తగా వాహనం నడపడం వలన కలమడుగు బస్టాండ్ వద్ద బొల్తాపడడంతో అక్కడే బస్సు కొరకు ఎదురు చూస్తున్న సాయికుమార్, లక్ష్మణ్ లపై పడింది. దీంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. సాయి కుమార్ భార్య మంజులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

డబ్బుల కోసం పుట్టక ముందే బిడ్డను బేరం పెట్టిన తల్లి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన రెండు రోజుల బాబు ను విక్రయించేందుకు యత్నించింది. విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు నిందులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసిపి కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గొసంగి దేవి, భర్త ఇద్దరు పిల్లలతో ఉంటుంది. భర్త కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే దేవి గర్భం దాల్చగా బిడ్డను పోషించే స్తోమత లేకపోవడంతో పుట్టిన వెంటనే బిడ్డను అమ్మాలని భావించింది. ఇదే విషయాన్ని దుబ్బ ప్రాంతంలోని UPHC లో పనిచేసే సలుంకే జయ కి తెలిపింది. డబ్బులకు ఆశపడిన జయ నాగారంకు చెందిన అమీనా బేగంకు, ఆటోనగర్ కు చెందిన షబానా బేగంలకు బిడ్డను అమ్మేందుకు బేరసారాలు మొదలుపెట్టింది. ఆడబిడ్డ పుడితే లక్ష రూపాయలు అని, మగబిడ్డ పుడితే లక్షన్నర రూపాయలని రేటు నిర్ణయించింది. అమీనా బేగం, షబానా బేగంల వద్ద దేవి రూ.5 వేల చొప్పున అడ్వాన్స్ తీసుకుంది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గోసంగి దేవి మగబిడ్డకు జన్మనివ్వడంతో డెలివరి ఖర్చు రూ.20 వేలు షబానా బేగం కట్టింది.ఈ నెల 3న సోమవారం సాయంత్రం అంబేద్కర్ కాలనీ చౌరస్తాలోని పాత థియేటర్ వద్ద గోసంగి దేవి, ఆశా వర్కర్ సలూరికే జయలు గొడవపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మూడవ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పసి కందును విక్రయించేందుకు యత్నించిన తల్లి గోసంగి దేవి, ఆశ వర్కర్ సలూరికే జయ, విక్రయించేందుకు ప్రయత్నించిన అమీనా బేగం, షబానా బేగంలను పోలీసులు అరెస్టు చేశారు. పసికందును ఐసిడిఎస్ సిబ్బందికి అప్పజెప్పి, నలుగురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి కిరణ్ కుమార్ తెలిపారు. వారి నుంచి రెండు సెల్ ఫోన్లు, 20 వేల నగదును స్వాధీన పరుచుకున్నా మని చెప్పారు.

భార్యను బావిలో వేలాడ దీసి చిత్రహింసలకు గురిచేశాడు

ట్నం కోసం ఓ నీచుడు కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెను బావిలో వేలాడదీసి నరకం చూపించాడు. అంతటితో ఆగకుండా కాపాడండంటూ ఆమె చేసిన ఆర్తనాదాలను వీడియో తీసి ఆమె పుట్టింటి వారికి ఫోన్‌ ద్వారా షేర్‌ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి బుద్ది చెప్పారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లోని జాదవ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కిర్‌ఖెడా గ్రామానికి చెందిన రాకేష్ కిర్ అనే వ్యక్తికి రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాకు చెందిన ఉష అనే యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన నాటి నుంచి రాకేష్‌ భార్యను నానా విధాలుగా హింసించేవాడు. వరకట్నం కింద రూ.5 లక్షలు పుట్టింటి నుంచి తీసుకురావాలంటూ వేధించేవాడు. అన్నింటినీ సహిస్తూ వచ్చిన ఉషను ఈ మధ్య కాలంలో మరింత దారుణంగా హింసించ సాగాడు రాకేష్. ఈ నేపథ్యంలో రాకేష్‌ తన భార్య ఉషకు తాడు కట్టి బావిలోకి వేలాడదీశాడు. బావి నీళ్లలో మునిగిన ఆమె భయంతో కాపాడండంటూ ఆర్తనాదాలు చేసింది. బయటకు తీసుకురమ్మని వేడుకుంది.అయితే భర్త ఆమె ఆవేదనను కనీసం పట్టించుకోకుండా పైశాచిక ఆనందం పొందసాగాడు. పైగా భార్య భయంతో వేస్తున్న కేకలను వీడియో తీయసాగాడు. ఈ దారుణాన్ని చూసిన ఇరుగుపొరుగు జోక్యం చేసుకుని ఆమెను రక్షించి బయటకు తీశారు. అనంతరం రాకేష్‌ తాను తీసిన వీడియోను భార్య పుట్టింటివారికి, బంధువులకు ఫోన్‌లో పంపాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసి తమ కుమార్తెలను రక్షించవల్సిందిగా వేడుకున్నారు. దీనిపై గృహ హింస కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన ఆగస్టు 20వ తేదీన చోటు చేసుకుంది.జాదవ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అస్లం పఠాన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిందితుడు రాకేష్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశాం. భార్య పుట్టింటి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు కట్నం తీసుకురావాలని భార్య ఉషను వేధించాడు. రాకేష్‌ను అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టాం. ప్రస్తుతం నిందితుడు జైలులో ఉన్నట్లు తెలిపాడు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో బాత్రూం చెత్తబుట్టిలో బంగారం పట్టివేత

విదేశాల నుండి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న స్మగ్లర్లు అతితెలివి ప్రదర్శిస్తున్నారు. విమానాశ్రయంలో బంగారం పట్టుబడకుండా కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే స్మగ్లర్ల ఎత్తులను చిత్తుచేస్తూ కస్టమ్స్ అధికారులు కేజీల కొద్ది బంగారాన్ని పట్టుకుంటున్నారు. ఇలా తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో బాత్రూం చెత్తబుట్టిలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే… దుబాయ్ నుండి హైదరాబాద్ కు అక్రమంగా బంగారాన్ని తీసుకువస్తున్న ఓ స్మగ్లర్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. కస్టమ్స్ అధికారుల తనిఖీ వెళ్లేముందు బాత్రూంలోకి వెళ్ళిన అతడు తన వద్దగల బంగారాన్ని చెత్తబుట్టిలో పడేసాడు. తర్వాత బాత్రూంలోంచి బయటకు వచ్చి కస్టమ్స్ తనిఖీలకు వెళ్ళాడు. కానీ అతడి తీరు అనుమాస్పదంగా వుండటంతో కస్టమ్స్ అధకారులు తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టాడు.  దుబాయ్ నుండి తీసుకువచ్చిన బంగారాన్ని బాత్రూం చెత్తబుట్టిలో వేసానని… దీన్ని ఎయిర్ పోర్ట్ లోనే పనిచేసే ఓ ఉద్యోగి బయటకు తీసుకువెళతాడని తెలిపాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు చెత్తబుట్టిని బయటకు తీసుకువెళుతున్న ఉద్యోగిని పట్టుకున్నారు. చెత్తబుట్టిలోని 933 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఇక ఇదేరోజు (మంగళవారం)  ఉదయం కూడా ఇలాగే బాత్రూం చెత్తబుట్టిలో బంగారాన్ని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. కువైట్ నుండి వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడు అక్రమంగా బంగారాన్ని తీసుకువచ్చాడు. కస్టమ్స్ తనిఖీలకంటే ముందే బాత్రూం చెత్తబుట్టిలో 1300 గ్రాముల బంగారాన్ని దాచాడు. దీన్ని విమానాశ్రయ ఉద్యోగుల సాయంతో బయటకు తరలించే ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే కస్టమ్స్ అధికారులు అతడి ప్లాన్ ను పసిగట్టారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని చెత్తబుట్టిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే రాత్రి మరో ప్రయాణికుడు ఇలాగే చేయగా పోలీసులు పట్టుకున్నారు. 

మూత్రవిసర్జన చేస్తుండగా ఫొటో తీసిన మహిళ

ఓ మహిళ చేసిన ఆరోపణలతో అవమానాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడో యువకుడు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ గ్రామానికి చెందిన మేతరి ప్రమోద్‌(18) ఈనెల 4న తన ఇంటికి కొద్ది దూరంలో మూత్ర విసర్జన చేశాడు. సమీపంలో నివసించే ఓ మహిళ తన సెల్‌ఫోన్‌లో ఫొటోతీసి.. రోజు నన్ను చూస్తూ.. నా ఎదుటే మూత్ర విసర్జన చేస్తున్నాడంటూ ఆ ఫొటోను భర్తకు చూపించింది.దీంతో ఆయన కుల పెద్దలతో పంచాయితీ పెట్టించాడు. తాను ఉద్దేశపూర్వకంగా అక్కడ మూత్ర విసర్జన చేయలేదని, వర్షం పడుతుండడంతో అలా చేశానని ప్రమోద్‌ చెప్పినా వినకుండా తీవ్రంగా మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రమోద్‌.. అదే రోజు ఆర్మూర్‌ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బైక్‌పై వెళ్లి ఆర్మూర్‌ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని స్నేహితులకు ఫోన్‌ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పి నిప్పంటించుకున్నాడు. ప్రమోద్‌ స్నేహితులు ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలిపి సంఘటన స్థలానికి వెళ్లేసరికి తీవ్రంగా గాయపడి ఉన్నాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆర్మూర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ప్రమోద్‌ తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం కాగా ప్రమోద్‌ చివరివాడు. తల్లి చిన్నప్పుడే మృతిచెందగా నాన్నే పెంచాడు. ప్రమోద్‌ ఇంటర్‌ పూర్తిచేసి ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. ఈ విషయమై ఆర్మూర్‌ సీఐ సురేష్‌బాబును వివరణ కోరగా కేసు నమోదు చేశామని, మాక్లూర్‌కు కేసును బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.

*  పాకిస్థాన్ ఆర్మీ‌పై ఉగ్రవాదుల దాడి

తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) పాకిస్థాన్‌లో మరోసారి పాకిస్థాన్ భద్రతా బలగాలపై ఉగ్రవాదులు విరుచుకపడ్డారు. చిత్రాల్‌లోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై ఇవాళ ఉదయం 4 గంటలకు టీటీపీ దాడి చేయడంతో 11 మంది పాకిస్తానీ సైనికులు మరణించారని సమాచారం. మరో 40 మంది గాయపడ్డారని తెలిసింది. 12 మంది టీటీపీ ఉగ్రవాదులను హతమార్చినట్లు పాకిస్తాన్ ఆర్మీ పేర్కొంది. ఈ దాడి సమయంలో పాకిస్తాన్ ఆర్మీ సైనికులు అపహరణకు గురైనట్లు స్థానికులు నివేదించారు.

హైదరాబాద్‌ నగరంలో ఈ-సిగరెట్ల కలకలం

నగరంలో ఈ-సిగరెట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. రాయదుర్గం పరిధిలో ఎస్‌వోటీ(Special Operation Team) భారీగా ఈ-సిగరెట్లను పట్టుకుంది. వాటిని అమ్ముతున్న,  కొంటున్న విద్యార్థులనూ అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఇంటర్నేషన్‌ స్కూల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు కేటుగాళ్లు. అందులోని నికోటిక్‌కు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో వాట్సాప్‌ ద్వారా ఈ-సిగరెట్ల క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు ఎస్‌వోటీ గుర్తించింది. నిఘా వేసి.. భారీగా ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకుంది. వీటి విలువ  సుమారు మూడు లక్షల విలువ దాకా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ-సిగరెట్ల విక్రయానికి పాల్పడుతున్న ఇండియన్ బిజినెస్ స్కూల్ విద్యార్థి మాధవను (19) పోలీసులు అరెస్ట్‌ చేశారు. ICFAi, IBS  స్కూళ్లలో పదిమంది విద్యార్థులు, మహీంద్రా యూనివర్సిటీ, సంస్కృతి డిగ్రీ కాలేజ్,  ఆకాష్ ఇన్స్టిట్యూట్, గీతం కాలేజ్ , అమిటీ  కాలేజ్ విద్యార్థులకు ఈ సిగరెట్లు అమ్మినట్లు గుర్తించారు. మాధవ్‌ నుంచి 22 ఈ-సిగరెట్ల తో పాటు రెండు మొబైల్స్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. అమిటి కాలేజీలో చదువుతున్న అచ్యుత్.. 71 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ-సిగరెట్లు అమ్మినట్లు గుర్తించారు. వీళ్లిద్దరితో పాటు మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సెలబ్రిటీల ఇంట వరుస దొంగతనాలు

సెలబ్రిటీల ఇళ్లలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఐశ్వర్య రజనీకాంత్‌, శోభన, సింగర్‌ విజయ్‌ ఏసుదాస్‌ ఇంట చోరీ జరిగిన సంఘటనలు మరువకముందే మరో సీనియర్‌ హీరోయిన్‌ నిరోషా ఇంట దొంగతనం జరిగిన వార్త వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని తన ఇంట్లో బంగారు ఆభరణాలు కాజేశారంటూ నిరోషా.. తేనాంపేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.నగలతో పాటు కొన్ని ఆస్తి పత్రాలు సైతం కనిపించకుండా పోయాయని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఐశ్వర్య రజనీకాంత్‌ ఇంట దొంగతనం జరగ్గా ఇంటిదొంగను పోలీసులు పసిగట్టేశారు. ఇంట్లో పనిచేసే మహిళ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. తర్వాత శోభన ఇంట్లో దొంగతనం జరగ్గా.. అక్కడ కూడా తన పనిమనిషే చోరీకి పాల్పడినట్లు తేలింది. సింగర్‌ విజయ్‌ ఏసుదాస్‌ ఇంట నగలు కనిపించకుండా పోగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.కాగా ఘర్షణ(1988) సినిమాలో హీరోయిన్‌గా కనిపించిన నిరోషా ఈ చిత్రంతో యూత్‌కు బాగా దగ్గరైంది. ఈ చిత్రంలో ఆమె ఒక బృందావనం.. సోయగం.. అంటూ ఈత కొలనులో హొయలొలికించింది. ఇప్పటికీ ఈ పాట మార్మోగిపోతూ ఉంటుంది. సింధూరపువ్వు సినిమా సైతం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. కానీ తర్వాత పెద్దగా సినిమాలేవీ చేయని నిరోషా ఆ మధ్య క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె లాల్‌ సలాంలో రజనీకాంత్‌ భార్యగా నటిస్తున్నట్లు టాక్‌!